Chattisgarh Election Naxal Effect : ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల వేళ.. మావోయిస్టు దాడులు రాజకీయ పార్టీల్లో కలవరం రేపుతున్నాయి. నవంబరు 2న బస్తర్ రీజియన్‌లోని కాంకేర్ నియోజకవర్గంలో ప్రధాని మోదీ ప్రచార సభకు కొన్నిగంటల ముందు.. మోర్కండి గ్రామానికి చెందిన ముగ్గుర్ని అపహరించిన మావోయిస్టులు.. పోలీసు ఇన్‌ఫార్మర్ల పేరుతో కాల్చిచంపారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు ముందు మావోయిస్టుల కంచుకోట బస్తర్ రీజియన్‌లో మొదటిసారి దాడి జరిగింది. ఈ సందర్భంగా కూంబింగ్ నిర్వహించిన భద్రతాదళాలు మావోయిస్టుల డంప్‌ను గుర్తించారు. అందులో నక్సల్స్ సాహిత్యం, పలు దస్త్రాలు లభ్యమయ్యాయి.
నైరుతి ఛత్తీస్‌గఢ్‌లో రెడ్ బేస్ విస్తరణ!
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ చుట్టూ ఉన్న నైరుతి ఛత్తీస్‌గఢ్‌లో రెడ్ బేస్‌ను విస్తరిస్తున్నట్లు, ఆ ప్రాంతానికి విస్తార్‌గా పిలుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ రీజియన్‌లో బీజాపుర్, సుక్మాలోని కొన్ని భాగాలు, నారాయణ్‌పుర్, కాంకేర్, రాజ్‌నంద్‌గావ్‌లోని కొన్నిప్రాంతాలు మావోయిస్టుల నియంత్రణలో ఉన్నాయి. అవి భద్రతాదళాలకు నిషేధిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఈప్రాంతాల్లో జనతా దర్బార్ పేరుతో మావోయిస్టులు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వారి వద్ద భారీగా నిధులతోపాటు ఆధునిక ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నట్లు బస్తర్ రీజియన్‌లో పనిచేసిన CRPF అధికారి ఒకరు చెప్పారు.
మావోయిస్టుల వ్యూహంలో..
ఎన్నికలకు ముందు గ్రామస్థులు, రాజకీయనేతలు, ఎన్నికల అధికారులు, పోలీసులపై దాడులు చేయటం, పోలింగ్ బూత్‌ల్లో రిపోర్ట్ చేయొద్దని ఎన్నికల అధికారులను బెదిరించటం, ఎన్నికలు బహిష్కరించాలని పోస్టర్లు వెలియటం వంటివి దీర్ఘకాలంగా మావోయిస్టుల వ్యూహంలో భాగంగా ఉన్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన బంగాల్, ఝార్ఖండ్, ఏపీ, ఒడిశాలో కొన్నిప్రాంతాలు ప్రశాంతంగా ఉండటమే కాకుండా దాడులసంఖ్య కూడా చాలా వరకు తగ్గింది.
రాజకీయ పార్టీల్లో ఆందోళన..
Bastar Naxalite Area : అయితే బస్తర్ రీజియన్ మాత్రం రెడ్ జోన్‌గా కొనసాగుతోంది. శాసనసభ, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు పెరగటం రాజకీయ పార్టీలను ఆందోళనకు గురిచేస్తోంది. బస్తర్ డివిజన్ సహా దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో 12శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఎన్నికల ముందు మావోయిస్టుల దాడులు, హింసాత్మక ఘటనలు సర్వసాధారణంగా మారాయి.
2018 ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికలు, 2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మావోయిస్టు పెద్దఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. 2018 ఎన్నికలకు ముందు పోలీసులు, భద్రతా దళాలు, దూరదర్శన్ పాత్రికేయుడిని చంపారు. 2019 పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే మావోయిస్టుల మందుపాతరకు బలయ్యారు. బస్తర్‌లో మావోయిస్టులు చివరిసారి ఏప్రిల్‌లో దాడిచేశారు. ఇందులో 10మంది భద్రతాదళాలు చనిపోయారు. అందులో భద్రతాదళాల్లో చేరిన ఐదుగురు లొంగిపోయిన మావోయిస్టులుఉన్నారు. అయితే ఇటీవలకాలంలో మావోయిస్టుల దాడులు తగ్గాయి.
Bastar Naxal Area : బస్తర్ రీజియన్‌లో మావోయిస్టులు పోస్టర్లు, లేఖల ద్వారా బెదిరింపులకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది. కొరియర్లుగా పనిచేసే గ్రామస్థులను మావోయిస్టులు హెచ్చరిస్తుంటారు. ఎన్నికల్లో పోటీచేసే రాజకీయపార్టీల అభ్యర్థులు ఎప్పుడూ మావోయిస్టుల హిట్ లిస్టులో ఉంటారని.. దంతేవాడ బీజేపీ అభ్యర్థి, సల్వాజుడుం నాయకుడు చైత్రం అత్తమి తెలిపారు. 2005లో మావోయిస్టులను ఎదుర్కొనేందుకు సల్వాజుడుం అనే సైనిక మిలిషియా గ్రూప్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామాల్లో ఉండే తాము ఎప్పుడూ హిట్‌లిస్టులోనే ఉంటామని బీజేపీ అభ్యర్థి చైత్రం తెలిపారు.
ఎన్నికల సమయంలో అత్యంత సున్నిత, దాడులకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిస్తుంటారని చెప్పారు. తమకు పోలీసు భద్రత ఉన్నప్పటికీ.. మందుపాతరలు అత్యంత ప్రమాదకర ఆయుధంగా మారినట్లు రాజకీయపార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఇంట్లో కూర్చోలేమని, ప్రతిరోజు ప్రచారంలో పాల్గొంటున్నట్లు చెప్పారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు సంబంధిత దాడులు తగ్గినట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. గ్రామస్థుల్లో విశ్వాసం పెంపొందించే కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించటం వల్ల ప్రజలు మావోయిస్టులకు ఎదురుతిరుగుతున్నట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">