కొవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ విద్యార్థులు, విద్యాసంస్థల సిబ్బంది క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేసింది. జూన్‌లో పరిస్థితులను సమీక్షించిన అనంతరం తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లడించారు. పది, పన్నెండు తరగతులకు చెందిన లక్షకు పైగా విద్యార్థులకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది. రాష్ట్రాల పరీక్షల బోర్డులు సీబీఎస్‌ఈ నిర్ణయాలను ప్రామాణికంగా తీసుకోవడం ఆనవాయితీ. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పది పరీక్షలను రద్దు చేసి 12వ తరగతి పరీక్షలు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ ఈ విషయంలో సత్వరం నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుకుంటున్నారు.
జీవితంలో కీలక మలుపు
గత విద్యా సంవత్సరం పరీక్షల సమయంలోనే కొవిడ్ వ్యాప్తి ముమ్మరించింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అత్యధిక రాష్ట్రాలు పరీక్షలను రద్దుచేశాయి. భవిష్యత్తులో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇది ఇబ్బందికరమవుతుందని చాలామంది విద్యార్థులు వాపోయారు. దానితో ఆ పరిస్థితి మళ్ళీ తలెత్తకూడదని, ఈ ఏడాది పరీక్షలు ప్రత్యక్షంగానే నిర్వహిస్తామంటూ నిరుడు డిసెంబరులో సీబీఎస్‌ఈ పరీక్షా ప్రణాళిక విడుదల చేసింది. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వాలూ పరీక్షల తేదీలను ప్రకటించాయి. కరోనా మొదటి దశ ఉద్ధృతి తరవాత కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు పాఠశాలలను తెరిచాయి. ప్రత్యక్షంగా వీలుకాని చోట్ల ఆన్‌లైన్ విద్యను ప్రోత్సహించాయి. దీనితో విద్యార్థుల చదువులు గాడిలో పడతాయని అందరూ ఊపిరి పీల్చుకోవడంతో పాటు పరీక్షల నిర్వహణకూ కొంత సానుకూలత ఏర్పడింది.
ఇదీ చదవండి: ఉన్నత ఆదర్శానికి సాంకేతిక దన్ను
ఊహించని రెండో దశ..
ఈ తరుణంలో ప్రారంభమైన కొవిడ్ రెండో దశ విజృంభణతో అంచనాలన్నీ తలకిందులయ్యాయి. పరీక్షలు విద్యార్థుల జీవితాల్లో అత్యంత కీలకఘట్టం. ఇవి పిల్లల అభ్యాస సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి. అంతేకాదు, స్వీయ మదింపు-అభివృద్ధికీ అక్కరకొస్తాయి. పరీక్షల ద్వారా విద్యార్థులకు సహనం, క్రమశిక్షణ అలవడతాయి. వ్యక్తిగత నైపుణ్యాన్ని అంచనా వేసుకొంటూ, తమనుతాము మెరుగుపరచుకోవడానికి ఎంతగానో సహాయపడతాయి. ఏటా లక్షల మంది రాసే 10, 12 తరగతి పరీక్షలు విద్యార్థి జీవితంలో కీలక మలుపులు. ఇక్కడ గెలుపే భవిష్యత్తు గమనాన్ని నిర్దేశిస్తుంది. నిర్ణయాత్మకమైన ఈ దశలో మంచి మార్కులు సాధించడానికి విద్యార్థి తీవ్రంగా కృషి చేస్తాడు. కానీ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న వేళ పరీక్షలు నిర్వహిస్తే- లక్షల మంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొనవలసి వస్తుంది. వ్యాధి సామూహిక వ్యాప్తికి ఇది కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొవిడ్‌తో కుటుంబసభ్యులను కోల్పోయిన విద్యార్థులూ గణనీయంగానే ఉన్నారు. వారంతా తేరుకొని ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాయడం కష్టతరం. ఈ క్రమంలో పరీక్షలను రద్దు చేయడమే ఉత్తమ మార్గంగా కనపడుతోంది. కానీ, పిల్లలను పై తరగతికి పంపడానికి సహేతుక మార్గాలను అనుసరించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: జన చైతన్యమే ప్రజాస్వామ్యానికి రక్ష
కొవిడ్ సంక్షోభంతో చదువులు సరిగ్గా సాగక విద్యార్థుల్లో తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో పరీక్షలకు దూరం జరుగుతూ, పిల్లల విషయ జ్ఞానాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వాలు నూతన విధానాలను అన్వేషించాలి. వీలైతే ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకుగాను మొదట విద్యార్థుల్లో నెలకొన్న డిజిటల్ అంతరాలను తొలగించాలి. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు అందుబాటులో లేని కుటుంబాలను పరిగణనలోకి తీసుకుని పిల్లలందరికీ మేలు చేకూర్చే విధానాలనే అమలుచేయాలి. పదో తరగతి పరీక్షలను రద్దు చేసినా విద్యార్థుల విషయ నైపుణ్యాల ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తామని సీబీఎస్‌ఈ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాతిపదికన కేటాయించిన మార్కులతో విద్యార్థులు సంతృప్తి చెందకపోతే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మళ్ళీ పరీక్షలు రాసుకునే వెసులుబాటు కల్పిస్తామంటున్నారు.
కత్తి మీద సామే!
విషయ నైపుణ్యాల అంచనా పద్ధతి ఉభయ తారక విధానం. ఇది ఇటు విద్యార్థులకు, అటు విద్యాసంస్థలకు లబ్ధి చేకూరుస్తుంది. ఈ విధానం కింద వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఫలితాలను ఖరారు చేస్తారు. ఏ విద్యార్థికీ నష్టం జరగకుండా దీన్ని రూపొందిస్తారు. విద్యార్థి ప్రవర్తన, క్రమశిక్షణ, హాజరు, ప్రాజెక్ట్ వర్క్, అభ్యాస సామర్థ్యాలు, ఇతర అంశాల ఆధారంగా విద్యార్థి నైపుణ్యాన్ని అంచనా వేస్తారు. ఈ విధానం ఇప్పటికే అనేక దేశాల్లో అమలులో ఉంది. దీన్నే ‘మల్టీ క్రైటీరియా అనాలిసిస్ పాయింట్ బేస్డ్ సిస్టమ్’ అనీ అంటారు. పదో తరగతి విద్యార్థుల విషయంలో సీబీఎస్‌ఈ దీన్నే ఎంచుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలూ ఈ విధానాన్నే అమలు చేయవచ్చు. అయితే, విద్యార్థుల విషయ నైపుణ్యాల అంచనాలో జాగ్రత్తగా వ్యవహరించాలి. పాఠశాలలు మూతపడి, బోధన కుంటుపడటంతో విద్యార్థులకు అభ్యసన నష్టం వాటిల్లింది. ఫలితంగా వారి సమగ్ర నైపుణ్యాలను అంచనా వేయడం కత్తిమీద సాము కానుంది. విద్యార్థుల ప్రతిభను గుర్తించడానికి ఇంకొంచెం సహేతుకమైన విధానాల రూపకల్పనకు ప్రభుత్వాలు నడుంకట్టాలి.
- సంపతి రమేష్ మహారాజ్
ఇవీ చదవండి: ప్రజారోగ్యానికి పెను సవాలు