నళిని ఓ కార్పొరేట్ కంపెనీలో పని చేస్తోంది. కొవిడ్ సంక్షోభం కారణంగా తాను పని చేస్తోన్న కంపెనీలో ఇప్పటికే చాలామంది ఉద్యోగాలు పోయాయి. ఈ క్రమంలో తన ఉద్యోగానికెక్కడ ముప్పు వస్తుందోనని టెన్షన్ పడుతోంది.
కమలికి పనిలో పర్‌ఫెక్షనిజం ఉంది.. బాస్ ఏ పని అప్పగించినా చురుగ్గా చేయగలదు. అయితే తాను పని చేస్తోన్న కంపెనీలో పురుషాధిపత్యం ఎక్కువ. ఈ కరోనా సంక్షోభ సమయంలో ఇది తన కెరీర్ ఉన్నతికి ఎక్కడ అడ్డుగోడగా మారుతుందోనని కంగారుపడుతోంది.
కరోనా సంక్షోభాన్ని, ఇతర ప్రతికూలతలను ఎదురించి మహిళలు కెరీర్‌లో అభివృద్ధి సాధించాలంటే అందుకు కొన్ని వ్యూహాలు రచించాలని అంటున్నారు నిపుణులు. ఇంతకీ అవేంటో మనమూ తెలుసుకుందామా!
‘కవర్ లెటర్’ కీలకం!
కొత్త ఉద్యోగం వెతుక్కోవాలన్నా, వేరే జాబ్‌లోకి మారాలన్నా.. అందుకోసం ముందుగా మనం చేయాల్సింది దరఖాస్తు చేసుకోవడం! మరి, అప్లై చేయాలంటే సదరు కంపెనీకి సంబంధించిన జాబ్ అప్లికేషన్ ఫారమ్ నింపడమే కాదు.. మనలోని నైపుణ్యాలతో కూడిన రెజ్యూమేను కూడా దీనికి అనుసంధానించాల్సి ఉంటుంది. అంతేనా.. మన గురించి, మన పనితనం గురించి కూడా వారికి తెలియాలిగా! ఈ విషయంలో కీలక పాత్ర కవర్ లెటర్‌దే అంటున్నారు నిపుణులు. ఇది ఎంత ఆకర్షణీయంగా రూపొందిస్తే.. సదరు కంపెనీలో ఉద్యోగావకాశాలు అంతలా మెరుగుపడతాయంటున్నారు. ఈ క్రమంలో అభ్యర్థి తన గురించి క్లుప్తంగా వివరిస్తూ, తనలోని నైపుణ్యాలు, తనకు ఆఫర్ చేసే ఉద్యోగాన్ని తాను ఎంత సమర్థంగా నిర్వర్తించగలుగుతారు.. అనే విషయాల గురించి కూడా సంక్షిప్తంగా వివరించాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే షార్ట్ అండ్ స్వీట్ గా కవర్ లెటర్ ఉండాలంటున్నారు నిపుణులు. అయితే దీని గురించి పూర్తిగా అవగాహన లేని వారు రెజ్యూమే, కవర్ లెటర్‌లను రూపొందించే విషయాల్లో నిపుణుల సలహాలు తీసుకోవచ్చు.. లేదంటే ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ కూడా వినచ్చు.
మీకు మీరే ‘బ్రాండ్’ అంబాసిడర్!
ప్రతి ఒక్కరిలో తమకంటూ ప్రత్యేకమైన నైపుణ్యాలు కొన్నుంటాయి. అయితే చాలామంది వీటిని గుర్తించలేక లేదంటే వీటిని తేలిగ్గా తీసుకుంటూ పక్కన పెట్టేస్తుంటారు. నిజానికి ఈ స్కిల్సే మిమ్మల్ని కెరీర్‌లో ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని చెబుతున్నారు నిపుణులు. ఇలా మీలోని నైపుణ్యాల్ని ప్రదర్శించడానికి మీకు మీరే బ్రాండ్ అంబాసిడర్ కావాలంటున్నారు. ఇందుకోసం ఎలాగూ సోషల్ మీడియా ఉండనే ఉంది..
ఉదాహరణకు.. మీకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం.. ఈ దిశగానే మీరు ఓ మంచి ఫ్యాషన్ డిజైనర్ దగ్గర చేరి మీ స్కిల్స్‌కి మరింత పదును పెట్టుకోవాలనుకుంటున్నారనుకోండి.. మీరు రూపొందించిన కొత్త కొత్త డిజైన్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వాటిని మరింత మందికి షేర్ చేయమని అడగచ్చు.. దాంతో పాటే మీరు వ్యాపార, ఉపాధి అవకాశాల కోసం వెతుకుతున్నట్లు కూడా సందేశం పంపచ్చు. ఒకవేళ మీ డిజైన్లు మేటి డిజైనర్లు మెచ్చి మీకు వారి దగ్గర అవకాశమివ్వడం.. లేదంటే మీరు స్వయంగా రూపొందించిన డిజైన్లను విక్రయించడం, మీరు వారి బ్రాండ్స్‌ని అడ్వర్టైజ్ చేయడం.. ఇలా ఆలోచిస్తే బోలెడన్ని ఐడియాలొస్తాయి! ఇవన్నీ మీ కెరీర్ ఉన్నతికి సోపానాలే!
