'ఇప్పుడే ఓ కొత్త విషయం తెలిసింది తెలుసా!'
'ప్రపంచం అరచేతికి చిక్కి, ఆరంగుళాల ఫోన్లలో బందీగా మారిన ప్రస్తుత తరుణంలో ప్రతిక్షణం ఓ చెత్త విషయం కొత్తగా పరిచయం అవుతూనే ఉంటుంది. అందులో విశేషం ఏముంది?'
'అలాంటిదే అనుకో, ఓ పాత విషయమే, కొత్తగా తెలిసింది. లంచం (Corruption and Bribery) కూడా ఒక కళ అని తెలిసి వచ్చింది'
'దొంగతనమే ఓ కళ అయినప్పుడు, అవే లక్షణాలతో అంతే హస్తలాఘవం అవసరమైన లంచం (Corruption in India) కూడా కచ్చితంగా కళే! అనుమానం అక్కర్లేదు!'
'అంటే, లంచం... దొంగతనం ఒక్కటేనా?'
తేడా ఏముంది?
'అంతేమరి... అవతలివాడి సొత్తును, మూడోకంటికి తెలియకుండా నొక్కేయడం దొంగతనమైతే, ఎదుటివాడి సొమ్మును వాడికి తెలిసీ, వాడికి ఇష్టం లేకపోయినా, వాడి చేత్తోనే ఇచ్చేలా చేసి, మరోకంటికి తెలియకుండా పుచ్చుకోవడమే లంచం. రెండింటికీ తేడా ఏముంది?' (Corruption in Politics)
'నైపుణ్యంలోనైనా తేడా ఉంటుందిగా?'
'రాత్రివేళ నిద్రమాని, కళ్లల్లో ఒత్తులేసుకొని, ఒంటికి నూనె ముఖానికి మసి పూసుకొని, చెప్పులు లేకుండా, చప్పుడు కాకుండా, ఎవరూ లేవకుండా... కుక్కలకు, పోలీసులకు చిక్కకుండా చాలా కష్టంతో, అత్యంత పనితనంతో చేయాల్సిన పని- దొంగతనం! లంచం అంటే పుచ్చుకోవడమే! చెమటలు కార్చే శ్రమేమీ అక్కర్లేదు. రాత్రి పగలు తేడా లేదు. నిద్రమానాల్సిన పనేలేదు. పక్కకు కదలకుండా కూర్చున్నచోటే, కరెన్సీయో కాగితాలో భద్రంగా చేతులు మారిపోతాయి. బ్యాక్‌గ్రౌండ్ భారీగా ఉండాలనుకుంటే- ఏ బార్‌లోనో ధూమమేఘాల మధ్య మద్యాభిషేకంతో లంచార్పణం జరుగుతుంది. దేనికైనా షరతులు వర్తిస్తాయి కాబట్టి, మూడో కంట్లో పడకుండా, మరో ముక్కూముఖం వాసన పట్టకుండా జాగ్రత్త పడితే చాలు. అదీ కాదనుకుంటే ఇలాంటి పనుల కోసమే ప్రత్యేకంగా సుశిక్షితులై, ఎంతటి వారికైనా టెండర్ వేయగలిగే నైపుణ్యాలు కలిగిన అటెండర్ మహాశయులకు అప్పగిస్తే, అందులో నుంచే వారూ కొంచెం పుచ్చుకొని అరక్షణంలో ముగించేస్తారు. 'తిలా లంచం తలా జేబుడు' అన్న రీతిలో అంతా ముగిసిపోతుంది. ఇంతకన్నా సులువుగా కావాలంటే, ఆన్‌లైన్ రాజమార్గంలోనూ కానుకలు స్వీకరించవచ్చు!'
'ఇదంతా చూస్తే దొంగతనం, దోపిడీ, అపహరణ వంటి ప్రాచీన కళలతో పోలిస్తే... ఇద్దరి మధ్య ఇష్టంలా అనిపించే కష్టంతో ఇచ్చిపుచ్చుకొనే ఆమ్యామ్యావతారం అంత క్లిష్టమైనదేమీ కాదనిపిస్తోంది.'
'ఇష్టంగా చేసేవాడికి ఏదీ కష్టంకాదు. ఈ ప్రక్రియలో సర్కారీ బాసులు, నేతాసార్లది యమ జోడీ. 'అమృతం తాగినవాళ్లు దేవతలు దేవుళ్లూ, లంచామృతం తాగేవాళ్లు సార్లూ సర్కారు దొరలూ' అన్నట్లుగా దొరకడమనే ప్రసక్తే లేని వరంతో నేలపై అవతరించి, ప్రతి ప్రాణి నుంచీ పుచ్చుకోగల హక్కును పుట్టుకతోనే దఖలుపరచుకొన్న కారణజన్ములు వారు!'
