ప్రపంచ జనాభాలో 41 శాతం నివసించే బ్రిక్స్ దేశాలు ప్రపంచ జీడీపీలో 24 శాతం వాటా ఆక్రమిస్తున్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా కలిసి 2006లో ఈ కూటమిని ఏర్పాటు చేసుకొన్నాయి. భారత్ అధ్యక్షతన నేడు 'బ్రిక్స్' 13వ శిఖరాగ్ర సభ వర్చువల్‌గా (BRICS Summit 2021) జరగనుంది. 2012, 2016 సంవత్సరాల్లోనూ బ్రిక్స్ సభకు భారత్ అధ్యక్షత వహించింది. 15వ వార్షికోత్సవం సందర్బంగా తమ మధ్య సహకారాన్ని మరింత పటిష్ఠం చేసుకోవడానికి, ఏకాభిప్రాయ సాధనకు బ్రిక్స్ దేశాలు (13th BRICS Summit) గట్టి కృషి చేయనున్నాయనే అంచనాలు నెలకొన్నాయి. రాజకీయ, ఆర్థిక, భద్రత, సాంస్కృతిక రంగాలతోపాటు తమ ప్రజల మధ్య కూడా స్నేహసహకారాల వృద్ధికి బాటలు పరవాలని సభ్య దేశాలు భావిస్తున్నాయి. పరస్పర సహకార వృద్ధికి ఈ ఏటి శిఖరాగ్ర సభాధ్యక్షురాలిగా ఇండియా దిశానిర్దేశం చేయబోతోంది.
ముందున్న సవాళ్లెన్నో!
గడచిన పదిహేనేళ్లలో బ్రిక్స్ దేశాలు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, సైబర్ భద్రతలపై చర్చలు జరిపాయి. విద్య, ఆరోగ్యం, శాస్త్ర సాంకేతికతలు, ప్రకృతి వైపరీత్యాల నిభాయింపు వంటి రంగాల్లో సహకరించుకోవాలని నిశ్చయించాయి. దీన్ని ఈ ఏడాది మరింత ముందుకు తీసుకెళ్ళడానికి భారత్ కృషి చేస్తుందని విదేశాంగ శాఖ వర్గాలు చెబుతున్నాయి. గతంలో వాణిజ్య లోటును ఎదుర్కొనే వర్ధమాన దేశాలు- గండం గట్టెక్కాలంటే ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) శరణ్యమయ్యేవి. ఇటువంటి దేశాలను ఆదుకోవడానికి బ్రిక్స్ అత్యవసర రిజర్వు నిధిని ఏర్పరచింది. పాశ్చాత్య దేశాల ఆధిపత్యంలోని బహుళపక్ష ఆర్థిక సంస్థలకు, ప్రపంచ బ్యాంకుకు ప్రత్యామ్నాయంగా నూతనాభివృద్ధి బ్యాంకునూ నెలకొల్పింది. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థలలో సంస్కరణల కోసం కృషి చేయాలని బ్రిక్స్ బ్రెసీలియా ప్రకటన తీర్మానించింది. ఉగ్రవాద నిరోధానికి చేతులు కలపాలనీ నిశ్చయించింది.
బ్రిక్స్ దేశాలు పరస్పర సహకారానికి ప్రాధాన్యమిస్తున్నా, అన్ని అంశాలపై అవి ఏకతాటిపై నిలుస్తున్నాయని చెప్పలేం. ఉదాహరణకు చైనా, రష్యాలకు గిట్టని క్వాడ్ కూటమిలో అమెరికాతోపాటు భారత్ (BRICS Summit 2021) భాగస్వామిగా ఉంది. ఇలాంటి కూటములు బ్రిక్స్ దేశాల ఐక్యతకు భంగం కలిగిస్తాయని చైనా, రష్యా భావిస్తున్నాయి. మరోవైపు లదాఖ్ సరిహద్దులో, దక్షిణ చైనా సముద్రంలో చైనా అతిక్రమణలను భారత్ వ్యతిరేకిస్తోంది. హాంకాంగ్, షింజియాంగ్‌లలో చైనా దమన నీతిని మిగతా ప్రపంచం హర్షించడం లేదు. వీటన్నింటినీ మించి చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్(బీఆర్‌ఐ)లో రష్యా చేరలేదు. బీఆర్‌ఐని భారత్ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లో రష్యా దూకుడును ప్రపంచ దేశాలు నిరసిస్తున్న తరుణంలో బ్రిక్స్ వైఖరి ఏమిటనే ఆసక్తి సైతం నెలకొంది. భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలకు పాశ్చాత్య దేశాలతో సన్నిహిత సంబంధాలు ఉండగా- రష్యా, చైనాలు రాజకీయంగా పాశ్చాత్య దేశాలను వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ దేశాల మధ్య భిన్న దృక్పథాలు ఉన్నా, ఉమ్మడి ప్రయోజనాలను నెరవేర్చే అంశాల్లో సహకారాన్ని విస్తరించాల్సి ఉంది.
