ETV Bharat / opinion

చతికిలబడిన వాహన రంగానికి 'వలస' దెబ్బ

వాహనరంగాన్ని గతేడాది నుంచి అనేక కష్టాలు చుట్టుముట్టాయి. కరోనా రాకతో మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డట్లు అయింది దాని పరిస్థితి. లాక్​డౌన్​ ఎత్తివేస్తే మళ్లీ పుంజుకుంటుందన్న ఆశలున్నప్పటికీ ఒప్పంద కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లడం వల్ల మరో చిక్కు సమస్య ఏర్పడుతోంది. ప్రభుత్వ అనుమతి రాగానే వాహన సంస్థలు ఉత్పత్తికి రంగం సిద్ధం చేసుకుంటున్న సమయంలో వలస కార్మికులు సొంత రాష్ట్రాల బాట పట్టడం కలవరపెడుతోంది.

AUTO MOBILE INDUSTRY
వాహనరంగం
author img

By

Published : May 13, 2020, 8:50 AM IST

గోరుచుట్టుపై రోకటి పోటులా దేశ వాహనరంగంపై దెబ్బమీద దెబ్బపడుతోంది. ఆర్థిక మందగమనం కారణంగా నిరుడు ద్వితీయార్ధంనుంచి దేశవ్యాప్తంగా వాహన అమ్మకాలు మందగించాయి. అనంతరం ఈ ఏప్రిల్‌లో నిర్దేశిత ప్రమాణాల ప్రకారం వాహనాలన్నీ బీఎస్‌-4 నుంచి బీఎస్‌-6కి మారాల్సిన నిబంధనలు వచ్చిపడ్డాయి.

ఈ కష్టాలనుంచి కోలుకోకముందే కరోనా మహమ్మారి చావుదెబ్బ కొట్టింది. లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే పరిస్థితులన్నీ సద్దుమణిగి వాహన చక్రం మళ్లీ పరుగందుకుంటుందని భావిస్తున్న తరుణంలో ఒప్పంద కార్మికులు హడావుడిగా సొంత రాష్ట్రాలకు పయనమవుతుండటం వల్ల మరో చిక్కు సమస్య మొదలైందని పరిశ్రమ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రభుత్వ అనుమతి రాగానే వాహన సంస్థలు ఉత్పత్తికి రంగం సిద్ధం చేసుకుంటున్న సమయంలో వలస కార్మికులు సొంత రాష్ట్రాల బాట పట్టడం కలవరపెడుతోంది.

అత్యధికులు వారే..

వాహనాల తయారీ, విడిభాగాల పరిశ్రమలు, డీలర్‌షిప్‌లు, సర్వీస్‌ సెంటర్లు, గ్యారేజీలు, స్పేర్‌పార్ట్‌ల దుకాణాలు- అన్నింటిలో కలిపి వాహనరంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా 3.7 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. వీరిలో అత్యధికులు అర్ధ నైపుణ్యం లేదా నైపుణ్యలేమి ఉన్న ఒప్పంద కార్మికులే. ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో అన్ని విభాగాల్లోని కార్యకలాపాలు స్తంభించిపోయాయి.

కార్మికులకు ఉపాధి కరవైంది. చేతిలో చిల్లిగవ్వలేని గడ్డుపరిస్థితుల్లో శ్రామికులు సొంత రాష్ట్రాలకు తరలివెళ్లడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రవాణా సదుపాయాలు లేకపోవడంతో వందల మైళ్ల దూరాన్ని లెక్కచేయక కాలినడకన బయల్దేరుతున్నారు. ఈ ప్రయాణంలో కొందరు ప్రాణాలు కోల్పోతుంటే, చాలామంది నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ దుస్థితిపై అన్నివైపులా విమర్శలు పోటెత్తుతున్న నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు కార్మికులను సొంత ప్రదేశాలకు తరలించేందుకు 70 రైళ్లు ఏర్పాటు చేశాయి. వెయ్యి మంది చొప్పున ఇప్పటికే 60 రైళ్లు వలస కూలీలను గమ్యస్థానాలకు చేరవేశాయి. తెలుగు రాష్ట్రాలతోసహా అనేక ప్రాంతాల్లో ఇంకా వేలమంది సొంత ప్రదేశాలకు వెళ్ళేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు.

ఈ రాష్ట్రాల్లో..

మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్‌, గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటక, దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో.. ఆటోమొబైల్‌, ఆ అనుబంధ పరిశ్రమలు ఎక్కువ. ఈ రాష్ట్రాల్లో పనిచేసే ఒప్పంద కార్మికుల్లో ఎక్కువమంది ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌ తదితర రాష్ట్రాలకు చెందినవాళ్లే. కేవలం ఆటో విడిభాగాల రంగాన్నే తీసుకుంటే ఇందులో యాభై లక్షల మంది పని చేస్తున్నారని అంచనా. అందులో డెబ్భైశాతం వరకు అర్ధ నైపుణ్యం, నైపుణ్యం లేని ఒప్పంద కార్మికులే ఉన్నారన్నది ‘అక్మా’ (ఆటొమోటివ్‌ కాంపొనెంట్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌) అంచనా.

కుటీర పరిశ్రమలు, చిన్నచిన్న ఫ్యాక్టరీల్లోనూ ఆటోమొబైల్‌ సంబంధిత విడిభాగాలు తయారవుతుంటాయి. ఈ విడిభాగాలను టైర్‌వన్‌ కంపెనీలకు లేదా నేరుగా ఆటోమొబైల్‌ కంపెనీలకు అందించేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇలాంటి పరిశ్రమల్లోనూ అత్యధికులు వలస కూలీలు, ఒప్పంద కార్మికులే. కొద్దిరోజుల్లో పరిశ్రమలు పునఃప్రారంభమైనా కార్మికుల గైర్హాజరీతో రెండు రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

వలసలు ఆపితే..

వారి కొరతతో వాహన ఉత్పత్తి అనుకున్నంత వేగంగా చేయలేకపోవడం ఒకటైతే, కొత్తగా తీసుకున్న అనుభవలేమి శ్రామికులకు అధిక జీతాలు ఇవ్వాల్సి రావడం మరో సమస్య. అసలే నష్టాలతో కునారిల్లుతున్న రంగానికి ఇది కొత్తరకం తలనొప్ఫి ఇక డ్రైవర్ల సమస్య ఎప్పటినుంచో ఉందని రవాణా కంపెనీలు మొత్తుకుంటున్నాయి.

వాహన ఉత్పత్తి కేంద్రాల్లో తయారైన భారీ వాహనాలు, ట్రక్కులు, కార్లు, ద్విచక్రవాహనాలను నౌకాశ్రయాలు, గోదాములు, డీలర్ల దగ్గరకు చేర్చేందుకు అనుభవజ్ఞులైన చోదకుల అవసరం ఎంతో ఉంది. వీళ్లు అందుబాటులో ఉండకపోతే తయారైన వాహనాలను వినియోగదారులకు సకాలంలో అందించడం చాలా కష్టం. వలసలు ఆపేలా కార్యకలాపాలను కొద్దికొద్దిగా అనుమతించాలనీ, లేకపోతే ఆటోమొబైల్‌ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలవైపు మళ్లే ప్రమాదం ఉందని ది ఛాంబర్‌ ఆఫ్‌ మరఠ్వాడా ఇండస్ట్రీస్‌ అండ్‌ అగ్రికల్చర్‌ అధ్యక్షుడు గిరిధర్‌ సంగనేరియా ఆందోళన వ్యక్తం చేశారు.

అత్యవసర సేవగా..

లాక్‌డౌన్‌తో ఏప్రిల్‌లో ఒక్క వాహనమూ అమ్ముడుకాని దుస్థితి. ఉత్పత్తినుంచి అమ్మకాల దాకా అన్ని కార్యకలాపాలు స్తంభించిపోవడంతో వాహన రంగానికి రోజుకి రెండున్నర వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే నాలుగు లక్షలమంది ఉపాధి కోల్పోయారు. ఈ కష్టాలనుంచి గట్టెక్కాలంటే ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా అన్నిదశల్లో కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని పరిశ్రమ వర్గాలు కేంద్రానికి విన్నవించాయి. ఆటోమొబైల్‌ రంగాన్ని అత్యవసర సర్వీసుగా పరిగణించాలని వారు కోరారు. ఇబ్బందుల్లో కూరుకుపోయిన పరిశ్రమను గాడిన పెట్టేలా జీఎస్టీ తగ్గించడంతోపాటు తక్షణం ఆర్థిక ప్యాకేజీతో భరోసా ఇవ్వాలని, ద్రవ్య మద్దతు ప్రకటించాలన్న పరిశ్రమ డిమాండ్లు నెరవేరితే- వాహన రంగం సమీప భవిష్యత్తులో మళ్ళీ పుంజుకొనే అవకాశాలున్నాయి.

(రచయిత - శ్రీనివాస్‌ బాలె)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.