భారతావనిలో బ్యాంకు అంటే, ఓ తిరుగులేని నమ్మకం. వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే ఒకటి రెండు శాతం అధిక వడ్డీ వస్తుందన్న ఆశ, సమీపంలోనే ఉంది కదా అన్న దిలాసా గుండెల నిండుగా ఉన్న కోట్లాది మదుపరులకు ఎక్కడ ఏ సహకార బ్యాంకు దివాలా తీసిందన్నా పీడకలలు వెంటాడతాయన్నది వాస్తవం. నిరుడు పంజాబ్ మహారాష్ట్ర సహకార బ్యాంకు (పీఎంసీ) కుంభకోణం యావద్దేశాన్ని దిగ్భ్రాంతపరచింది. రూ.11,617 కోట్ల డిపాజిట్లతో ఏడు రాష్ట్రాలకు చెందిన తొమ్మిది లక్షల మంది డిపాజిటర్లతో అలరారిన పీఎంసీ బ్యాంకు ఆస్తుల్లో 70శాతానికిపైగా అంటే, రూ.6,500 కోట్లు ఒక్క హెచ్‌డీఐఎల్‌కే నిష్పూచీగా దోచిపెట్టింది. అందుకోసం 21వేలకుపైగా నకిలీ ఖాతాలూ సృష్టించింది. సహకారం మాటున కుబుసం విడిచే స్వాహాకారం 8.6 కోట్ల మదుపరులు, ఎకాయెకి రూ.5 లక్షల కోట్ల డిపాజిట్లుగల 1540 పట్టణ సహకార బ్యాంకుల భవితపైనే నీలినీడలు పరచే ప్రమాదాన్ని శంకించిన కేంద్ర ప్రభుత్వం 'బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్' సవరణలకు సమకట్టింది. సహకార బ్యాంకుల్లో వృత్తి నైపుణ్యాల్ని పెంచి, పెట్టుబడులకు అవకాశం కల్పించి, ఆర్‌బీఐ పటుతర పర్యవేక్షణ ద్వారా వాటి నిర్వహణ తీరుతెన్నుల్ని మెరుగుపరచేందుకు కేంద్రం బిల్లును సిద్ధం చేసి బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టింది.
సహకార బ్యాంకుల యాజమాన్య అంశాల్ని గతంలో మాదిరే కో ఆపరేటివ్ రిజిస్ట్రార్ చూసినా, బ్యాంకుల క్రమబద్ధీకరణకు ఆర్‌బీఐ వెలువరించే మార్గదర్శకాల్ని సహకార బ్యాంకులు ఔదల దాల్చాల్సి ఉంటుంది. ఆ కీలక బిల్లు చట్టరూపం దాల్చకపోవడంతో మోదీ ప్రభుత్వం సంబంధిత ఆర్డినెన్స్‌కు తాజాగా ఆమోదం తెలిపింది. సహకార బ్యాంకుల ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) నియామకానికి ఆర్‌బీఐ అనుమతి, దాని నిర్దేశాలకు లోబడి ఆడిటింగ్ ప్రక్రియ పారదర్శకత, జవాబుదారీతనాల్ని పెంచగలవంటున్నారు. వ్యవస్థాగత వైఫల్యాలకు తావు లేకుండా, సహకారాన్ని కొత్తపుంతలు తొక్కించడంలో ఆర్‌బీఐ పనితనం పదును తేలాలిప్పుడు!
వాణిజ్య బ్యాంకులు లేని చోటా ప్రజల బ్యాంకింగ్ అవసరాలు తీర్చి చిన్నతరహా పరిశ్రమలు, చిల్లర వర్తకులు, వృత్తి నిపుణులు, ఛోటా పారిశ్రామికవేత్తలు, స్థిరాదాయ వర్గాలకు ఆర్థిక సేవలందించడమే లక్ష్యంగా అర్బన్ సహకార బ్యాంకులు ఏర్పాటయ్యాయి. ఆయా బ్యాంకుల నిర్వహణలో నిజాయతీ, నిబద్ధత కొరవడిన చోటల్లా సంక్షోభాలు రాజుకొంటూనే ఉన్నాయి. పద్దెనిమిదేళ్ల క్రితం తెలుగునాట భాగ్యనగర్, కృషి, వాసవి, చార్మినార్, మెగాసిటీ వంటి బ్యాంకుల అర్ధాంతర మూత దరిమిలా నరసింహమూర్తి కమిటీ రోగ మూలాలతోపాటు నివారణ చర్యల్నీ నివేదించింది. గుజరాత్‌లోని మాధేపురా మర్కంటైల్ కో ఆపరేటివ్ బ్యాంకు దన్నుతో కేతన్ పరేఖ్ సృష్టించిన సెక్యూరిటీల మహా కుంభకోణం దేశాన్నే కుదిపేసింది. ఆ తరవాత, అర్బన్ సహకార బ్యాంకులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలతో అవగాహన కుదుర్చుకొన్న ఆర్‌బీఐ.. టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు ప్రతిపాదనలతో ముందుకొచ్చినా ఏం ఒరిగింది? ఈ బ్యాంకులపై రాష్ట్రాల తరఫున సహకార రిజిస్ట్రార్, కేంద్రం పక్షాన ఆర్బీఐలు చలాయించే ఉమ్మడి నియంత్రణ అనేక రుగ్మతలకు మూలకారణమవుతోందని కేంద్రం 2003లోనే గుర్తించినా, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. 1960నాటి మహారాష్ట్ర సహకార సంఘాల చట్టం, 1964నాటి ఏపీ చట్టం కింద ఏర్పాటై బ్యాంకింగ్ వ్యాపారంలో ఉన్న సంస్థలు 1949నాటి బ్యాంకుల నియంత్రణ చట్టం పరిధిలోకి రావంటూ లోగడ ఇచ్చిన తీర్పును ఏడువారాల క్రితం రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం తమకు వర్తించదంటే, వాటికి లైసెన్సు ఇవ్వరాదని, బ్యాంకింగ్ వ్యాపారంలో అవి ఉండరాదనీ సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. ఈ నేపథ్యంలో సహకార బ్యాంకుల్ని గాడినపెట్టి, వాటిపై కోట్లాది ఖాతాదారుల విశ్వాసం ఇనుమడించేలా చూడాల్సిన బాధ్యత ఇక ఆర్‌బీఐది!