శంఖంలో పోస్తేగానీ తీర్థంకాదు. సర్కారీ దస్త్రాలు ధ్రువీకరిస్తేనే గానీ ఈ కర్మభూమిలో జనన జీవన మరణాలను గుర్తించే ప్రసక్తే లేదు. పింఛను సొమ్ముల కోసం వ్యక్తిగతంగా హాజరైనా- బతికేఉన్నట్టు సంబంధిత శాఖ నుంచి సర్టిఫికెట్టు పట్టుకురావాల్సిందేనని ప్రభుత్వాఫీసులు పట్టుబట్టడంలోని ఆంతర్యం అదే. అలాగని అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా జనన మరణాలు చులాగ్గా నమోదయ్యే వ్యవస్థ ఇండియాలో వేరూనుకొందా అంటే, అదీ లేదు. పట్టణాలు, పల్లెల మధ్య సాంకేతిక అగాధాలే కాదు, ఊహాతీత స్థాయిలో వైద్యసేవల అంతరాలూ నిక్షేపంగా వర్ధిల్లుతున్నవేళ- కొవిడ్ మహమ్మారి కసిగా కోరసాచింది. పచ్చని కుటుంబాల్లో నిప్పులు పోసింది. గత ఏడాది కరోనా ప్రకోపం కంటే, ఈ సంవత్సరం కొవిడ్ విజృంభణ ఎన్నో రెట్లు జనజీవితాల్ని దుర్భర దుఃఖ భాజనం చేసేసింది. మూడు కోట్లకు చేరువ అవుతున్న కేసులు 3.67 లక్షల మరణాలు నమోదైనట్లు సర్కారీ గణాంకాలు చాటుతున్నా, మృతుల సంఖ్య అంతకు ఎన్నో రెట్లు ఉంటుందని పలు అధ్యయనాలు మొత్తుకొంటున్నాయి. వాటన్నింటినీ తప్పాతాలుగా ఘనత వహించిన నీతిఆయోగ్ తోసిపుచ్చినా- మరణాల జాబితాలో రాష్ట్రాలవారీగా సాగుతున్న సవరణలు కొవిడ్ మోగించిన మృత్యుఘోషకు కొత్తగా అద్దం పడుతున్నాయి. కోర్టు ఆదేశాలే ఈ సమీక్షకు కారణమన్నది గమనార్హం. చిత్తగించండి ఆ కథాక్రమం...
దౌర్బల్యాల్ని చూపేవే..
బిహార్ రాష్ట్రంలో కొవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య మొన్న మంగళవారం దాకా 5,458 అని ప్రభుత్వమే ప్రకటించింది. ఆ మరునాటికల్లా అది ఎకాయెకి 72శాతం పెరిగి దాదాపు తొమ్మిదిన్నర వేలకు చేరింది. బక్సర్ జిల్లాలో మృతుల సంఖ్య నమోదుపై పట్నా హైకోర్టు దృష్టిసారించి అవకతవకల్ని వేలెత్తి చూపడంతో- అంతక్రితం ప్రైవేటు ఆసుపత్రులు, ఇళ్లలోనూ సంభవించిన మరణాల్నీ రాష్ట్ర సర్కారు జాబితాలోకి ఎక్కించింది. కొవిడ్ మృతుల కుటుంబాలకు నీతీశ్ ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయల పరిహారం ప్రకటించిన నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామమది! మృతుల వివరాలు ఏ రోజుకారోజు అందుబాటులోకి రావడం లేదంటూ మహారాష్ట్ర సర్కారు సైతం 10,673 మంది మృతుల్ని కొత్తగా గుర్తించి అధికారిక జాబితాకు ఎక్కించింది. ఫలితంగా మహారాష్ట్రలో మరణాలు లక్షా ఆరువేలు దాటిపోయాయి. 'మహమ్మారిపై పోరాటంలో కేసులు-మృతుల సంఖ్య వివరాల్ని పారదర్శకంగా వెల్లడించడం ఎంతో కీలకం. కొవిడ్ తీవ్రతను బయటపెట్టే మృతుల వాస్తవ సంఖ్యను ప్రకటించడం ప్రభుత్వానికి అప్రతిష్ఠేమీ కాదు' అని విపక్ష భాజపా నేత ఫడణవీస్ స్పష్టీకరిస్తున్నా- గుజరాత్‌లో కమలం పార్టీ సర్కారు అదే ఆరోపణల్ని ఎదుర్కొంటోంది. ఉత్తరాఖండ్‌లో సాగిన సవరణా మృతుల చిట్టాలో 922 మందిని కొత్తగా చేర్చింది. గంగానదిలో కొట్టుకొచ్చిన మృతదేహాలు యూపీవాసులవని బిహార్ ప్రభుత్వం మొన్నామధ్యన ప్రకటించడం తెలిసిందే. కొవిడ్ మృతుల చిట్టాల్లోకి చేరలేని ఆ అనాథ దేహాల ఆత్మఘోష- నయాభారత్ దౌర్బల్యాల్ని వేలెత్తి చూపేదే!
