Salt Satyagraha Sarojini Naidu: జాతీయోద్యమాన్ని మలుపు తిప్పిన ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం. సబర్మతి నుంచి సుమారు 78 మందితో ఆరంభమైన యాత్రలో దండికి చేరేసరికి లక్షల మంది చేరారు. ఊరూరా వందల మంది యాత్రలో జమయ్యారు. ఆ జన ప్రవాహాన్ని చూసి భారతీయులంతా ఉత్తేజితులై ఉరకలెత్తుతుంటే... ఒక వర్గం మాత్రం అసంతృప్తితో రగిలిపోయింది. వారే... భారతీయ మహిళలు! కారణం- ఉప్పు సత్యాగ్రహంలో మహిళలకు గాంధీజీ చోటు కల్పించకపోవటం. సబర్మతి నుంచి దండికి బయల్దేరిన గాంధీజీ అనుయాయుల జాబితాలో ఒక్కరంటే ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదు. ఇది జాతీయోద్యమానికి ఆకర్షితులైన అనేకమంది అతివలకు ఆగ్రహం కలిగించింది. బొంబాయిలో కమలాదేవి ఛటోపాధ్యాయ, సరోజినీ నాయుడు, పెరిన్ కెప్టెన్ (దాదాబాయి నౌరోజి మనవరాలు)లు గాంధీకి తమ అసంతృప్తిని వ్యక్తంజేస్తూ లేఖ రాశారు. ఆయన్ను కలవాలనుకున్నారు.
Salt March Women:
గాంధీజీ తన వాదన వినిపించారు. "మహిళల శక్తిపై నాకెలాంటి అనుమానం లేదు. కానీ ఆడవారిని అడ్డంపెట్టుకొని పిరికిపందల్లా ఉప్పు సత్యాగ్రహం చేస్తున్నారని ఆంగ్లేయులు అనే అవకాశం ఉందని ముందు జాగ్రత్తగా దండి యాత్ర జాబితాలో వారిని చేర్చలేదు. శాసనోల్లంఘనలో మహిళలు పాలు పంచుకోవటం మంచిదే. అయితే వారు మద్యనిషేధం, మద్యం షాపుల ముందు పికెటింగ్, ఖాదీ తయారీ తదితర రంగాల్లో చురుగ్గా పాల్గొనాలి. మగవారి మనసు మార్చే శక్తి మహిళలకే ఉంది. మద్యం ఆగిపోతే సమాజం బాగుపడుతుంది" అంటూ గాంధీజీ తన ఉద్దేశాన్ని వివరించారు. దండి దాకా సాగిన యాత్రలో ప్రతి ఊర్లోనూ ఆయన స్థానిక మహిళలను ఇంట్లోనే ఉప్పు తయారు చేయాలని ప్రోత్సహించారు. కానీ సరోజినీ నాయుడు, కమలాదేవి ఛటోపాధ్యాయలాంటివారు తాము కేవలం పికెటింగ్‌లకే పరిమితం కాబోమని... ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలోనూ పాల్గొంటామని తేల్చిచెప్పారు. భారతీయ మహిళలకు నిత్యజీవితంలో ఉప్పుతో విడదీయరాని అనుబంధముంది. అలాంటి ఉప్పు సత్యాగ్రహంలో మేం పాల్గొనకుండా ఉండలేం... అంటూ స్పష్టం చేశారు. వద్దన్నా వినకుండా సరోజినీ నాయుడు, మితుబెన్‌లు కారులో దండికి చేరుకున్నారు.
Sarojini Naidu Salt march:
1930 ఏప్రిల్ 6న దండిలో గాంధీజీ ఉప్పును చేతపట్టిన రోజునే.. కమలా ఛటోపాధ్యాయ సారథ్యంలో కొంతమంది మహిళల బృందం బొంబాయిలోని చౌపటి బీచ్‌కు చేరుకుంది. వెంట స్టవ్‌లు, పొయ్యిలు తీసుకొచ్చి.. సముద్రపు నీటిని వేడి చేసి ఉప్పు తయారు చేయటం మొదలెట్టారు. నారీమణుల ఈ సాహసాన్ని చూడటానికి వేలమంది బీచ్‌లో జమయ్యారు. చుట్టూ ఉన్న బిల్డింగ్‌లు, చెట్ల మీద కూడా జనం చేరారు. ఇదేదో సమస్యలా మారేలా ఉందని గమనించిన ఆంగ్లేయ సర్కారు భారీస్థాయిలో బలగాలను దించి లాఠీఛార్జీకి ఆదేశించింది. ఈ పెనుగులాటలో కమలాదేవితో పాటు అనేకమంది స్టవ్‌లపైనా పొయ్యిలపైనా పడ్డారు. లాఠీ గాయాలతో పాటు కమలాదేవికి ఒళ్లు కాలింది. అయినా.. ఉద్యమాన్ని విరమించటానికి వారంతా నిరాకరించారు. ఈ విషయం తెలియగానే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది మహిళలు ఆయుధాలతో కాకుండా బిందెలు, కుండలు, పాత్రలతో పరుగెత్తుకొని వచ్చారు. దీంతో పోలీసులు అశక్తులై చూస్తుండిపోయారు.
లాఠీ దెబ్బలు, కాలిన గాయాలతోనే పట్టుబట్టి తయారు చేసిన ఉప్పును మహిళలంతా కలసి చిన్నచిన్న పొట్లాలుగా కట్టారు. ధైర్యంగా తీసుకెళ్లి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ, హైకోర్టు ఆవరణలో వాటిని అమ్మారు. వారి ధైర్యానికి మద్దతుగా బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ ఆరోజు తన కార్యకలాపాలను రద్దు చేసుకుంది. కమలాదేవి ధైర్యం చేసి హైకోర్టు ఆవరణలో న్యాయమూర్తి ముందు ఉప్పుప్యాకెట్ ఉంచి 'ఇది స్వతంత్ర ఉప్పు. కొంటారా' అని అడిగారు. ఆమె తయారు చేసిన పొట్లం రూ.501 ధర పలికింది. బొంబాయిలో అలా మహిళల పట్టుదలతో మొదలైన ఉప్పు సత్యాగ్రహం చాలారోజుల పాటు సాగింది.
కొసమెరుపు...
తొలుత ఉప్పు సత్యాగ్రహంలో మహిళలను పక్కనబెట్టిన గాంధీజీ తన అరెస్టు తర్వాత ఆ ఉద్యమ బాధ్యతను సరోజినీ నాయుడుకు అప్పగించారు.