గతంలో బ్రిక్స్ సమావేశాల్లో ప్రధానంగా ఐఎంఎఫ్ ఓటింగ్ హక్కుల మీద, నూతనాభివృద్ధి బ్యాంకు మౌలిక వసతుల మీద చర్చించేవారు. తాజా సమావేశంలో కొవిడ్ వల్ల గాడి తప్పిన తమ ఆర్థిక వ్యవస్థలను మళ్ళీ వృద్ధి పథంలో పరుగులు తీయించే మార్గాలపై సభ్య దేశాలు చర్చించనున్నాయి. బ్రిక్స్ దేశాల జీడీపీ వేగంగా పుంజుకోవడానికి పరస్పర ఆర్థిక సహకార వృద్ధి తోడ్పడుతుంది. వర్ధమాన దేశాలు కొవిడ్ నుంచి తేరుకుంటే కానీ, ఆర్థికంగా నిలదొక్కుకోలేవు.వాటికి టీకాల కొరత పెద్ద అడ్డంకిగా మారింది. దీనిపైనా బ్రిక్స్ చర్చించనుంది. ఐక్యరాజ్యసమితి కోవాక్స్ కార్యక్రమానికి భారత్ 6.6 కోట్ల టీకా డోసులు అందిస్తోంది. కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటివి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకురాబోతున్నాయి. ఉగ్రవాదంపై పోరుకు తోడ్పడే ఈ అధునాతన సాంకేతిక రంగంలో పరస్పర సహకార వృద్ధికి బ్రిక్స్ దేశాలు ప్రయత్నించాలి. మరోవైపు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం తాను చేస్తున్న ప్రయత్నాలకు బ్రిక్స్ దేశాల మద్దతును భారత్ కోరుతోంది. కొవిడ్ టీకాల ఉత్పత్తిపై మేధాహక్కుల తొలగింపు, అంతర్జాతీయ వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటుకు ఆయా దేశాలతో కలిసి కృషి చేయాలని భావిస్తోంది. ఆరోగ్యం, వ్యవసాయం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో బ్రిక్స్ దేశాల సమైక్య కృషికి పిలుపిస్తోంది. రష్యాతో పొరపొచ్చాలను తొలగించుకోవడానికి తాజా శిఖరాగ్ర సభలో ఇండియా ప్రాధాన్యం ఇవ్వవచ్చు.
గురుతర బాధ్యత
ఇటీవలి కాలంలో చైనా, రష్యాల మధ్య ఆర్థిక, రాజకీయ, సైనిక రంగాల్లో సహకారం పెంపొందుతోంది. పాకిస్థాన్‌కు రష్యా ఆయుధాలు సరఫరా చేస్తూ సంయుక్త సైనిక విన్యాసాలూ జరుపుతోంది. అఫ్గానిస్థాన్ విషయంలో రష్యా, చైనా, పాకిస్థాన్‌ల మధ్య కొంత అవగాహన నెలకొంటోంది. ఇది భారత్ ప్రయోజనాలకు నష్టదాయకం. రష్యాతో సంబంధాల పటిష్ఠీకరణకు, దక్షిణ చైనా సముద్రంలో, లదాఖ్ సరిహద్దులో చైనాతో వివాదాల పరిష్కారానికి బ్రిక్స్ సభావేదికగా భారత్ ప్రయత్నించవచ్చు. 'రాజకీయ, ఆర్థిక, భద్రతాంశాల్లో క్లిష్ట సవాళ్లెన్నో ముమ్మరిస్తున్న వేళ ప్రపంచానికి ఒక ఆశాదీపంగా బ్రిక్స్ నిలవనుంది. విశ్వ మానవాళి సంక్షేమానికి ఈ కూటమి కృషిచేస్తుంది' అని భారత ప్రధాని మోదీ లోగడ వ్యాఖ్యానించారు. ఆ గురుతర బాధ్యతను నిర్వర్తించడంలో సభ్య దేశాల పరస్పర సహకారమే కీలకం కానుంది.
కూటమిలోకి కొత్త దేశాలు
బ్రిక్స్ దేశాల స్థితిగతుల్లో చాలా తేడాలు ఉన్నాయి. తీవ్ర వాణిజ్య లోటుతో, మితిమీరిన రుణభారంతో సతమతమవుతున్న దక్షిణాఫ్రికా ఆర్థికంగా కుప్పకూలనుందన్న భయాలు నెలకొన్నాయి. కొవిడ్ సంక్షోభంతో భారత్, బ్రెజిల్ ఆర్థిక కడగండ్లను ఎదుర్కొంటున్నాయి. కొవిడ్ తరవాత తమ ఆర్థిక రథాన్ని పట్టాలెక్కించడానికి అన్ని దేశాలూ చాలా శ్రమపడాల్సి ఉంటుంది. బ్రిక్స్‌లో ఈ ఏడాది కొత్త సభ్యదేశాలు చేరవచ్చని నూతనాభివృద్ధి బ్యాంక్ అధ్యక్షుడు మార్కోస్ ట్రోయ్హో వెల్లడించారు. సింగపూర్, ఇండొనేసియా, మెక్సికో, టర్కీ, దక్షిణ కొరియా, కెన్యాల ప్రవేశంతో బ్రిక్స్ మరింత పరిపుష్టమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, బలీయ అంతర్జాతీయ సంఘంగా బ్రిక్స్ అవతరిస్తుందనే ఆశలు ఇటీవల కొన్ని పరిణామాలతో ఆవిరవుతున్నాయి. 2010 నుంచి 88 శాతం ఆస్తులను కోల్పోవడం వల్ల గోల్డ్ మాన్ శాక్స్ నెలకొల్పిన బ్రిక్స్ నిధి మూతపడింది. బ్రిక్స్ పనితీరు నిరుత్సాహం కలిగించినా, అది మళ్ళీ పుంజుకొంటుందని బ్రిటిష్ ఆర్థిక వేత్త జిమ్ ఓ నీల్ ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
- డాక్టర్ రాధా రఘురామపాత్రుని (అంతర్జాతీయ వాణిజ్య రంగ నిపుణులు)
ఇదీ చూడండి : పంట వ్యర్థాల దహనంతో ఉక్కిరిబిక్కిరి- పంజాబ్ ప్రణాళిక ఫలిస్తుందా?