'ఇండియా సైతం లెక్కల్లో'..
పేదరికాన్ని దాని కవలలైన ఆకలి అనారోగ్యాల్ని పరిమార్చి పౌరులందరి గౌరవప్రద జీవనానికి భరోసా ఇస్తున్నామన్న స్వాతంత్య్ర సేనానుల మహదాశయ ప్రకటనలతో 1947 ఆగస్టు 15న ఇండియా ప్రస్థానం మొదలైంది. 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో పేదరికం పోయిందా- లేదు. ఆకలి పోయిందా- లేదు. అనారోగ్యం మలిగి పోయిందా- లేనే లేదు! వందేళ్ల క్రితం వలస పాలకుల జమానాలో ఇలాగే స్పానిష్ ఫ్లూ విరుచుకుపడి ప్రపంచ దేశాల్ని వణికించగా- ఇండియాలో మృత్యుఘోష మిన్నంటింది. గంగాతీరమంతా సామూహిక శవ దహనాల విలాపాగ్నుల్ని మహాత్మాగాంధీ స్వయంరచనే అక్షర బద్ధం చేసింది. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమైనా ఉందా? భారత్‌లో కొవిడ్ మృతుల సంఖ్యపై న్యూయార్క్‌టైమ్స్ కథనం రాస్తే- అవన్నీ వక్రీకరించిన అంచనాలని, సంపూర్తి వివరాల్ని పారదర్శకంగా వెల్లడిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. గంగ దాని ఉపనదుల్లో మృతదేహాలను పడేయకుండా నిఘా పెట్టాలని, కొట్టుకువస్తున్న శవాలు కనిపిస్తే గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.
శ్మశానవాటికల్లో ఖాళీల్లేక, అమాంతం పెరిగిన అంత్యక్రియల ఖర్చును భరించలేక గంగానది ఒడ్డున ఇసుకలో పార్థివ దేహాల్ని పూడ్చిన ఉదంతాలూ నమోదయ్యాయి. ఇండియాలో కొవిడ్ మరణాల్ని 4.3 లక్షలు తక్కువగా నమోదు చేశారన్న వాషింగ్టన్ విశ్వవిద్యాలయ అధ్యయనం- అమెరికా, రష్యా, బ్రెజిల్, మెక్సికోల్లోనూ మృతుల వివరాల్ని తగ్గించి చూపారని శాస్త్రీయ సగటు గణాంకాల ప్రాతిపదికన నిగ్గుతేల్చింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మృతుల సంఖ్య ఆయా దేశాలు ప్రకటించిన దానికంటే రెండుమూడింతలు అధికంగా ఉంటుందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇండియా సైతం లెక్కల్లో తకరారుకు అతీతం కాదని స్పష్టీకరించింది. పటిష్ఠంగా ఉన్న బీమా పరిశ్రమ కఠిన ఆంక్షలు విధించడంతో అమెరికాలో మృతుల సంఖ్య వివరాల్లో తేడాపాడాలు తక్కువగా ఉన్నాయి. ఏప్రిల్ 16న గుజరాత్‌లోని ఏడు నగరాల్లో గల శ్మశాన వాటికల్లో కొవిడ్ విధినిషేధాల మేరకు దహనం, లేదా ఖననం అయిన పార్థివ దేహాల సంఖ్య దాదాపు 700 కాగా ఆరోజు ప్రభుత్వం నిర్ధారించిన మొత్తం మరణాలు కేవలం 78. ఇంతలా కొవిడ్ మృత్యుపాశాల్ని కప్పిపుచ్చిన రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం మానవ మహా విషాదాన్ని మరింతగా ఎగదోస్తోంది!
