ఆరు నెలల వ్యవధిలో మూడు రాష్ట్రాల్లో నలుగురు ముఖ్యమంత్రుల మార్పుతో భాజపా రాజకీయాలు కొత్త మలుపు తీసుకొన్నాయి. ఉత్తరాఖండ్, కర్ణాటకల వరసలో తాజాగా గుజరాత్ పరిణామాలు- పార్టీపై పెరిగిన అధిష్ఠానం పట్టుకు అద్దం పడుతున్నాయి. 'ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకొన్నాం. రాబోయే ఎన్నికల్లోనూ గెలిచి రికార్డు సృష్టిస్తా'మని సీఎంగా విజయ్ రూపాణీ ఇటీవలే దీమాగా ప్రకటించారు. అంతలోనే రాష్ట్రాభివృద్ధికి కొత్త నాయకత్వం అవసరమంటూ తన పదవికి రాజీనామా సమర్పించేశారు! ఆయనను తప్పించడం తథ్యమనే కథనాలు కొన్నాళ్లుగా వెలువడుతున్నా- బాధ్యతల బదలాయింపులో వేగమే ఎవరి ఊహలకూ చిక్కలేదు. అంతకు మించి రూపాణీ వారసుడిగా భూపేంద్ర పటేల్ ఎన్నిక- పార్టీవర్గాల అంచనాలకూ అందలేదు! అందరినీ కలుపుకొని పోయే అనుభవజ్ఞుడైన నాయకుడే నూతన సీఎం కావాలన్న నితిన్ పటేల్ వంటి కాకలుతీరిన నేతలను కాదని మరీ ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన భూపేంద్రకు అధిష్ఠానం పట్టంకట్టింది.
రాష్ట్రంలో రెండున్నర దశాబ్దాలుగా అధికారాన్ని చలాయిస్తున్న భాజపా- 2017లో బొటాబొటీ ఆధిక్యంతో గట్టెక్కింది. స్థానిక రాజకీయాలను వేడెక్కించిన పాటీదార్ ఉద్యమం దరిమిలా అంతకు ఏడాది మునుపే ఆనందీబెన్ పటేల్ నుంచి సారథ్య బాధ్యతలను రూపాణీ స్వీకరించారు. కొవిడ్ రెండో దశ వ్యాప్తిని కట్టడి చేయడంలో ఆయన వైఫల్యానికి బలమైన పాటీదార్ వర్గాన్ని ప్రసన్నం చేసుకోవాలన్న అధిష్ఠానం ఆలోచనలు తోడై- భూపేంద్ర హఠాత్తుగా తెరపైకి వచ్చారు. శాసనసభ ఎన్నికలకు మరో పదిహేను నెలలే గడువున్న తరుణంలో కొత్త నేతను కొలువుతీర్చిన పార్టీ వ్యూహం పారుతుందా? ప్రజల్లో పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి ప్రధాని స్వరాష్ట్రంలో కాషాయ ధ్వజం మళ్ళీ రెపరెపలాడుతుందా?
ముఖ్యమంత్రులను మార్చడంలో గతకాలపు కాంగ్రెస్ దుర్విధానాలను కమలదళమూ అందిపుచ్చుకొందనే విమర్శలు ఇటీవల ముమ్మరించాయి. ఝార్ఖండ్ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బతో అటువంటి కఠిన నిర్ణయాలు అవసరమవుతున్నాయని భాజపా అధిష్ఠానం సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అసమర్థ నాయకుడిగా దుష్కీర్తిని మూటగట్టుకొన్న రఘుబర్‌దాస్ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన కమలదళానికి రెండేళ్ల క్రితం అక్కడ పరాజయం తప్పలేదు. మిగిలిన రాష్ట్రాల్లో ఆ పరిస్థితి తలెత్తకూడదన్నదే అధిష్ఠానం అంతరంగంగా పార్టీవర్గాలు అభివర్ణిస్తున్నాయి.
ఉత్తరాఖండ్‌లో త్రివేంద్ర సింగ్ రావత్‌కు ఉద్వాసన పలకడంతో ఈ ఏడాదిలో ఆ మేరకు'మార్పులు' మొదలయ్యాయి. ఆయన స్థానంలోకి ప్రవేశించిన తీరథ్‌సింగ్- వివాదాస్పద వ్యాఖ్యలతో నాలుగు నెలల్లోనే పదవి పోగొట్టుకొన్నారు. రాజకీయంగా అంతగా అనుభవం లేని పుష్కర్‌సింగ్ ధామీ ఆ తరవాత పట్టాభిషిక్తులయ్యారు. కర్ణాటకలో పార్టీకి అన్నీ తానై వ్యవహరించిన యడియూరప్ప సైతం ఇటీవల అయిష్టంగానే కుర్చీలోంచి దిగిపోయారు. దాంతో లింగాయతుల్లో రేగిన ఆందోళనను శాంతింపజేయడానికి జనతాదళ్ నుంచి వలసవచ్చిన బసవరాజ బొమ్మైని పార్టీ పీఠమెక్కించింది. కేశూభాయ్ కాలం నుంచి తమకు అండగా నిలబడుతున్న పటేళ్లను ఆకట్టుకోవడానికి గుజరాత్‌లో సైతం కమలదళం అవే కులసమీకరణాలకు ఎత్తుపీట వేసింది. కానీ, భూపేంద్ర ఎంపికతో ముఖ్యమంత్రిత్వంపై ఆశలు పెట్టుకొన్న అనుభవజ్ఞుల్లో అసంతృప్తి సెగలు రాజుకొనే అవకాశం లేకపోలేదు. అవి పార్టీకి పొగపెట్టకుండా మోదీ-షా ఎలా కాచుకుంటారో వేచి చూడాలి! 'నా నిష్క్రమణపై మరింత సమాచారం కావాలంటే మీరు దిల్లీ వెళ్లాల్సి ఉంటుంది' అంటూ రాజీనామా అనంతరం త్రివేంద్ర చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు- పార్టీలో ఇతర నేతల పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయనే వాదనలు ఆనాడే వినిపించాయి.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఘండ్ ఎన్నికల ఫలితాలు పునరావృతం కాకూడదంటే- మోదీ ప్రభ, అమిత్ షా చాణక్యానికి రాష్ట్రాల్లో బలమైన నాయకులు జత కలవాలి. ఆ మేరకు అధిష్ఠానం తీసుకునే ముందుజాగ్రత్తలే భాజపా భవిష్యత్తుకు గొడుగుపడతాయి!
ఇవీ చదవండి: