చైనా ఇటీవల ప్రతిపాదించిన జాతీయ భద్రతా చట్టానికి వ్యతిరేకంగా హాంకాంగ్‌లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ వేర్పాటువాద శక్తుల చర్యలని చైనా ఆరోపిస్తుండగా, హాంకాంగ్ ప్రజాస్వామిక అనుకూల నేతలు ఖండిస్తున్నారు. ప్రస్తుతం హాంకాంగ్‌లోని క్షేత్రస్థాయి పరిస్థితులపై అక్కడి 'సివిక్ పార్టీ' నేత, చట్టసభ సభ్యుడు అల్విన్ యూంగ్ 'ఈటీవీ భారత్' ప్రత్యేక ప్రతినిధితో మాట్లాడారు. వివరాలివీ...
- ప్రశ్న: జాతీయ భద్రత పరిరక్షణకు, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకే కొత్తం చట్టాన్ని ప్రతిపాదించామని చైనా చెబుతోంది. ఈ వాదనపై మీరేమంటారు?
అల్విన్: 'ఒక దేశం- రెండు వ్యవస్థలు' విధానం కింద హాంకాంగ్‌కు సొంత నియమ నిబంధనలున్నాయి. మినీరాజ్యాంగంలా భావించే 'ప్రాథమిక చట్టం' పరిధిలో నడుచుకుంటుంది. దీనికింద జాతీయ భద్రత అంశాలపైనా సొంతంగా చట్టం రూపొందించుకునే వెసలుబాటు హాంకాంగ్ ప్రభుత్వానికి ఉంది. దేశీయ అంశాలను మా ప్రజలే నిర్ణయించుకుంటారు. చైనా ప్రతిపాదిస్తున్న జాతీయ భద్రత చట్టం మా హక్కుల్ని కాలరాస్తుందనే ఆందోళన ఉన్నందునే వద్దంటున్నాం. చైనా మా ఆందోళనల్ని పోలీసులతో క్రూరంగా అణచివేస్తోంది. ప్రాథమిక చట్టాన్ని, తానిచ్చిన హామీల్ని గౌరవించేది లేదని చెబుతోంది.
- ప్రశ్న: హాంకాంగ్ నిరసనల వెనక విదేశీ శక్తులు ఉన్నాయంటూ చైనా ఆరోపిస్తోంది. ఆందోళనకారుల్ని అల్లరిమూకలుగా అభివర్ణిస్తోంది... ఏమంటారు?
అల్విన్: నిరంకుశ ప్రభుత్వాలన్నింటి తీరు ఇలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరిపైనా నిందలేస్తారు. విపక్షాల్ని, విశ్వవిద్యాలయ విద్యార్థుల్ని విదేశీ శక్తులుగా అభివర్ణిస్తారు. దీనికి సంబంధించి ఒక్క ఆధారమూ ఉండదు. ప్రతి ఒక్కరిపైకీ వేలెత్తి చూపుతున్నారుగానీ, వారి సంగతి చూసుకోవడం లేదు. గత ఏడాది ఓ వివాదాస్పదమైన బిల్లును ఆమోదింపజేసేందుకు యత్నించి విఫలమయ్యారు. ఈ ఏడాది కూడా అంతకన్నా అధ్వానమైన చట్టాన్ని తీసుకురావాలని చూశారు.
- ప్రశ్న: నిరసనకారుల డిమాండ్లలో వేర్పాటువాదం ఉందనుకుంటున్నారా?
అల్విన్: కొంతమంది వేర్పాటువాదం అంశాన్నీ లేవనెత్తుతున్నారుగానీ, ఎక్కువమందిలో ఆ భావన లేదు. మా ప్రభుత్వాన్ని మేమే ఎన్నుకునే హక్కు మాకుంది. ఇది ప్రాథమిక చట్టంలో ఇచ్చిన హామీ. మేమేమీ చంద్రుడ్ని తెచ్చివ్వమని అడగటం లేదు. పోలీసుల క్రూరత్వంపై స్వతంత్ర విచారణ జరపాలని అడుగుతున్నారు. దీనిపై ఓ కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికీ తిరస్కరిస్తోంది. రాజకీయ అభియోగాలపై విచారణలు చేపట్టడాన్ని ఆపేయాలి. ఈ డిమాండ్లు సహేతుకం కాదని ఎవరైనా చెప్పగలరా! సాధారణ స్వేచ్ఛాయుత ప్రపంచంలో ఇలాంటి వాటిని డిమాండ్ చేయకుండానే ప్రభుత్వమే నెరవేరుస్తుంటుంది.
