ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిశ్రామికీకరణ విధానాలతో దేశంలో అసంఘటిత రంగం విస్తరిస్తోంది. వ్యవసాయాధారితమైన భారత్‌లో అసంఘటిత రంగం సంప్రదాయ వృత్తులను వీడి ఆధునిక రంగాల వైపు మళ్ళుతోంది. దేశంలోని కోట్లాది శ్రామిక జనాభాలో దాదాపు 90శాతం అసంఘటిత రంగంలో ఉన్నట్లు నిపుణుల అంచనా. వీరి సంక్షేమానికి 2008లో అసంఘటిత రంగ (unorganised sector) కార్మిక సామాజిక భద్రతా చట్టాన్ని తెచ్చారు.
నేషనల్ శాంపిల్ సర్వే లెక్కల ప్రకారం కార్మిక శక్తిలో 88శాతానికి (47.29 కోట్ల మందికి) ఎలాంటి బీమా సౌకర్యం లేదు. వృద్ధాప్యంలో వీరికి ఆర్థిక తోడ్పాటు అందించేందుకు కేంద్రం దశాబ్దం క్రితం స్వావలంబన పథకాన్ని ప్రవేశపెట్టింది. పలు కారణాల వల్ల అది విజయవంతంగా అమలు కాలేదు. దేశంలోని పేదలు, వెనకబడిన వర్గాల ప్రజలందరికీ సార్వత్రిక సామాజిక భద్రతా పథకాలు ప్రవేశపెడుతున్నట్లు కేంద్రం 2015-16 బడ్జెట్‌లో ప్రకటించింది. ప్రజలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు 2015లో అటల్ పింఛన్ పథకాన్ని(atal pension yojana) ప్రారంభించింది. అసంఘటిత రంగ కార్మికులకు, ఉద్యోగులకు వృద్ధాప్యంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపడమే దీని లక్ష్యం.
18-40 ఏళ్ల భారత పౌరులు ఏదైనా ప్రభుత్వ రంగ, ప్రైవేటు, ప్రాంతీయ సహకార బ్యాంకులు, తపాలా కార్యాలయాల ద్వారా ఈ పథకంలో చేరవచ్చు. కొన్ని బ్యాంకులు ఆన్‌లైన్ విధానంలోనూ సభ్యులుగా చేరే అవకాశం కల్పిస్తున్నాయి. చందాదారుడు చెల్లించిన ప్రీమియం ఆధారంగా అరవైఏళ్లు నిండిన తరవాత నెలకు కనీసం వెయ్యి రూపాయల నుంచి అయిదు వేల రూపాయల వరకు పింఛను లభించే అవకాశం ఉంది. చందాదారుడు మరణిస్తే నామినీకి రూ.1.7లక్షల నుంచి రూ.8.5లక్షల వరకు నగదు లభించే అవకాశం ఉంది.
సమన్వయంతో మెరుగైన ఫలితాలు
అటల్ పింఛన్ పథకంలో ఇప్పటివరకు మూడు కోట్లమంది చేరినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా బ్యాంకుల్లో, ఒకలక్షా 45వేల తపాలా కార్యాలయాల్లో ఈ పథకం అమలవుతోంది. గ్రామాల్లోని కార్మికులు గతంలో పలు సంప్రదాయ వృత్తుల్లో ఉండేవారు. కులవృత్తులు దాదాపు కనుమరుగు కావడంతో చాలామంది పట్టణాలకు వలస వెళ్తున్నారు. గ్రామాల్లో కంటే పట్టణాల్లో అసంఘటిత రంగ కార్మికులు విభిన్నమైన పనులు చేస్తూ వివిధ వర్గాలుగా వేరుపడి ఉన్నారు. చాలా మంది పని దొరికే చోటనే తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. వీరిని గుర్తించడం అంత తేలిక కాదు. వీరందరినీ సమీకరించి పథకం ఆవశ్యకతను తెలియజెప్పడానికి ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు చేపట్టాలి. ఇందుకోసం తగిన యంత్రాంగాన్ని రూపొందించాలి.
