ETV Bharat / opinion

చైనాపై జిన్‌పింగ్‌ ఉడుంపట్టు- అధ్యక్ష పీఠంపై వరుసగా మూడోసారి! - షీ జిన్​పింగ్​ అత్యంత శక్తిమంతమైన నేత

China CPC meeting 2022 : షీ జిన్‌పింగ్‌ చైనా కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ) ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర మిలిటరీ కమిషన్‌ (సీఎంసీ) అధ్యక్షుడిగా మూడోసారి పదవీ స్వీకారం చేయనున్నారు. ఆదివారం ప్రారంభమైన చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ మహాసభల్లో ఈ పరిణామం చోటు చేసుకోనుంది. మావో జెడాంగ్‌ తరవాత తిరిగి అంతటి శక్తిమంతుడైన అధినాయకుడిగా జిన్‌పింగ్‌ను ప్రతిష్ఠించడమే సీసీపీ ప్రధాన లక్ష్యం.

xi jinping president for life
చైనాపై జిన్‌పింగ్‌ ఉడుంపట్టు- అధ్యక్ష పీఠంపై వరుసగా మూడోసారి!
author img

By

Published : Oct 16, 2022, 7:31 AM IST

మావో పాలనలో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం నియంతృత్వ పోకడలు కనబరచింది. ఆ దేశం సామాజిక, ఆర్థిక ఉత్పాతాలను చవిచూసింది. భవిష్యత్తులో చైనా మళ్ళీ ఏక వ్యక్తి నిరంకుశత్వంలోకి, అవ్యవస్థలోకి జారిపోకూడదని డెంగ్‌ జియావో పింగ్‌ 1980లో పార్టీ నాయకత్వం చేపట్టిన వెంటనే రెండు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అవి- సమష్టి నాయకత్వం; అధ్యక్ష పదవిని రెండుసార్లకు మించి నిర్వహించకూడదని నియమం విధించడం. 2002-12లో హు జింటావో పదవీ కాలంలో కమ్యూనిస్టు పార్టీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఒకటి జియాంగ్‌ నాయకత్వంలోని షాంఘై వర్గం, రెండు- హు నాయకత్వంలోని యూత్‌ లీగ్‌ వర్గం. వారసత్వ పోరును నివారించడానికి రెండు వర్గాలూ అధికారం పంచుకోవాలని అంగీకరించాయి. 2008-2012 మధ్య హు జింటావో రెండోసారి అధ్యక్ష పదవిని నిర్వహించినప్పుడు చైనా ఉపాధ్యక్షుడిగా, సీఎంసీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన షీ జిన్‌పింగ్‌ను హూ వారసుడిగా ఎంపికచేశారు. డెంగ్‌ విధించిన సమష్టి నాయకత్వం, రెండు అధ్యక్ష పదవీ కాలాల పరిమితి, వర్గ పోరు.. కమ్యూనిస్టు పార్టీ కేంద్ర నాయకత్వాన్ని బలహీనపరచాయని జిన్‌పింగ్‌ నిర్ధారణకు వచ్చారు. ఈ అంశాలు పార్టీ ప్రధాన కార్యదర్శి అధికారాలకు కళ్ళెం బిగించాయని భావించారు. 2012లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టగానే ఈ లోపాలను సరిచేయడానికి నడుంకట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శికి కీలకమైన అధికారాలు కట్టబెట్టారు. తద్వారా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర నాయకత్వాన్ని బలోపేతం చేశారు.

పెత్తనం చలాయించేందుకే..
దేశాధ్యక్షుడికి రెండు పదవీకాలాల పరిమితిని 2018లో జిన్‌పింగ్‌ తొలగించారు. దాంతో ఆయన శాశ్వతంగా ఈ పదవిని చేపట్టడానికి మార్గం సుగమమైంది. దీంతోపాటు నవ యుగానికి చైనా లక్షణాలతో సామ్యవాద సాధనకు 'షీ జిన్‌పింగ్‌ భావధార' అనే కొత్త సిద్ధాంతాన్ని ముందుకుతెచ్చారు. 19వ చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభల్లో జిన్‌పింగ్‌ భావధారను పార్టీ నిబంధనావళిలో అంతర్భాగం చేశారు. చైనాలో కమ్యూనిస్టు పాలన పాదుకునేట్లు చేయడానికి, ప్రపంచ శక్తిగా చైనా ఆవిర్భావానికి తిరుగులేని మహా నాయకుడు అవసరమని, ఆ మహా నేత తానేనని జిన్‌పింగ్‌ భావధార సారాంశం. మార్క్సిస్టు భావజాలాన్ని చైనా సాంస్కృతిక వారసత్వంతో మేళవించే సాధనమే జిన్‌పింగ్‌ భావధార అని ప్రచారం చేశారు. చివరకు కమ్యూనిస్టు పార్టీపై కేంద్ర కమిటీ పెత్తనాన్ని, కేంద్ర కమిటీపై తన పెత్తనాన్ని సుస్థిరం చేసుకోవడం జిన్‌పింగ్‌ భావజాల లక్ష్యం.

