ఆలోచన, జ్ఞానం, వాక్కు మనిషిని ఇతర జీవుల నుంచి వేరు చేశాయి. ఈ అంశాలు మనిషిని బుద్ధిజీవిగా, ప్రత్యేకంగా నిలబెట్టాయి. పరిణామక్రమ సిద్ధాంతం ఎలాఉన్నా, మనిషి మాత్రం జ్ఞానపరంగా అంతరిక్షం వైపు సాగిపోతున్న క్రమంలో తనకు ఆధారభూతమైన పుడమి సంక్షేమాన్ని మరచిపోతున్నాడు. తన మనుగడకు దోహదంచేస్తున్న పర్యావరణాన్ని తన గుప్పిట బంధించాడు. ఫలితంగా సలసల కాగుతున్న భూమి, ముమ్మరిస్తున్న మహమ్మారులు, గతి తప్పిన కాలాలు, కరవులు, వరదలు, ప్రకృతి ప్రళయాలు, విలయాలు... మనిషికి సవాలు విసరుతూ కాచుకొమ్మంటున్నాయి. అభివృద్ధి పేరిట సాగించే పర్యావరణ మారణహోమంలో చివరకు తానే సమిధగా మారుతానన్న గ్రహింపులేక మానవులు ప్రమాదాన్ని కొనితెచ్చుకొంటున్నాడు.
తరిగిపోతున్న అడవులు..
కార్పొరేట్ సంస్కృతి, పారిశ్రామికీకరణ, గనుల తవ్వకాలు, స్వార్థచింతన- మనిషిని పచ్చదనానికి దూరం చేస్తున్నాయి. ప్రపంచానికే ఊపిరితిత్తులుగా పరిగణించే అమెజాన్ అడవులు సైతం తరిగిపోతున్నాయి. ఆస్ట్రేలియా అడవులు తరచూ అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ‘బతుకు బతికించు’ అన్నట్లు కాకుండా బతకడమే నేర్చిన మనిషి, విపరీత అటవీ హననానికి పాల్పడుతూ జీవవైవిధ్యానికి ప్రమాదకారిగా మారిపోయాడు. 1990-2016 మధ్యకాలంలో 1.3 కోట్ల చదరపు కిలోమీటర్ల మేర అడవి అంతరించిపోయింది. ఏటా 350 నుంచి 700 కోట్ల మేర వృక్షాలు తరిగిపోతున్నాయి.
అడవుల్లో తిరుగాడే క్రూరమృగాలు ఆహారం కరవై, ఆవాసం కోల్పోయి మైదాన ప్రాంతాల్లోని ఇళ్లల్లో చొరబడి మీద మీదకొస్తుంటే- నిక్కచ్చిగా తప్పు మనదేనని గమనించాలి. అటవీ హననం వల్ల ఎన్నో జీవులు అంతరించిపోతున్నాయి. అందుకే పులులు, ఇతర జంతువుల గణన చేపట్టి వేళ్లమీద లెక్కేస్తున్నాం. ఆహారపు గొలుసు క్రమం దెబ్బతిని విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవన్నీ మనిషి దుశ్చేష్టలకు దృష్టాంతాలే. స్వచ్ఛమైన గాలి, చల్లని నీడ, ఓషధులు, కలప, ఆహారం, పళ్ళు, సరీసృపాలు, కీటకాలు, లేళ్లు, సెలయేళ్లు, పుట్టలు, తేనెతుట్టెలు, పక్షులు, సీతాకోకచిలుకలు, తుమ్మెదలు, పూలతెమ్మెరలు, గుహలూ పొదలూ... ఇలా చెప్పుకొంటూపోతే వనాలు ప్రకృతికి, మనుషులకు ఆనంద నిలయాలు, మనుగడకు సోపానాలు. ఇదంతా విస్మరించి చేస్తున్న అభివృద్ధి ప్రస్థానం ఏ తీరాలకో గ్రహించినప్పుడే- పర్యావరణ స్పృహ ఏర్పడుతుంది. లేకుంటే నిరంతరాయంగా వృక్షాలు నేలకూలుతూనే ఉంటాయి.
ఉద్యమాలు వెల్లువెత్తినా..
జీవవైవిధ్యం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో ఉద్యమాలు చోటుచేసుకున్నాయి. ‘ప్రజల మనుగడకు అడవులు ఎంతో కీలకమైనవి’ అంటూ 1970లో సుందర్‌లాల్ బహుగుణ అధ్వర్యంలో ఆరంభమైన చిప్కో ఉద్యమం; ‘అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడుకుందాం’ అంటూ 1971లో జరిగిన గ్రీన్‌పీస్ ఉద్యమం; 1994లో ‘అడవే మాకు అప్పులిస్తుంది, అడవే మాకు బ్యాంకు, కష్టంకాలంలో మేం అడవికి వెళ్తాం’ అంటూ బావా మహాలియా నర్మదా బచావో ఆందోళన్ సందర్భంగా ముఖ్యమంత్రికి రాసిన ఉత్తరం; 1973-85లో కేరళలో జరిగిన సైలెంట్ వ్యాలీ ఉద్యమం తదితరాలు స్ఫూర్తిని రగిలించి పర్యావరణం గురించి ఆలోచింపజేశాయి. ప్రకృతి విపత్తులు, వరదలు, కరవులు, తుపానులు విరుచుకుపడుతున్నవేళ ప్రభుత్వాలు, ప్రజలు నేడు కాస్తో కూస్తో పర్యావరణం గురించి ఆలోచిస్తున్నారు. ఆ క్రమంలోనే హరిత కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.
అక్కడే అశ్రద్ధ..
కానీ మొక్కలు నాటడంలో ఉన్న శ్రద్ధ, వాటి సంరక్షణలో ఉండటం లేదు. దానివల్ల హరిత లక్ష్యం నెరవేరడం లేదు. వన సంరక్షణ కమిటీలు నామమాత్రమయ్యాయి. వాటిని బలోపేతం చెయ్యాలి. ప్రభుత్వాలు పరిశ్రమలకు, గనులకు, రహదారులకు, భవనాలకు భూమిని కేటాయించడంలో ఉన్న ఆసక్తి వనాల పెంపకంలో కనిపించడం లేదు. దానివల్ల అటవీ విస్తీర్ణం రోజురోజుకూ తగ్గిపోతోంది. కావున ప్రభుత్వం అటవీ పెంపకానికీ తగినన్ని భూములు, నిధులు కేటాయించాలి. దురదృష్టవశాత్తు అటవీ భూములను తీసుకోవడమే తప్ప అలా జరగడం లేదు. పర్యావరణ, అటవీ చట్టాలెన్ని ఉన్నా కాలుష్యం పెరుగుదల, అటవీ విస్తీర్ణ తరుగుదల ఆగడం లేదు. చట్టాల అమలును కఠినతరం చెయ్యాలి. ఓవైపు పురోగతి... మరోవైపు అధోగతిలా కాకుండా ప్రభుత్వాలు, ప్రజలు ప్రకృతి పరిరక్షణలో మరింత చొరవ కనబరచినప్పుడే సుస్థిరాభివృద్ధి సాధ్యపడుతుంది.
(- పొడిశెట్టి సత్యనారాయణ, రచయిత)
ఇదీ చదవండి: నేడు తొలి కిసాన్ రైలు పరుగులు