రంగారెడ్డి జిల్లాకు చెందిన చందు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కరోనా ఉందన్న అనుమానంతో పరీక్ష చేయించుకునేందుకు స్థానిక ప్రభుత్వ దవాఖానాకు తల్లితో పాటు వెళ్లాడు. ఇద్దరూ కొవిడ్ పరీక్ష చేయించుకున్నారు. తల్లికి నెగెటివ్ ఫలితం వచ్చింది. తన ఫలితం ఎలా ఉంటుందోనన్న అనుమానం, భయంతో బయటకు వచ్చి దవాఖానా ప్రాంగణంలోని మెట్లపై కూర్చున్నాడు. కాసేపటికి కూర్చున్నచోటే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తరవాత అతడికీ నెగెటివ్ ఫలితం వచ్చింది. ఈ విషాద ఘటనకు కారణం కేవలం భయమే.
మనిషిని పాము కరిస్తే- దాని విషం కంటే భయమే అతడి ప్రాణాలు తీసే ప్రమాదం ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. భయం, ఆందోళన, కుంగుబాటు వ్యాధినిరోధకశక్తిని తగ్గిస్తాయి. దీంతో మానవ శరీరంపై వైరస్ మరింత దాడిచేస్తుంది. భయమే మృత్యువు, ధైర్యమే ఆయువు అని తెలుసుకొని, అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కోవాలి. అంటే, భయాన్నే భయపెట్టాల్సిన సమయమిది. 1720లో ఫ్రాన్స్‌లో ప్లేగువ్యాధి విలయతాండవంచేసి, లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. 1820లో కలరా- ఆసియా, ఐరోపా దేశాల్లో పెద్దసంఖ్యలో ప్రజల్ని బలితీసుకుంది. 1920లో స్పానిష్ ఫ్లూ ప్రపంచాన్ని విలవిలలాడేలా చేసి కోటి మందిని చంపింది. విపత్తు ఎంత భయంకరమైనదైనా ప్రపంచ దేశాలు సమష్టిగా వాటిని జయించాయి. ఈ విపత్తునూ మనం జయిస్తాం. కంటికి కానరాని వైరస్‌ను ఎదుర్కొంటామనే ధీమాతో దాని దగ్గరకు వెళితే సమూలంగా కబళించేస్తుంది. దానికి దూరంగా ఉంటే చాలు, నిస్సహాయంగా మారి మంచులా కరిగిపోతుంది.
వ్యాక్సిన్ ద్వారా..
జూన్, జులైనాటికి కనీసం 30-40 శాతం జనాభాకువ్యాక్సిన్ ఇవ్వగలిగితే- వైరస్ ప్రభావం తగ్గిమూడో విడత ప్రభావం ఉండక పోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వ్యాధిని గుర్తించడం, వ్యాధి నియంత్రణ చర్యలు చేపట్టడం, రోగులకు వెంటనే మెరుగైన చికిత్స అందివ్వడమనే మూడుదశలు పాటించి దక్షిణ కొరియా- మహమ్మారిపై అద్భుత విజయం సాధించింది. ఉత్తమ నివారణ పద్ధతులు, ఆలస్యంలేని వ్యాధి నిర్ధారణ పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్ గురించి ప్రజలతో స్పష్టంగా సంభాషించడం, రోగులకు తగినంత సహాయంతో కూడిన కఠినమైన క్వారంటైన్ విధానం కరోనాను జయించేలా చేశాయి. 60ఏళ్లు పైబడినవారికి అత్యుత్తమ చికిత్సను ఇజ్రాయెల్ వైద్య ఆరోగ్యమంత్రిత్వశాఖ అందించగలిగింది. రోగలక్షణాలు ఎక్కువగా ఉన్నవారిని వెంటనే ఆసుపత్రికి తరలించడం, లక్షణాలు లేనివారిని ఇంట్లోనే ఉంచి చికిత్సచేయడం మొదలుపెట్టారు. వారికి అవసరమైన మందులు, నిత్యావసర వస్తువులు ఇంటికే పంపే ఏర్పాట్లు చేశారు. ఎవరైనా బయటకు వెళ్తే, ఆ విషయాన్ని తెలియజేసే మొబైల్ అప్లికేషన్లు ఉపయోగించడం తప్పనిసరి చేశారు.
జాగ్రత్తలు తప్పనిసరి
కరోనా నియంత్రణలో వ్యాక్సిన్ తీసుకోవడం, మాస్కులు సరిగా వాడటం, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడమే కీలకాంశాలు. మాస్కు ధరించే ముందు చేతుల్ని శుభ్రంగా కడుక్కుని తుడుచుకోవాలి. ఒకవేళ మాస్కుపై మడతలు ఉంటే అవి కిందివైపు ఉండేలా చూసుకోవాలి. చెవులకు లేదా తల వెనకవైపు బిగుతుగా కట్టుకోవాలి. మాస్క్ ధరించే వరకు రెండు చేతులు, ధరించాక వెనువెంటనే సవరించడానికి కుడి చేయి, తొలగించే సందర్భంనుంచి పడేసే వరకు ఎడమ చేయి... ఇలా ఓ క్రమమైన చేతుల పని విభజనతో ఆరోగ్యకరమైన మాస్కుల వాడకం అలవాటు చేసుకోవాలి. దక్షిణ కొరియా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెలువరించే ప్రొటోకాల్స్ అత్యంత క్రమశిక్షణతో పాటిస్తూ మహమ్మారిని కట్టడి చేశాయి. ఇంట్లో వృద్ధులు, తీవ్రజబ్బులు ఉన్నవారు, పిల్లలు ఉంటే వారిని రివర్స్ ఐసొలేషన్‌లో ఉంచాలి. అంటే వారికి మిగతావారే భౌతిక దూరం పాటించాలి. ఒకవేళ వారు మనవద్దకు వచ్చినా, మనమే కనీసం ఆరు అడుగుల దూరంలో ఉండి మాట్లాడాలి.
అవగాహన ముఖ్యం
కరోనా విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలి. ఈ విపత్కర సమయంలో విమర్శలకన్నా పరామర్శలతో కూడిన సమష్టికృషితో జనాల్లో భయాన్ని పోగొట్టాలి. మాస్కుల వాడకంలో లోపాలు, భౌతిక దూరం పాటించడంలో నిర్లక్ష్యమే కొవిడ్‌వ్యాప్తిని, మరణాలరేటును గణనీయంగా పెంచుతున్నాయని ఇటీవలి అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కరోనా నివారణకు ఉచితంగా పరీక్షలు చేయడం సహా సర్కారీ వైద్యశాలల్లో ప్రభుత్వం చికిత్స అందిస్తోంది. హోం ఐసొలేషన్‌లో ఉన్నవారికి కరోనాకిట్లు పంపిణీ చేస్తున్నారు. వైద్యులు, సిబ్బంది వీరిని పర్యవేక్షిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించి, వారి పర్యవేక్షణలో మందులు వాడితే ఎలాంటి సమస్యలు లేకుండా కొవిడ్ తగ్గిపోతుందని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆశావహ దృక్పథం, స్వీయ నియంత్రణతో ప్రజలు అటు ప్రభుత్వాలు, ఇటు మొదటి వరస యోధులకు పూర్తిగా సహకరిస్తే కరోనాను నియంత్రించడం ఎంతో సులభమవుతుంది.
- డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి
ఇదీ చదవండి : దిల్లీలో కరోనా మృత్యుఘోషకు కారణాలివే!