చైనాను గొప్ప సోషలిస్టు దేశంగా రూపాంతరం చెందించి, ప్రపంచంలో నిరుపమాన శక్తిగా తీర్చిదిద్దాలని జిన్‌పింగ్‌ భావధార ఉద్దేశిస్తోంది. చైనా సమాజంలో సంస్థాగత సంస్కరణలను అమలు చేయాలని జిన్‌పింగ్‌ కంకణం కట్టుకుని తదనుగుణంగా కార్యాచరణకు ఉపక్రమించారు. చైనాను ప్రపంచంలో అగ్రరాజ్యంగా నిలపడానికి సాయుధ బలగాల ఆధునికీకరణ చేపట్టారు. ఆర్థికంగా ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పథకం పేరిట తూర్పు ఆసియా నుంచి ఐరోపా వరకు పెద్దయెత్తున మౌలిక వసతుల నిర్మాణాలను చేపట్టారు. ఏక పార్టీ పాలనలోనే చైనా బలీయంగా ఎదుగుతుందని జిన్‌పింగ్‌ విశ్వాసం. కమ్యూనిస్టు పార్టీ ఆధిక్యతను సుస్థిరం చేసుకోవడానికి సమాచార సాధనాలు, ఇంటర్నెట్‌, విద్యారంగాలను పూర్తిగా తన చెప్పుచేతల్లోకి తెచ్చుకున్నారు. చైనాలో వార్తలు, వ్యాఖ్యల ప్రవాహంపై డజనుకుపైగా ప్రభుత్వ సంస్థలు అనునిత్యం నిఘా వేస్తుంటాయి. ఆన్‌లైన్‌ సెన్సార్‌షిప్‌, నిఘా కోసం గోల్డెన్‌ షీల్డ్‌ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు కింద ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, కొన్ని గూగుల్‌ సేవలు చైనాలో లభ్యం కాకుండా నిరోధిస్తున్నారు. 2021లో పాఠశాలలు, కళాశాలల పాఠ్యప్రణాళికల్లో షీ జిన్‌పింగ్‌ భావధారను అంతర్భాగం చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే అనుమానంతో అనేక స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలను, మానవ హక్కుల న్యాయవాదులను, కార్యకర్తలను జైలుపాలు చేయడం, దేశ బహిష్కారం విధించడం వంటి దమన నీతిని చేపడుతున్నారు. 2018లో 'మీ టూ' స్త్రీవాద ఉద్యమాన్ని అణచివేయడం, స్వలింగ సంపర్కుల కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడం వంటివీ జరిగాయి.

మూడోసారి ముళ్ల బాట?
చైనా ప్రజలు రాజకీయాల గురించి కాకుండా ఆర్థికాభివృద్ధి గురించే ఆలోచించేట్లు చేయడంలో కమ్యూనిస్టు పార్టీ సఫలమైంది. కొవిడ్‌ లాక్‌డౌన్లు, పెరుగుతున్న నిరుద్యోగం, స్టాక్‌ మార్కెట్‌, స్థిరాస్తి రంగాలు భారీ నష్టాలను చవిచూడటం, బ్యాంకుల దివాలా, ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం వంటివి చైనా సమాజంలో అసమ్మతిని, అసంతృప్తిని పెంచుతున్నాయి. డ్రాగన్‌ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి జారిపోయింది. అమెరికాతో వాణిజ్య యుద్ధం, హాంకాంగ్‌లో రాజకీయ అసమ్మతి, షింజియాంగ్‌లో వీగర్‌ ముస్లిముల అణచివేత, ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాను సమర్థించడం, భారత్‌తో సరిహద్దు సంఘర్షణలు, తైవాన్‌తో లడాయి వంటి పరిణామాలు అంతర్జాతీయంగా చైనాకు పెను సవాళ్లను తెచ్చిపెడుతున్నాయి. చైనాలో కమ్యూనిస్టు పార్టీ, పార్టీలో తాను- సర్వం సహాధిపత్యం చలాయించడం ద్వారానే బీజింగ్‌ అంతర్జాతీయ శక్తిగా ఆవిర్భవిస్తుందని జిన్‌పింగ్‌ విశ్వసిస్తున్నారు. 20వ పార్టీ మహాసభల తరవాత ఆర్థిక, విదేశాంగ, సైద్ధాంతిక రంగాల్లో ఆయన మాటే వేదవాక్కుగా చలామణీ కానున్నది. అయితే, అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ మూడో పదవీ కాలం పూల పాన్పుగా కాకుండా ముళ్ల బాటలో పయనంలా ఉంటుందని నిపుణుల అంచనా.

పాత కొత్తల సంగమం
మావో, కార్ల్‌ మార్క్స్‌ సిద్ధాంతాలను శిరసా వహిస్తూనే- కన్‌ఫ్యూషియస్‌ వంటి ప్రాచీన చైనా మేధావులు, మహానుభావుల ఆలోచనలనూ ఆచరించాలని, నవ చైనా సైద్ధాంతిక భూమిక పాతకొత్తల సంగమంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నమ్ముతారు. అదే మావో అయితే చైనీయులపై కన్‌ఫ్యూషియస్‌ ఆలోచనా విధానానికి ఉన్న పట్టును ఛేదించడమే పనిగా పెట్టుకునేవారు. జిన్‌పింగ్‌ దీనికి భిన్నంగా కన్‌ఫ్యూషియస్‌, లావో జు వంటి ప్రాచీన ప్రవక్తల సూక్తులను నిత్యం ఉటంకిస్తారు. విధేయత, క్రమశిక్షణ, సువ్యవస్థ గురించి ప్రాచీనుల ప్రబోధాలను శిరోధార్యంగా స్వీకరించాలంటారు. అయిదు వేల సంవత్సరాల చైనా నాగరికత, సంస్కృతులను కమ్యూనిస్టు పార్టీ సంరక్షిస్తుందని ఉద్ఘాటిస్తారు.
- బి.కె.కిరణ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.