కరోనా సంక్షోభం చుట్టుముట్టినప్పటి నుంచి ప్రతివారినీ ఏదో ఒక కోణంలో కొత్త భయాలు వెంటాడుతూ ఉన్నాయి. తమ ఉనికి ఏమవుతుంది, దీని పర్యవసానం ఏమిటి, ఇంకా ఎంతకాలం ఇలా భయపడుతూ జీవించాలి... లాంటి సందేహాలే కాకుండా కుటుంబ భవితవ్యం, పిల్లలు, సంబంధ బాంధవ్యాలు, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు, సామాజిక అంశాలు... ఇలా అనేక విషయాల పట్ల జవాబులు లేని ప్రశ్నలు ఉదయించి క్రమంగా భయాలుగా రూపాంతరం చెందుతున్నాయి.
కొవిడ్ వ్యాధి పట్ల ఎవరికీ సరైన అవగాహన లేకపోవడం, పూర్వాపరాలు సమగ్రంగా తెలియక పోవడం లాంటివీ ఇందుకు కారణాలే. చాలామంది లేనిపోనివి ఊహించుకోవడంవల్లే ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురై చేజేతులా ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. భయాన్ని లోలోపలే దాచుకుంటే తగ్గదు సరికదా, అంతకంతకు పెరిగిపోతుంది. ఫలితంగా రానురాను మనసును మరింత దౌర్బల్యానికి గురి చేస్తుంది. దాన్ని నియంత్రించడంలో విఫలమైతే- అది అలాగే పెరిగి ఆత్మహత్యకూ ప్రేరేపిస్తుంది. కాబట్టి, ఆందోళన వీడి ధైర్యంగా ఉండటం అవసరమని గమనించి మెలగవలసిన తరుణమిది.
మానసిక సంసిద్ధతే ముఖ్యం
ఆందోళనలు ముప్పిరిగొన్న సమయంలో ప్రశాంతంగా ఉండి, వాస్తవికత దిశగా ఆలోచించగలిగితే ఆ స్థితినుంచి బయట పడే అవకాశం ఉంది. దానికి కావలసిందల్లా మానసిక సంసిద్ధత. సృష్ట్యాది నుంచి ఎన్నో విపత్కర పరిస్థితులను చూసింది ఈ ప్రపంచం. ‘కష్టాలు మనిషికి కాక మానులకు వస్తాయా’ అని పెద్దలు అన్న మాటను గుర్తించాలి. మన పురాణాలు, చరిత్రలో ధైర్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేసే ఎన్నో ఉదంతాలు స్ఫూర్తి కలిగిస్తున్నాయి. ఎన్నో సమస్యలు, క్లిష్టమైన చిక్కుముళ్లు ఎదురైనప్పుడు దీటుగా వాటిని ఎదుర్కొన్న ఎందరో మహావీరుల కథలు మనకు తెలుసు. వారంతా ధైర్యంతో, చాకచక్యంతో కష్టాలను అధిగమించారు. కాబట్టి వాటిని మననం చేసుకోవాలి. అనవసరమైన ఆందోళన తగ్గించుకోవాలి. వాస్తవికంగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి.
ధైర్యం చేసుకుంటేనే
మనో నిబ్బరం ఉంటే ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొని నిలదొక్కుకోవచ్చని పెద్దలు చెబుతారు. ఎందుకంటే వ్యాధి కంటే- అది వస్తుందనే భయమే ఎక్కువ ప్రమాదకరం. అందుకే మనో నిబ్బరం ఉన్నవారు సమస్యనుంచి త్వరగా, సులభంగా బయటపడతారు. వ్యక్తుల మానసిక స్థాయిని బట్టికూడా ఇది ఉంటుంది. కొందరు చిన్న సమస్యకే బెంబేలెత్తిపోతారు. మరికొందరు మిన్నువిరిగి మీద పడ్డా చలించరు. జీవితంలో ఎదురుదెబ్బలు తిన్నవారు, మానసికంగా దృఢంగా ఉన్నవారు కష్టాలను సులభంగా భరించగలిగి ఉంటారు. ఆపదలు కలిగినప్పుడు ధైర్యం, సంపదల్లో తులతూగేవేళ ఓర్పు, సభలో మాట్లాడేటప్పుడు వాక్చాతుర్యం, విద్యపట్ల ఆసక్తి కలిగి ఉండటం సజ్జనులకు ప్రకృతిసిద్ధంగా ఏర్పడే గుణాలని సుభాషితాల్లో ఏనుగు లక్ష్మణకవి పేర్కొన్నారు.
