ETV Bharat / opinion

ఆన్​లైన్ పాఠాల్లో అపశ్రుతులు

author img

By

Published : Aug 8, 2020, 7:28 AM IST

కరోనా వేళ ఇంటిలోనికే తరగతి గది వచ్చేసింది. ఈ సౌకర్యాన్ని అవకాశంగా భావించి, సద్వినియోగం చేసుకొంటే 'ఆన్‌లైన్‌ విద్య' సత్ఫలితాలిస్తుంది. ఆన్‌లైన్‌ విద్యావిధానం ఉభయతారకం కావాలంటే గురు- శిష్య సంబంధాల్లోని పవిత్రత ఉభయులకూ అర్థం కావాలి. దీనికి తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరం. వాటిపట్ల నిబద్ధత కొరవడితే అపశ్రుతులు తప్పవు.

online studies
ఆన్‌లైన్‌ విద్య

కరోనా బారినపడిన విద్యావిధానం కొత్తపుంతలు తొక్కుతోంది. ఇప్పటికే ప్రపంచమంతటా ఆన్‌లైన్‌ పాఠశాల గంట గణగణా మోగింది. బయటకు వెళ్ళలేక, ఇంట్లో ఉండలేక సతమతమైపోతున్న పిల్లలు, యువతకు ఆన్‌లైన్‌ తరగతులు అమృతప్రాయాలే కానీ వాటిపట్ల నిబద్ధత కొరవడితే అపశ్రుతులు తప్పవు. ఆన్‌లైన్‌ తరగతులవల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు విద్యా సంవత్సరం కోల్పోవలసిన అవసరం లేదు. రోజూ స్కూలు, కళాశాలలకు వెళ్ళి రావలసిన ప్రయాస తప్పింది. దానివల్ల సమయం ఆదా అవుతోంది.

ఇంటిలోనికే తరగతి గది వచ్చేసింది. ఈ సౌకర్యాన్ని అవకాశంగా భావించి, సద్వినియోగం చేసుకొంటే ‘ఆన్‌లైన్‌ విద్య’ సత్ఫలితాలిస్తుంది. ఆన్‌లైన్‌ విద్యావిధానం ఉభయతారకం కావాలంటే గురు-శిష్య సంబంధాల్లోని పవిత్రత ఉభయులకూ అర్థం కావాలి. దీనికి తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరం. ప్రపంచంలోని విజ్ఞానమంతా మనకిప్పుడు అంతర్జాలంలో అందుబాటులో ఉన్నప్పటికీ అది గురువు ప్రత్యక్షంగా అందించే విజ్ఞానానికి సాటిరాదు.

గురువు లేని విద్య..

పుస్తకాలు ఉంటాయి. ఎంతో విపులంగా చెప్పే యూట్యూబ్‌ వీడియోలూ ఉంటాయి. మరి వాటివల్ల విజ్ఞానవంతులు కావచ్చు కదా అంటే- వాటన్నింటికీ పరిమితులు ఉంటాయి. గురుముఖతః నేర్చుకున్న విద్యే విద్య. విద్యార్థి సామర్థ్యం, అవసరం, అవగాహన, విషయ గాఢత మొదలైనవాటికి అనుగుణంగా గురువు బోధన ఉంటుంది. అందుకే గురువు లేని విద్య రాణించదు అంటారు.

మన ప్రాచీన భారతీయ సంప్రదాయంలో గురుపరంపరకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. విదేశీయులూ దీన్ని అంగీకరించి, గురుశిష్య బాంధవ్యాన్ని పెంపొందింపజేసుకుంటున్నారు. శిష్యుల పట్ల గురువులు నిజాయతీగా ఉండాలి. విషయాన్ని ముందుగా చదివి, తనకున్న అనుభవంతో దాన్ని జీర్ణింపజేసుకొని అందులోని సారాన్ని తగిన రీతిగా విద్యార్థులకు గురువు అందిస్తాడు. ఆ ఉపాధ్యాయుడు మంచి పరిశోధకుడు, అభివ్యక్త నైపుణ్యాలున్నవాడూ అయితే అది విద్యార్థులకు అదనపు సౌకర్యమే.

కాలక్షేపం కాదు..