- ప్రశ్న: అమెరికా తన బాధ్యతల నుంచి తప్పుకొంటోంది, బహుళపక్ష సంస్థల నుంచి బయటికి వెళ్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశం చేస్తున్న ప్రకటనలు హాంకాంగ్‌కు తోడ్పడతాయా? పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారుస్తాయా?
అల్విన్: హాంకాంగ్ అనేది అంతర్జాతీయ నగరం. భారత్ సహా చాలా దేశాలకు ఇక్కడ బలమైన ప్రయోజనాలు ఉన్నాయి. పెట్టుబడులున్నాయి. పెద్ద సంఖ్యలో భారతీయ పౌరులు ఇక్కడ నివసిస్తున్నారు. అమెరికా, ఇతర దేశాలదీ ఇదే పరిస్థితి. గత శతాబ్దిన్నర కాలంగా హాంకాంగ్ విభిన్న దేశాలు, పెట్టుబడులతో అనసంధానమైంది. 1992లో హాంకాంగ్‌కు అమెరికా ప్రత్యేకహోదా గుర్తింపును ఇచ్చింది. చైనా ఒక దేశం రెండు వ్యవస్థలు, స్వతంత్ర ప్రతిపత్తి అంశాలను గుర్తించకపోవడంతో అమెరికా తామిచ్చిన హోదాను ఉపసంహరించుకుంటామని చెబుతోంది. అందుకని, చైనా ముందుగా జాతీయ భద్రత చట్టాన్ని ఉపసంహరించుకుని హాంకాంగ్‌ను ప్రత్యేకంగా పరిగణిస్తామని ప్రపంచానికి చాటాలి.
- ప్రశ్న: మీ ఆందోళనలు శాంతియుతంగా సాగేందుకు ఏం చేస్తారు. ఆయుధాలను ఉపయోగించడం లేదా?
అల్విన్: ఇప్పటిదాకా హాంకాంగ్ నిరసనల్లో తెరచాటు వ్యవహారాలేమీ లేవు. ఈ ఆందోళనలకు నాయకత్వం కూడా లేదు. ఇది నేతల్లేని ఉద్యమం. పదీఇరవై లక్షల మంది వీధులకెక్కినా ప్రశాంతంగా మొదలైన పోరాటమిది. ప్రజల డిమాండ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినప్పుడే అసహనం మొదలవుతుంది. పోలీసులు సాధారణ ప్రజలపై బాష్పవాయు గోళాల్నీ, రబ్బర్ బుల్లెట్లనూ ప్రయోగిస్తే, ప్రజలు కోపోద్రిక్తులవుతున్నారు. గత ఏడాది వ్యవధిలో పోలీసుల క్రూరత్వానికి సంబంధించి ఎన్నో ఉదంతాలున్నాయి.
- ప్రశ్న: హాంకాంగ్ ఉద్యమానికి చైనా ప్రజల సంఘీభావం దక్కుతోందా?
అల్విన్: చైనా ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకోవడం అంత తేలికైన పనికాదు. అయితే, హాంకాంగ్ ప్రజల స్వాతంత్య్ర ఉద్యమానికి వారి మద్దతు ఉంటుందనే ఆశిస్తున్నాం. హాంకాంగ్‌తో పోలిస్తే, అక్కడి పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంటుంది. మాకు ఇప్పటికీ అంతర్జాలాన్ని వాడుకునే స్వేచ్ఛ ఉంది. చైనాలో అలాంటి పరిస్థితి లేదు.
ఇదీ చూడండి: శాంతియుతంగా ఫ్లాయిడ్ నిరసనలు- వెనక్కి మళ్లిన సైన్యం!