పుస్తకాలు- వ్యాపకాలే విరుగుడు
భయాల నుంచి మనసును మరల్చి ప్రశాంతమైన జీవనం గడపడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇవి వయసుల వారీగా ఉంటాయి. విద్యార్థులు, పిల్లలు- పాఠ్యాంశాలు, కథల పుస్తకాలు చదవాలి. పెద్దవారి పర్యవేక్షణలో మెలగాలి. గృహస్థులు, మహిళలు తమ దైనందిన కార్యక్రమాలతో పాటు కొన్ని మంచి వ్యాపకాలు కల్పించుకోవాలి. ఉదాహరణకు మనకు ఇష్టమైన పనిని ఎంచుకోవడం. అది సాహిత్య పఠనం, సాహిత్యాన్ని సృష్టించడం, గానం, చిత్రలేఖనం ఏదైనా కావచ్చు. ఈ తరహా వ్యాపకాలవల్ల మనసు తేలికపడటమే కాకుండా, ఒత్తిడిని సులభంగా అధిగమించేందుకూ వీలుంటుంది. వయసు పైబడ్డవారు ఆధ్యాత్మిక విషయాలు తెలిపే పుస్తకాలను చదవాలి. ధ్యానం, పుస్తక పఠనం, తేలికపాటి గృహ వ్యాయామం చేయడం లాంటి వ్యాపకాలు కల్పించుకోవాలి. మరొకరితో తమను పోల్చుకోవడం, ఊహించుకోవడం వంటివి మానేయాలి. సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తే వదంతుల వైపు అతిగా దృష్టి మరల్చవద్దు. చిన్న చిన్న అనారోగ్యాలు కలిగితే కంగారు పడవద్దు. ఇంటి/ చిట్కా వైద్యం చేసుకోవాలి. ముఖ్యంగా ఒక్క విషయం గమనించాలి. కరోనాకి ప్రత్యేకంగా ఏ మందులూ లేకపోయినా కోలుకుంటున్న వారి శాతం చాలా ఎక్కువగానే ఉంది. వారంతా అందుబాటులో ఉండే మందులతో, వ్యాధి నిరోధకతను పెంచే ఆహారం స్వీకరించడంద్వారా వ్యాధి, దాని లక్షణాల నుంచి బయట పడుతున్నారని గమనించాలి. పూర్తిస్థాయిలో అధ్యయనాలు జరగకపోయినా ఒక పరిశీలన ఏమిటంటే భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉన్నా ఇతర దేశాలతో పోలిస్తే మరణాలు చాలా తక్కువ. మనం తినే ఆహారం ఔషధ గుణాలు కలిగి ఉంది. ఇరుకైన ఏసీ గదుల్లో కాకుండా- గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించే ఇళ్లలో మనం నివసిస్తున్నాం. ఈ తరహా మన అలవాట్లే ఇక్కడ మరణాలు తక్కువగా ఉండేందుకు కారణమని ఒక అంచనా. ఎవరికి వారు మానసిక స్థైర్యాన్ని పెంచుకుని ముందడుగు వేస్తే చాలా వరకు సమస్యలు అధిగమించవచ్చనేది మానసిక వైద్య నిపుణుల మాట. దీన్నే భావనా బలం అంటారు. నేటి పరిస్థితుల్లో భావనా బలంతోనే ప్రపంచ మానవాళి ఈ ఆపద నుంచి గట్టెక్కాలి. వైరస్ భయానికి అదే విరుగుడు!
- రమా శ్రీనివాస్