ఎమ్మెల్యే గారి ఉపదేశం..
'ఇంతటి వ్యవహారజ్ఞానం ఒంటపట్టబట్టే మధ్యప్రదేశ్‌లో బీఎస్పీ ఎమ్మెల్యే రాంబాయిసింగ్ ఆమ్యామ్యా విజ్ఞానసర్వస్వాన్ని అరటి పండు ఒలిచినంత సులువుగా సామాజిక మాధ్యమాల సాక్షిగా బోధించి- లంచం ఆశించేవారికి ఇచ్చేవారికి పుచ్చుకొనేవారికి, అదేదో పాపమన్నట్లుగా రాసేవారికీ చూపించేవారికీ... సర్వులకూ జ్ఞానోదయం కలిగించారు. అధికారులు బల్లకింద చేతులు పెట్టడంలో తప్పేమీ లేదన్నట్లుగా తేల్చేశారు. స్వచ్ఛందంగా ఆమ్యామ్యాలు అందించే అమాయకులను ఆదరిస్తే తప్పేమీ కాదని అందరిపైనా ఆదరణ కురిపించారు. లంచం తీసుకోవడానికీ ఓ పద్ధతి పాటించాలంటూ 'తల్లీబిడ్డా న్యాయాన్ని' నినదించి నిలబెట్టారు.
లంచం స్వచ్ఛందంగా ఇస్తే ఓకే.. కానీ డిమాండ్ చేయొద్దు: ఎమ్మెల్యే
లంచం అనేది పిండిలో ఉప్పులా ఉండాలే తప్ప, మొత్తం కంచాన్నే గుంజేసుకోకూడదంటూ 'నోటికాడి కూడు' సంప్రదాయాన్ని అన్యాపదేశంగా గుర్తుచేశారు. పప్పులో పులుపు, కూరలో కారం విలువను వీసమెత్తు తేడాలేకుండా వివరించారు. ఇచ్చుకోవాల్సింది ఎక్కువైతే భారంగా మారుతుందని, పుచ్చుకోవాల్సింది తగ్గితే తేలికభావం ఏర్పడుతుందన్న రీతిలో- వ్యవహారమేదైనా 'పిండికొద్దీ రొట్టె'లా ఉండాలన్న నేతగారి జ్ఞానగుళికలు మందబుద్ధులందరూ వాడదగ్గవే. ఇచ్చేవారి ఆర్థిక స్థితినీ దృష్టిలో ఉంచుకోవాలంటూ పుచ్చుకొనే వారికి నచ్చజెప్పడమనేది- నిజంగా ఆ మానసిక వైశాల్యానికి చిత్తరువులవ్వాల్సిందే. అసలూ... అవతలివారు ఆశించిన పనిని చేసి పెట్టినందుకు, వారి సంతోషంకొద్దీ పుచ్చుకొంటున్న సొమ్ముకు అసహ్యంగా లంచమనే పేరుపెట్టి పిలవడం ఏమిటంటూ అభ్యంతరం లేవనెత్తాల్సింది. చేసిన సేవకు దక్కే ప్రతిఫలాన్ని చక్కగా 'సేవాఫలం'గా చెప్పుకొంటే ఎంత గౌరవంగా, మర్యాదగా, లంచానికే కిరీటం తొడిగినంత గంభీరంగా ఉండేది కాదూ!'
మందులేని మాయరోగం..
'ఈ లెక్కన లంచం పేరెత్తగానే గగ్గోలుపెట్టి, గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదన్నమాట!'
'అర్థం చేసుకుంటే అంతేమరి! శాస్త్రవేత్తలెవరూ సరిగ్గా దృష్టి పెట్టలేదుగాని- నీరూనిప్పూ, చెట్లూపుట్టలూగుట్టలు, గాలీధూళీ, చుక్కలు, దిక్కులు, హక్కులూ... పుట్టకముందే లంచం పుట్టి ఉంటుంది. మనిషి డీఎన్‌ఏ మూలమూలల్లోనూ ఉనికి చూపడమే అందుకు సాక్ష్యం. అదో విశ్వజనీన వ్యవహారం. కుల మత ప్రాంత, లింగ, వర్ణ, తర తమ, వైరి వర్గ స్వపర భేద భావాలేమీ లేవు. క్యాన్సర్‌కు థెరపీలు, కరోనాకు టీకాలు వచ్చినా, ఈ మాయరోగానికి మందూమాకులు రాలేదు. బహుశా రాకపోవచ్చు!'
- డీఎస్
ఇదీ చదవండి: 'ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ రద్దు కోసం మంత్రికి రూ.40 కోట్ల లంచం'