ETV Bharat / opinion

మూగ ప్రేమ పాఠాలు - Corona changes in the world]

మానవుడు అర్థం చేసుకుంటే ప్రకృతే సర్వం నేర్పిస్తుంది. ప్రస్తుత తరుణంలో కరోనా మహమ్మారి అదే చేస్తోంది. సదాచారాలను గుర్తుచేస్తూ.. వేదాంతాన్ని అలవరుస్తోంది. అన్నమయ్య మాటల్లోని ప్రగాఢ తాత్వికతను కొవిడ్​ బోధించినంత వేగంగా, లోతుగా మరెవ్వరూ తలకెక్కించలేరు. దత్తాత్రేయుడు లాంటి వారే అల్ప జీవులనుంచి అమోఘమైన పాఠాలు నేర్చుకున్నారు. ఇక మనమెంత! పాతాళలోకంలోకి దిగజారిపోయిన మానవతా విలువలను కనీసం మన లోకానికి రప్పించాలి కదా.!

Corona will teach the lessons for Human being
మూగప్రేమ పాఠాలు
author img

By

Published : Jul 19, 2020, 7:30 AM IST

Updated : Jul 19, 2020, 7:37 AM IST

'నాకు ఇరవైనాలుగు మంది గురువులు' అని యదు మహారాజుకు చెప్పాడు దత్తాత్రేయుడు. 'ప్రకృతినుంచి పంచభూతాలనుంచి సూర్యచంద్రులనుంచి... పావురాలు కొండచిలువ మిడతలు తేనెటీగలు... అన్నింటినుంచీ పాఠాలు నేర్చాను' అన్నాడాయన. మనిషి అర్థం చేసుకోవాలేగాని- ప్రతి మనిషితో సంభాషణ, ఎదురయ్యే ప్రతి సన్నివేశం ఏదో పాఠాన్ని బోధిస్తూనే ఉంటుంది. ఆఖరికి కరోనా సైతం మనిషికి ఎన్నో నేర్పిస్తోంది. సదాచారాలను గుర్తుచేస్తోంది. వేదాంతాన్ని అలవరుస్తోంది. పై ముసుగులు తొలగిస్తోంది. 'నానాటి బ్రతుకు నాటకము... పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడిమి పని నాటకము' అన్న అన్నమయ్య పలుకుల్లోని ప్రగాఢ తాత్వికతను కరోనా బోధించినంత వేగంగాను, లోతుగాను మరెవ్వరూ మన తలకు ఎక్కించలేరు.

'కరోనా' పాఠాలు బోధిస్తోందా?

తల్లిదండ్రులను తరిమేస్తున్న కన్నబిడ్డలు, వైద్యులపై దాడి చేస్తున్న రోగులు, వద్దుపొమ్మంటున్న వల్లకాడు... ఇవన్నీ మన జీవితంలో వెలిసిపోతున్న రంగులు. కన్నీళ్లలో సైతం కనికరం లేని చప్పదనమే తప్ప, విషాదపు ఉప్పదనం లేకుండాపోవడం- డొల్లతనమే అవుతుంది! 'మనో రోగస్థుడై దేహి తాపూసిందేటిది, పూతలేటివి' అన్న ధూర్జటి ప్రశ్నకు లోపలి కుళ్లును దాచిపెట్టిన మనిషి ఏం చెబుతాడు? ఇన్నాళ్లుగా తెగ ఒలకబోసిన మమతానురాగాలు గంపలతో ఎత్తిపోసిన ప్రేమాభిమానాలను గుర్తుచేసి 'సదా మూఢత్వమేగాని తా చేసిందేటిది, చేతలేటివి- అని నిలదీస్తే ఏం బదులిస్తాడు? కరోనా ఎంతో విలువైన పాఠాలను బోధిస్తోందా, లేదా? 'రోగమూ ఒక గురువే' అని నిరూపిస్తోందా లేదా? 'ధర్మేతర వర్తనులును దుర్మంత్రులునైన జనులు దురితము లొందున్‌' అన్న భాగవత సూక్తిని గుర్తుచేసేలా దండనీతిని ప్రయోగిస్తున్నట్లే ఉంది. జాతి గుండెల్లో తనదైన శైలిలో చెరగని విషాదాన్ని ముద్రిస్తోంది. రాజుదైనా బంటుదైనా గమ్యం ఒకటేనని తేల్చి చెబుతోంది.

అలవడిన క్రమశిక్షణ

'ఈ ధరణిన్‌ మూర్ఖుల దెల్పునెవ్వడు, సుధాధారానుకారోక్తులన్‌... మంచి మాటలతో బుద్ధిహీనులను దారికి తీసుకురావడం కష్టం' అన్నాడు భర్తృహరి. ఆ పని 'తీపు రచింపన్‌ లవణాబ్ధికిన్‌ మధుకణంబుం చింద యత్నించుటల్‌...' తేనె చిలకరించి సముద్ర జలాలను తియ్యగా చేయడం లాంటిదన్నాడు. కరోనా తీరు చూస్తుంటే మానవులందరినీ ఆ పద్దులోనే జతకడుతున్నట్లుంది. తరతమ భేదాలను చెరిపేసి, అందరినీ ఒకే గాటకు కట్టి మరీ క్రమశిక్షణను అలవరుస్తున్నట్లుంది. విశ్వామిత్రుణ్ని కామజలధిలో ముంచి తేల్చింది మేనక. చివరికెప్పుడో కళ్లు తెరిచాడు మహర్షి. 'గొప్పపాఠం నేర్పిందీమె' అనుకొన్నాడు. 'కోరక పరోక్ష వైరాగ్య గురువువైతి... ఎంత క్రిందికి గుంజినావొ- అంత పైకిని చను మార్గము అరసినావు' అంటూ వీడ్కోలు పలికాడు- విశ్వనాథవారి విశ్వామిత్రుడు. అచిరకాలంలో బ్రహ్మర్షిగా ఆవిర్భవించాడు.

అదే గురువు!

మన పాలిట కరోనాయే వైరాగ్య గురువు కావాలి. మనుగడలో మంచి మార్పులు తేవాలి. అప్పుడు ప్రకృతిలో ప్రతి జీవీ మనకు గురువుగానే భాసిస్తుంది. కరోనా సంక్షోభంలో పాడి ఆవును మేపలేక తమిళనాట పాలమేడు గ్రామానికి చెందిన వ్యక్తి- ఆ ఆవును అమ్మేశాడు. తరలిస్తున్న వాహనాన్ని ఎద్దొకటి తీవ్రంగా అటకాయించింది. మధ్యలో దానికెందుకంటే- అవి రెండూ స్నేహితులు. నిత్యం కలిసి మేతకు పోయేవి. ఆ మూగప్రేమతో ఎద్దు పరిపరి విధాల ప్రతిఘటించింది. చివరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యంతో గెలిచింది. అయినవాళ్లనే కసాయిల్లాగా విడిచిపెట్టేస్తున్న మనకు ఆ నోరులేని జంతువు విలువైన పాఠాన్ని బోధించింది. ప్రేమాభిమానాలకు భాష్యం చెప్పింది. దత్తాత్రేయుడంతటివాడే అల్పజీవులనుంచి అమోఘమైన పాఠాలు నేర్చుకోగా లేంది, మనమెంత! పాతాళలోకంలోకి దిగజారిపోయిన మానవతా విలువలను కనీసం మన లోకానికి రప్పించాలా, వద్దా?

ఇదీ చదవండి: కరోనా విలయం-3 రోజుల్లో లక్ష కేసులు

Last Updated : Jul 19, 2020, 7:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.