నిలువెత్తు స్వచ్ఛతా స్ఫూర్తికి జాతిపిత మహాత్మాగాంధీ పెట్టింది పేరు. ఆయన జయంతికి ఒకరోజు ముందు- దేశవ్యాప్తంగా నగరాలన్నింటా పరిశుభ్రత, జలభద్రతలను లక్షిస్తూ రెండు(Swachh Bharat 2.0)(Amrut Scheme) ప్రతిష్ఠాత్మక పథకాల మలి అంచె కార్యాచరణకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. వ్యక్తిస్థాయిలో శుచీశుభ్రతలకు ప్రణాళికాబద్ధ పారిశుద్ధ్య వసతులు జతపడిన నాగరిక సమాజాల్లో ఆయురారోగ్యాలకు సంపద వృద్ధికి ఢోకా ఉండదని ఎన్నో అధ్యయనాలు చాటుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణం, వాయుకాలుష్య నియంత్రణ, వ్యర్థజలాల పరిశుద్ధీకరణ తదితరాలకోసం ఉద్దేశించిన స్వచ్ఛ భారత్ (పట్టణ)(Swachh Bharat 2.0) పథకం రెండో దశ ప్రణాళికలో- ఆ సద్వివేచన ప్రస్ఫుటమవుతోంది. దేశంలోని 4730 పట్టణ స్థానిక సంస్థల్లో 2.68 కోట్ల నల్లా కనెక్షన్లు, 500 పట్టణాల్లోని ప్రతి ఇంటికీ మరుగు వ్యర్థాల కనెక్షన్లు ఇవ్వడానికి అమృత్ (అటల్ పట్టణ రూపాంతరీకరణ పునరుజ్జీవన యోజన)(Amrut Scheme) రెండోదశను పట్టాలకు ఎక్కిస్తున్నారు.
పాఠాలు నేర్చి ముందడుగు వేస్తే..
అమృత్ పథకం(Amrut Scheme) పరిధిలోకి రాని అన్ని పట్టణ ప్రాంతాల్లో 'స్వచ్ఛ భారత్'(Swachh Bharat 2.0) కింద మురికినీటి నిర్వహణ చేపడతామంటున్నారు. పట్టణాల్ని స్వచ్ఛ నెలవులుగా తీర్చిదిద్దడంలో భాగంగా రెండు భూరి పథకాల పద్దులో మొత్తం రూ.4.28 లక్షలకోట్ల మేర వ్యయీకరించనున్నట్లు అధికారిక ప్రకటన వెల్లడిస్తోంది. అందుకోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచీ రుణసమీకరణ యోచన వెలుగు చూసింది. చెత్తశుద్ధితో పట్టణ ప్రాంతాల పునరుద్ధరణను తద్వారా స్వచ్ఛ భారతావని ఆవిష్కరణను సుసాధ్యం చేస్తామంటున్న సంకల్ప దీక్ష వీనులవిందుగా ఉంది. ఏడేళ్ల స్వచ్ఛభారత్, ఆరేళ్ల అమృత్ తొలిదశ ఫలితాలనుంచి ప్రభుత్వ యంత్రాంగం విలువైన పాఠాలు నేర్చి ముందడుగు వేస్తే- మలి అంకంలో మెరుగైన ఫలితాల సాధన సాకారమవుతుంది.
పనుల అమల్లో విఫలం..!
పట్టణ ప్రాంతాల ముఖచిత్రాన్ని మార్చడంలో, 70 శాతం వరకు ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధీకరించే స్థాయికి చేరుకోవడంలో స్వచ్ఛభారత్, అమృత్ తొలి దశ కీలక భూమిక పోషించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఇటీవల సగర్వంగా చాటుకుంది. ఇప్పటి వరకు సమకూర్చిన నల్లా, మురుగునీటి కనెక్షన్ల ద్వారా నాలుగు కోట్లమందికి పైగా ప్రయోజనం పొందారనీ గణాంకాలు ఉటంకించింది. గ్రామీణ ప్రాంతాల్లో 73 శాతం మేర స్వచ్ఛభారత్ నిధుల్ని ఖర్చు చేశామన్న 2017 డిసెంబరు నాటి అమాత్యుల వివరణతో పార్లమెంటరీ స్థాయీసంఘం నివేదిక విభేదించింది. 500 పట్టణాల అభివృద్ధికి రూ.50వేల కోట్లు వెచ్చిస్తామన్న కేంద్రం- బిహార్, అసోం ప్రభృత రాష్ట్రాల్లో చురుగ్గా పనులు జరిగేట్లు చూడటంలో విఫలమైందన్న అధ్యయనాలు రెండేళ్లనాడు వెలుగు చూశాయి.
లోటుపాట్లకు తావివ్వకుండా..
వివిధ పట్టణాల్లోని పారిశుద్ధ్య స్థితిగతులను క్రోడీకరించిన 'స్వచ్ఛ సర్వేక్షణ్'- చెత్త సేకరణ, శుద్ధికి సంబంధించి సర్కారీ గణాంకాలకు భిన్నమైన పరిస్థితిని కళ్లకు కట్టింది. తొలి దశతో పోలిస్తే భారీ వ్యయీకరణకు, బృహత్ లక్ష్యాల సాధనకు సన్నద్ధమైన ప్రభుత్వం- ఈసారి ఆరంభం నుంచీ ఎక్కడా లోటుపాట్లకు తావివ్వకుండా అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకోవడం మేలు. పర్యావరణ మార్పులతో ఎక్కడికక్కడ పోటెత్తుతున్న జల కాలుష్యం, ఇంతలంతలవుతున్న వాయుకశ్మలం దేశదేశాలకు పెను సవాళ్లు విసరుతున్నాయి. వాటితో పాటు వలసల రూపేణా విపరీత నగరీకరణ, దానితో ముడివడిన సమస్యల పరిష్కరణ- ఇప్పుడెన్నో ప్రభుత్వాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విస్తృత జనభాగస్వామ్యంతో పరిశుభ్రతే పౌరస్మృతిగా, స్వచ్ఛతే నిత్య జీవన సంస్కృతిగా స్థిరపరచేట్లు సర్కారీ కార్యాచరణ పదును తేలాలి.
ఇదీ చూడండి: 'నగరాలను చెత్త రహితంగా మార్చడమే స్వచ్ఛభారత్ 2.0 లక్ష్యం'