పరిధి పెంచుకోండి!
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోన్న ప్రస్తుత తరుణంలో మనం కమ్యూనికేషన్‌ని ఎంతలా పెంచుకుంటే కెరీర్ పరంగా మనకు అంత ఉపయుక్తం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీరు ఇప్పటికే పని చేస్తోన్న సంస్థలోని సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం, ఇదివరకు పనిచేసిన కంపెనీలోని కొలీగ్స్‌తో నిరంతరం టచ్‌లో ఉండడం.. టెక్నాలజీ విషయంలో వస్తోన్న మార్పుల గురించి ఎప్పటికప్పుడు వారితో చర్చించడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం.. ఇవన్నీ ముఖ్యమే! ఇలా నలుగురితో మీరు మమేకమవడం వల్ల మార్కెట్లో ఉన్న కొత్త ఉద్యోగావకాశాల గురించి వారంతట వారే మిమ్మల్ని సంప్రదించి మీకు తెలియజేసే అవకాశమూ లేకపోలేదు. తద్వారా మంచి ఉద్యోగావకాశాల్ని అందుకుంటూ, కొత్త కొత్త నైపుణ్యాల్ని అలవర్చుకుంటూ కెరీర్‌లో ఉన్నతి సాధించచ్చు.
సవాళ్లను సవాల్ చేయండి!
సాధారణంగా పైఅధికారులు ఏదైనా పని చెప్పినప్పుడు అది మన వల్ల అవుతుందా లేదా అని ఆలోచిస్తాం.. తటపటాయిస్తూనే చేస్తామనో లేదంటో మా వల్ల కాదనో చెబుతాం.. కానీ నిజానికి ఆ పని మన వల్ల సాధ్యమైనా కాకపోయినా ఇలాంటి సవాళ్లు స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. అప్పుడే కెరీర్‌లో అభివృద్ధి సాధ్యమంటున్నారు. ఇలా మనం ప్రతి విషయంలో చూపించే ఉత్సాహం ఒక్కోసారి అసాధ్యమనుకున్న పనిని కూడా సాధ్యమయ్యేలా చేస్తుందట! అంతేకాదు.. పనిలో ఇలాంటి చురుకుదనం ఉన్న వారికే సంస్థలు ఓటేస్తాయని, పదోన్నతులు-ఇతర సౌకర్యాల విషయంలో వారికే అధిక ప్రాధాన్యమిస్తాయని అంటున్నారు. అందుకే సవాళ్లనే సవాల్ చేయడమనేది కెరీర్ ఉన్నతికి ఓ సూచికగా భావించాలంటున్నారు. ఇది మనకు వృత్తిపరంగానే కాదు.. వ్యక్తిగతంగా మనలో ఆత్మవిశ్వాసం పెరిగేలా చేస్తుంది కూడా!
ఎదిగినా ఒదిగి ఉండేలా!
ఉద్యోగంలో పదోన్నతి వచ్చినా, ప్రస్తుతం ఉన్న ఉద్యోగం కంటే గొప్ప అవకాశం వచ్చినా.. ఇక మమ్మల్ని మించిన వారు లేరనుకోవడం చాలామందిలో ఉండే గుణమే! అయితే కెరీర్ విషయంలో ఇలాంటి గర్వం పనికిరాదంటున్నారు నిపుణులు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం, ఎంత తెలుసుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనుకోవడం.. ఈ రెండూ మనల్ని వృత్తిపరంగా మరింత ముందుకెళ్లేలా చేస్తాయట! ఈ క్రమంలో ఓ మెంటార్‌ను నియమించుకొని.. వారి సలహాలు, సూచనలు తీసుకోవడం మరీ మంచిదట!
జీవితంలోనైనా, కెరీర్‌లోనైనా అప్పుడప్పుడూ ప్రతికూల పరిస్థితులు ఎదురవడం కామన్! కాబట్టి ఇలాంటి సమయంలో ఉద్యోగం పోయిందనో.. లేదంటే కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పడిందనో బాధపడకుండా పైన చెప్పినట్లుగా మనకంటూ కొన్ని వ్యూహాల్ని రచించుకోవాలి. పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి. అప్పుడే వాటి ప్రభావం మనపై, మన కెరీర్‌పై పడకుండా ముందుకు సాగచ్చు!
ఇదీ చూడండి: Psychological Immunity : ఆన్‌లైన్ వేదికగా మానసిక వైద్యం