గురువుల పరంగా తరగతి గదిలో బోధించడం, ఆన్‌లైన్లో బోధించడం వేరు. విద్యార్థుల మనోభావాలను ముందుగా తామే ఊహించుకొని చెప్పాల్సి ఉంటుంది. నిజానికి సరైన గురువుకు తాను చెప్పేది విద్యార్థికి ఎంతవరకూ అర్థమవుతుందో ఇట్టే తెలిసిపోతుంది. కాబట్టి ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పడం గురువులకు కష్టమేమీ కాదు. అయితే నిబద్ధత, నిజాయతీ, బాధ్యత- ఈ మూడూ గురువులు నిలుపుకొంటేనే విద్యార్థులకు పూర్తి ఫలాలు అందుతాయి.

ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాం అనే ధోరణి ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. విద్యార్థుల విషయానికి వస్తే- ఆన్‌లైన్‌ పాఠాలు పూర్తిగా విజయవంతం కావడం అనేది విద్యార్థులపైనే ఉంది. ఈ వ్యవహారం అంతా కాలక్షేపం అనుకోకూడదు. ఇప్పటికీ చాలామంది విద్యార్థులు పూర్తిగా ఆసక్తి చూపడం లేదు. ఉదయం నిద్ర లేవగానే కంప్యూటర్‌ ముందు కూర్చోవడం, దంతధావనం, ఫలహారం మొదలైనవి ఒకపక్క పాఠం జరుగుతుండగానే కానిచ్చేస్తూ ఉండటం చాలా ఇళ్ళలో కనిపిస్తోంది. తల్లిదండ్రులూ ఈ క్రమశిక్షణ రాహిత్యానికి కారణమే.

ఆన్‌లైన్‌ తరగతి అంటే మన ఇంటి అలవాట్లనూ ప్రపంచం మొత్తం చూస్తోందని గుర్తుపెట్టుకోవాలి. వీడియోను మ్యూట్‌లో ఉంచి, తమ పనులు తాము చేసుకుంటున్నారు. చిన్న పిల్లలకైతే తల్లులు ఫలహారం పెడుతూనో పాలు తాగిస్తూనో కనిపిస్తున్నారని, పిల్లల తండ్రులు పొట్టిపొట్టి వస్త్రాలు ధరించి ఇంట్లో అటూఇటూ తిరుగుతూ కనిపిస్తున్నారని, వాళ్ళను చూసిన మిగతా పిల్లలు గొల్లున నవ్వుతున్నారని కొందరు ఉపాధ్యాయులు వాపోతున్నారు. వీటన్నింటివల్లా ఆన్‌లైన్‌ విద్య అపహాస్యం పాలవుతోంది.

విచక్షణ అవసరం..

విద్య మనిషికి మరో రూపాన్ని ఇస్తుంది. వివేకంతో మెలగమని బోధిస్తుంది. అలాంటి విద్యను అభ్యసించే సమయంలో విచక్షణ లేకుండా ప్రవర్తిస్తే ఎలా? దీనివల్ల అందరూ నష్టపోవాల్సివస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులదే ఈ విషయంలో కీలక బాధ్యత. ఆన్‌లైన్‌ పాఠాలు మొదలయ్యే సమయానికి కనీసం ఒకటి రెండు గంటల ముందే నిద్రలేచి పిల్లలు కాలకృత్యాలు తీర్చుకొనేలా చూడాలి. పాఠశాలకు వెళ్లేటప్పుడు ఎలా శుభ్రంగా సిద్ధమవుతారో అలా వారు తయారయ్యేలా చూడాలి.

తరగతి జరుగుతున్నప్పుడు ఇతరులెవరూ అటువైపు వెళ్ళకుండా, వారికి తగిన ఏకాంత ప్రదేశాన్ని ఏర్పాటు చెయ్యాలి. పిల్లలు శ్రద్ధగా వినేలా, ఆ సమయంలో కంప్యూటర్‌లో ఇతర ఏ ఆటలూ ఆడకుండా చూడాలి. విద్యాలయాన్ని ఎంత పవిత్రంగా భావిస్తామో, అక్కడ ఎలా క్రమశిక్షణతో నడుచుకుంటామో ఇంటి పాఠాల్లోనూ అంతే పవిత్రంగా, క్రమశిక్షణగా ఉంటేనే ఆన్‌లైన్‌ పాఠాలు మన పిల్లల భవితకు పల్లవులు ఊదగలుగుతాయి. లేకపోతే అపశ్రుతులే మిగులుతాయి.

(రచయిత- డాక్టర్‌ అద్దంకి శ్రీనివాస్‌)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.