ఎక్కడ ఏ తరహా ఉత్పరివర్తనాలు ఏ స్థాయి మారణహోమానికి కారణమవుతున్నాయన్న సరైన సమాచార నిధి- కొవిడ్‌పై పోరులో సరైన అస్త్రాల నిర్మాణానికి శాస్త్రవేత్తలకు ఉపయుక్తమవుతుంది. ఆ తరహా కీలక సమాచారాన్ని రాష్ట్రాలు బిగపట్టిన కొద్దీ- కొవిడ్ మహమ్మారికి కొత్త కోరలు తొడిగినట్లే అవుతుంది. మరోవంక, కొవిడ్ మరణాల్ని నిక్కచ్చిగా గుర్తిస్తేనే కదా- మృతుల కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతనైనంత సాయం చేయగలిగేది. కొవిడ్ కాటేసిన కుటుంబాల్లోని పిల్లల యోగక్షేమాలపట్ల; వారి విద్యాబుద్ధులు భవిష్యత్ నిర్మాణం పట్ల కేంద్రం పూర్తిగా దృష్టిసారించాలని సుప్రీంకోర్టు గతవారం ఆదేశించింది. అనాథ పిల్లల కోసం ఓ పథకాన్ని ఖరారు చేశామని విధివిధానాలు రూపకల్పన దశలో ఉన్నాయంటున్న కేంద్రానికి- కొవిడ్ మృతుల గుర్తింపు సక్రమంగా సాగకపోతే అవసరార్థుల్ని ఆదుకోవడం ఎలా సాధ్యపడుతుంది? మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బుల వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారిపై కొవిడ్ మృత్యుపంజా విసురుతుందన్నది ముందునుంచీ తెలిసిందే. అలా కొవిడ్‌కు బలైపోయిన అభాగ్యుల్ని ఆయా ఇతర రుగ్మతలే పొట్టన పెట్టుకొన్నట్లుగా నిర్ధారించడం- అమానుషత్వానికి పరాకాష్ఠే! ప్రత్యేక విపత్తుల చట్టం కింద కొవిడ్ కల్లోలాన్ని గుర్తించిన దరిమిలా మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల వంతున నష్టపరిహారం చెల్లించే అంశంపై కేంద్రం సానుకూలంగా యోచిస్తోంది. ఆత్మీయుల్ని బతికించుకోవడానికి ఉన్నదంతా ఊడ్చిపెట్టి భారీగా అప్పులు చేసి కుదేలైపోయిన వేల కుటుంబాలకు కేంద్రం తోడ్పాటు ఎంతోకొంత ఆసరా కాగలుగుతుంది. ఆ నోటికాడ ముద్దనూ కబళించేలా మరణాల గుర్తింపులో అక్రమాలు గుండెల్ని మండించేవే. కొవిడ్ మృతుల క్రోడీకరణ సక్రమంగా సాగకపోతే- సంక్షేమ రాజ్య భావనకు సమాధి కట్టినట్లే!
- పర్వతం మూర్తి
ఇవీ చదవండి: 'ఆమె' శరీరంలో 32 రకాల మ్యూటేషన్స్