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు అత్యంత కీలకం. గ్రామం నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో సమన్వయం చేసే వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మేలిమి ఫలితాలుంటాయి. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో ఒక శాతాన్ని మాత్రమే పింఛను పథకాలకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. జీవిత చరమాంకంలో పింఛను సౌకర్యం కలిగినవారు తక్కువగా ఉన్నందువల్ల ఎక్కువ మందిని అటల్ పింఛన్ పథకంలో చేర్పించేలా చూడటం అత్యావశ్యకం. తద్వారా ప్రజల్లో పొదుపు పట్ల అవగాహన పెరగడమే కాకుండా, ప్రభుత్వాల నిర్వహణకు కావలసిన ఆర్థిక వనరులు సైతం సమకూరతాయి. మూలధనాన్ని కూడబెట్టుకొని, దీర్ఘకాలిక ఆస్తుల కల్పన ధ్యేయంగా ప్రభుత్వాలు ఖర్చు చేసే అవకాశం లభిస్తుంది.
ప్రత్యేక యంత్రాంగంతో వేగవంతం
అటల్ పింఛన్ పథకాన్ని విస్తృతం చేసేందుకు గ్రామీణ, పట్టణ కార్మికులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. పథకాన్ని ఏళ్ల తరబడి కొనసాగించవలసి ఉంటుంది కనుక గడువు లోగా ప్రీమియం చెల్లించేలా చందాదారులను అప్రమత్తం చేయాలి. లేకుంటే మధ్యలోనే ఖాతా రద్దయ్యే అవకాశం ఉంటుంది. బ్యాంకు ఖాతా నుంచే రుసుము చెల్లించడం (ఆటో డెబిట్), గడువు సమయంలో ఖాతాలో తప్పకుండా సరిపడా నగదు ఉండేలా చూసుకోవడం తదితరాల గురించి తెలియజెప్పాలి. గడువు అనంతరం చందాదారులకు సత్వరం సేవలు అందేలా ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. బ్యాంకులు, తపాలాకార్యాలయాలు క్రియాశీలంగా సేవాభావంతో వ్యవహరిస్తేనే పేద ప్రజలకు సామాజిక భద్రత చేకూరుతుంది. జన్‌ధన్ యోజన, ఆధార్, మొబైల్(జామ్)ల సమన్వయంతో పారదర్శకంగా వ్యవహరించి, దేశంలో ఎక్కడికి వెళ్ళినా లబ్ధి పొందేలా ఏర్పాట్లు చేయాలి. గ్రామాల్లో మహిళా సంఘాల వ్యవస్థ ఆర్థికంగా కొంత బలంగా ఉంది కనుక వారి సాయంతో ప్రచారం చేపట్టాలి.
స్వయం సహాయక మహిళలందరూ ఈ పథకంలో చేరేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకోసం గ్రామీణాభివృద్ధి సంస్థలు చొరవ చూపాలి. గ్రామీణ అల్పాదాయ ప్రజలందరినీ ఈ పథకంలో చేర్పించేలా గ్రామ పంచాయతీల పాత్రను బలోపేతం చేయడం మరో ముఖ్యాంశం. బ్యాంకులు, తపాలా కార్యాలయాలు గ్రామాల్లో, పట్టణాల్లో సమావేశాలు నిర్వహించి అటల్ పింఛన్ పథకం గురించి అందరికీ తెలియజెప్పాలి. అమలు నుంచి ఆచరణ వరకు అసంఘటిత కార్మికశక్తికి తోడ్పాటును అందించాలి. అప్పుడే కార్మికుల మలిదశ జీవిత భద్రతకు భరోసానిచ్చేలా అటల్ పింఛన్ పథకం అక్కరకొస్తుంది!
- ఎ.శ్యామ్‌కుమార్