రేపు ఏం జరగబోతోందో- వచ్చే వారం, నెల, సంవత్సరాల్లో ఏది ఎందుకు ఎలా జరగబోతోందో ముందే చెప్పేయగలిగిన అద్భుతశక్తి రాజకీయ నాయకుడికి ఉండాలి. తాను చెప్పింది ఎందుకు జరగలేదో ఆ తరవాత అంతే నమ్మకంగా చెప్పుకోగలిగిన సామర్థ్యమూ ఉండాలి’ అన్నారు విన్‌స్టన్ చర్చిల్. చాలామంది దేశాధినేతల్లానే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ నైపుణ్యాన్ని ఒడిసిపట్టుకున్న అసలుసిసలు ‘రాజకీయ నాయకరత్నమే’!
కట్లు తెంచుకున్న కరోనా తరుముకొస్తున్నా సరే- ‘ఏం కాదు... అదసలు సమస్యే కాదు’ అన్న దీర్ఘసూత్రులు డొనాల్డ్ దొరవారు! ప్రమాదం పక్కింటిదాకా వచ్చేసిందండీ అని యంత్రాంగం మొత్తుకున్నా, ‘మన గుమ్మంలోకి అడుగుపెట్టే ధైర్యం దానికి లేదయ్యా’ అన్న ధీరచిత్తులాయన. పగటికల పరిమారిపోయి కరోనా రక్కసి గుమ్మం దాటేసొచ్చి ఏకంగా నట్టింట్లో శివాలేయడం మొదలెట్టాక- ‘అయ్యెయ్యో... ఇదెంత ప్రమాదకరమైందని ఎవరూ చెప్పలేదేమిటి చెప్మా’ అంటూ నగుమోమును ఆశ్చర్యార్థకం చేసిన అధ్యక్షుల వారి గడుసుదనం- అమెరికన్ల గుండెల్లో దడపుట్టిస్తోంది!
చాలా విషయాల్లో ట్రంప్ మాటలు మెక్సికన్ సరిహద్దులు దాటుతాయి కానీ, చేతలు ‘తెల్ల ఇల్లు’ తలుపులు దాటవన్నది వాషింగ్టన్ వీధుల్లో వినిపించే గుసగుస! కరోనా కీళ్లు విరిచేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామన్న ఆయన భరోసా మేకపోతు గాంభీర్యమైన వేళ, ఆరున్నర లక్షలకు పైబడిన బాధితులతో అమెరికా అల్లాడిపోతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఏలికల ఏమరుపాటుతనానికి ఇది పరాకాష్ఠ అంటూ విమర్శల వాన కురిసినా ట్రంప్ అదరరు... బెదరరు! పైపెచ్చు ఇతర దేశాలను బెదిరిస్తూ ఉంటారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల్ని పంపకపోతే భారత్ మీద ప్రతీకారం తీర్చుకుంటామన్న ఆయనలో- ‘చాక్లెట్ ఇవ్వకపోతే గిచ్చుతారరేయ్’ అనే బడిపిల్లాణ్ని చూసుకుని నవ్వుకుంది ప్రపంచం. ‘నవ్విపోదురు గాక...’ అనుకున్న డొనాల్డ్ దొరవారు మాత్రం చలించలేదు. మాత్రలు ఇవ్వడానికి భారతదేశం ఒప్పుకొన్న మరుక్షణం- ‘తడికన్నులనే తుడిచిన నేస్తమా’ అంటూ స్నేహగీతాలు ఆలపించేశారు. ‘పెడితే పెళ్లి... పెట్టకపోతే పెటాకులు’ అన్నట్లుగా సాగిపోతున్న ఈ దొరతనం- సమస్త లోకానికి వినోదమైనా... సొంతదేశానికి మాత్రం కడుపులో దేవినట్లు ఉంటోంది!
కరోనా దాడికి బిక్కుబిక్కుమంటున్న ఒక్క న్యూయార్క్ నగరానికే 30వేల వెంటిలేటర్లు అవసరమన్న గవర్నర్ అంచనాను కూడా కరివేపాకులా తీసిపారేసిన తెంపరితనం ట్రంప్ మహాశయులది! మీరు మరీ ఎక్కువ చెబుతున్నారని అవతలివాళ్లను వెటకరించిన ఆయన, తాను చేయాల్సిన దాంట్లో చాలా తక్కువ చేస్తున్నానని గుర్తించేసరికి గుదిబండ మెడకు తగులుకుంది. లాక్‌డౌన్ పెడదాం మహాప్రభూ అన్న నిపుణులందరి నోళ్లూ మూయించిన పెద్దమనిషి ఇప్పుడు చేతులు కాలాక ఆకుల కోసం వెదుకుతున్నారు. తనను తాను ‘యుద్ధకాలపు అధ్యక్షుడి’గా అభివర్ణించుకుంటూ ఆయన చేస్తున్న హడావుడి- గోదారి వరదకు గడ్డిమోపుల అడ్డుకట్టలా కనిపిస్తోందంటే తప్పు చూసేవాళ్లది కాదు!
‘కరోనా మాయమైపోతుంది. మన దేశంలోంచి ఓ అద్భుతంలా అది మాయమైపోతుంది’ అన్నది ట్రంప్ వ్యాఖ్యల్లో కలికితురాయి. అధ్యక్షుడే అద్భుతాల మీద ఆశలుపెట్టుకుంటే సామాన్యుల సంగతేంటో ఆయన ఆలోచించరు. డబ్ల్యూడబ్ల్యూఈ మల్లయుద్ధాలతో చిరకాల అనుబంధమున్న ట్రంప్ మహాశయులకు ముష్టిఘాతాలు విసరడమంటే మహా సరదా! అది వ్యాపారంలోనైనా విదేశాంగ విధానంలోనైనా సరే. ఆయన ఆ సూత్రాన్నే నమ్ముకున్నారు. ఇప్పుడు కరోనాను కూడా అలాగే నిలబెట్టి కొట్టేద్దామనుకుని ఉంటారు. కానీ, అదే ఎదురుదాడి చేసేసరికి డబ్ల్యూహెచ్‌ఓ నుంచి అందరినీ ఆడిపోసుకుంటూ ఆగ్రహోదగ్రులవుతున్నారు.
‘అంతా నువ్వే చేశావ్’ అంటూ కనిపించినవాళ్లందరినీ వేలెత్తి చూపిస్తున్న ఆయన మిగిలిన నాలుగు వేళ్లూ తన వైపే తిరిగి ఉన్నాయన్న చిన్న విషయాన్ని చులాగ్గా దాచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ శల్య సారథ్యపు గందరగళంలో అగ్రరాజ్యం పరిస్థితి పెనంలోంచి పొయ్యిలోకి జారిపోతుండటమే అసలైన విషాదం!
-శైలేశ్ నిమ్మగడ్డ
ఇదీ చదవండి:మరో వ్యాక్సిన్‌ను పరీక్షిస్తున్న భారత శాస్త్రవేత్తలు