బిహార్ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్‌కు మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ ఎన్నికలు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వానికి పరీక్షగా నిలవనున్నాయి. వరసగా నాలుగోసారి అధికారం దక్కించుకోవాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలకు అనేక అడ్డంకులు ఎదురొస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలో లుకలుకలు మరింత కలవరపెడుతున్నాయి.
కూటమిలో తిరుగుబాటు
సామాజిక వర్గాల సమీకరణాలు కీలకంగా ఉండే రాష్ట్రంలో.. జేడీయూ నిమ్నవర్గాల మద్దతుపై భారీగా ఆధాపడుతూ ఉంటుంది. అందుకోసమే ప్రత్యేకించి 'మహాదళిత్' వర్గాన్ని నితీశ్ సృష్టించారు. ఈ నేపథ్యంలో ఎల్జేపీ.. ఎన్డీఏ నుంచి బయటికి రావడం.. కేంద్ర మంత్రి రాంవిలాస్ పాసవాన్ మృతి.. నితీశ్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి.
మహాదళిత్ మాటేంటి ?
దళిత దిగ్గజ నేత పాసవాన్ మృతితో ఆ వర్గాల్లో భారీగా సానుభూతి కూడగట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ నుంచి ఎల్జేపీ దూరం కావడం వల్ల జేడీయూ ఓటు బ్యాంకుకు భారీ గండిపడే అవకాశం ఉంది. ఈ పరిస్థితులు ఎల్జేపీకి లేదంటే, మహాకూటమికి మేలు చేయనున్నాయి. నితీశ్ కుమార్ పార్టీకి మాత్రం ఇబ్బందులు తప్పేలా లేవు.
అగ్రవర్ణాలు అంతంతమాత్రమే..
నితీశ్ విజయాన్ని అడ్డుకునే మరో కీలక అంశం.. అగ్రవర్ణాల ఓటర్లు. పార్టీలో బలమైన రాజ్‌పుత్ నేత ఒక్కరు కూడా లేరు. భాజపాలోనూ ఈ వర్గం నుంచి కీలక నేతలు కనిపించటం లేదు. ఇది కూటమికి ఇబ్బంది కలిగించే అంశమే. 243స్థానాలున్న బిహార్ శాసనసభలో.. దాదాపు 45సీట్లలో రాజ్‌పుత్ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
మరోవైపు, ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీలో జగదానంద సింగ్ వంటి బలమైన రాజ్‌పుత్ నేత ఉన్నారు. ఆర్జేడీ దివంగత నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్, తనయుడు సత్యప్రకాశ్ సింగ్‌ను జేడీయూలో చేర్చుకున్నా.. ఎంతమేరకు ప్రభావం చూపించగలరన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.
ఆర్థికం-నిరుద్యోగం-వలసలు
మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత నితీశ్ కుమార్‌కు కునుకు లేకుండా చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. బిహార్‌లో పరిశ్రమల దుస్థితి, ఉపాధి అవకాశాలు లేకపోవడం ప్రతిపక్షం ఆర్జేడీ ప్రధాన అస్త్రాలుగా మారాయి. మరోవైపు ఎన్నికల్లో నితీశ్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, రాష్ట్రంలో 46.6% నిరుద్యోగం ఉందని.. దేశంలో ఇదే అత్యధికమని హోరెత్తిస్తూ ప్రజల వద్దకు వెళ్తున్నారు.
అలాగే వలసలు నితీశ్ సర్కారును తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోవటం వల్లే.. యువత వలస బాట పడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన 10లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో.. చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. నితీశ్ కుమార్ ప్రతిష్ఠత్మకంగా తీసుకొచ్చిన మద్యపాన నిషేధం వల్ల.. రాష్ట్ర ఆదాయంపై ప్రతికూల ప్రభావాన్ని చూపడమే కాక, బిహార్ పర్యటక రంగాన్ని కుప్పకూల్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫలితంగా అనేక హోటళ్లు మూసివేయాల్సి వచ్చిందని.. వేలాది మందికి ఉపాధి కల్పించే ఈ రంగం అస్తవ్యస్తమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఈ పరిస్థితులను ముందే ఊహించిన జేడీయూ.. ఎదురుదాడికి దిగింది. ప్రతిపక్షాలు నిరుద్యోగం ప్రధాన అస్త్రంగా మలుచుకున్న వేళ.. దేశంలో ఏ రాష్ట్రం, ప్రపంచంలో ఏ దేశం ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదని వాదిస్తోంది.
మైనార్టీలు మైనస్సే..
చివరగా.. జేడీయూకు మైనార్టీలతో పాటు ఇతర వర్గాల ఓట్లు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంఐఎం, ఆర్ఎల్ఎస్పీ కలిసి మరో 8పార్టీలతో ఏర్పడిన కూటమి.. నితీశ్ కుమార్ పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఓవైసీ ముస్లిం ఓట్లు, మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా.. కుష్వాహా-కొయిరి-కుర్మీల ఓట్లు చీల్చే అవకాశం కనిపిస్తోంది. అయితే, ముఖ్యమంత్రి నితీశ్ సైతం కుర్మీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండటం జేడీయూకు కొంత అనుకూలంగా కనిపిస్తోంది.
సమస్యల్లోంచే.. సానుకూలత
నాలుగోసారి బిహార్ పీఠం అధిష్టించాలనుకుంటున్న నితీశ్.. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో కొన్ని సానుకూల అంశాలు వెతుక్కునే పనిలో పడింది జేడీయూ. నితీశ్ కుమార్‌కు ప్రధాన పోటీదారులుగా ఉన్న తేజస్వీ యాదవ్, చిరాగ్ పాసవాన్ ప్రభుత్వాన్ని నడపటంలో పెద్దగా అనుభవం లేని నేతలు. ఈ నేపథ్యంలో నితీశ్ వర్గం ఈ అంశాన్ని ప్రచారంలో విస్తృతంగా ప్రజల ముందుకు తీసుకెళ్తోంది.
నితీశ్ కుమార్‌కు సవాల్ విసురుతున్న పక్షాల ప్రతికూల అంశాలు.. జేడీయూ సానుకూల అంశాలుగా మారనున్నాయి. ముఖ్యంగా మహాకూటమికి కీలకంగా నిలవాల్సిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఉండటం.. ఈ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనే అవకాశం లేకపోవటం నితీశ్ బృందంలో ఉత్సాహం నింపుతోంది. మరోవైపు మరణించిన మరో దిగ్గజ నేత రాంవిలాస్ పాసవాన్లోటు ఎల్జేపీని కలవరపెడుతుండగా.. ప్రచారంలోనైనా పైచేయి సాధించేందుకు అవకాశముందని అధికారపక్షం భావిస్తోంది.
ఇదీ చూడండి: బిహార్ బరిలో అందరిదీ అదే వ్యూహం
ఇదీ చూడండి: లాలూ సొంత గ్రామంలో విజయంపై ఆర్జేడీ కన్ను