మనిషికి శ్వాసలాగా జాతికి విద్యుత్ ప్రాణావసరంగా మారిపోయిన రోజులివి. కొవిడ్ మహమ్మారి దుష్ప్రభావాలతో కుదేలైన పరిశ్రమలు, వ్యవసాయం సహా భిన్నరంగాలు ఇప్పుడిప్పుడు గాడిన పడుతుండగా- బొగ్గు కొరత (Coal Shortage in India) మూలాన దేశంలో పలుచోట్ల విద్యుత్ సంక్షోభం ముంచుకొచ్చే సూచనలు హడలెత్తిస్తున్నాయి. పొరుగున చైనా తరహాలో ఇండియాలోనూ కరెంటు కటకట దాపురించనుందన్న కథనాలు, విశ్లేషణలు వట్టి అర్థరహితాలని కేంద్ర అమాత్యులు కొట్టిపారేస్తున్నారు. వినియోగదారులకు అప్రమత్త సందేశాలు పంపించిన విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కమ్)లపైనా మంత్రులు కన్నెర్ర చేశారు. వాస్తవంలో, దేశంలోని 70 వరకు విద్యుత్ కేంద్రాల్లో రెండుమూడు రోజులకు సరిపోయే (Coal Shortage in India) బొగ్గు నిల్వలే మిగిలాయి. సాధారణంగా రెండు వారాలకు సరిపడా నిల్వలు ఉండాలి!
పంజాబ్, యూపీ, కేరళ, బిహార్ ప్రభృత రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని ప్లాంట్లు మూతపడగా, తక్కినవి (Coal Shortage in India) సగం సామర్థ్యంతోనే నడుస్తుండటం- పొంచి ఉన్న ముప్పును ప్రస్ఫుటీకరిస్తోంది. ఏపీలో కరెంటు కోతలు త్వరలో తథ్యమన్న సంకేతాలు చిమ్మచీకట్లు ముసురుతున్నట్లు స్పష్టీకరిస్తున్నాయి. ఒక్క విద్యుత్ అనేముంది- ఉక్కు, సిమెంటు తదితర పరిశ్రమలకు బొగ్గే అతిముఖ్యమైన ముడిసరకు. బొగ్గు కొరత కారణంగా ధరోల్బణం ముమ్మరించి నిర్మాణ వ్యయం పోటెత్తనున్న తరుణంలో తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాలని 'క్రెడాయ్' (స్థిరాస్తి అభివృద్ధిదారుల సమాఖ్య) ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది. అసంఖ్యాక జీవనరంగాలు, పెద్దయెత్తున అసంఘటిత కార్మికుల బతుకుల్లో అల్లకల్లోలాన్ని నివారించే కార్యాచరణగా- కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి ఇతోధిక ఉత్పత్తి యోచన ఏ మేరకు అక్కరకొస్తుందో చూడాలి!
రూ.వేల కోట్లు బాకీ!
వివిధ రాష్ట్రాల్లో బొగ్గు నిల్వలు అడుగంటడానికి ఇవీ కారణాలంటూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఒక జాబితా క్రోడీకరించింది. ఆర్థిక వ్యవస్థ కోలుకునే క్రమంలో విద్యుత్తుకు గిరాకీ పెరగడం, గనుల ప్రాంతాల్లో ఇటీవలి భారీ వర్షాలు, దిగుమతి చేసుకునే బొగ్గు ధరల ప్రజ్వలనం.. ఇవే ప్రస్తుత కొరతకు (Coal Shortage in India) దారితీశాయంటోంది. కరెంటు కోతలకు సిద్ధమవుతున్న రాష్ట్రాలు తమ వద్ద ఉన్న 'కేటాయించని విద్యుత్తు'ను వినియోగించుకోవాలంటున్న కేంద్రం- విద్యుత్ మిగులు రాష్ట్రాలు తక్కినవాటికి సర్దుబాటు చేయాలని తాజాగా సూచించింది. బొగ్గు కొరతకు మూలకారణాన్ని అసలు ప్రస్తావించకనేపోవడం విస్మయపరుస్తోంది. గనుల నుంచి బొగ్గు కొంటున్న విద్యుత్ కేంద్రాల యాజమాన్యాలు వేలకోట్ల రూపాయల మేర బాకీలు పేరబెట్టాయని, గడువులోగా చెల్లించనందువల్ల కట్టాల్సిన వడ్డీలే వందలకోట్ల రూపాయలకు చేరుకున్నాయన్న విశ్లేషణలు దిగ్భ్రాంతపరుస్తున్నాయి.
భూరి బకాయిల వల్లనే కొన్ని నెలలుగా సరఫరాలు తగ్గిస్తున్న కారణంగా, విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ఇంతగా పడిపోయాయి. మరిన్నాళ్లూ ప్రభుత్వం పట్టించుకోకుండా సమస్యను ఇలా ఎందుకు ముదరబెట్టిందన్న ప్రశ్నకు సరైన బదులిచ్చే నాథుడు లేడు! ఇప్పటికిప్పుడు ఆ బకాయిలన్నింటినీ చెల్లుచేసే ఆర్థిక స్థోమత థర్మల్ కేంద్రాలకు లేదు; బొగ్గు ఉత్పత్తిని అమాంతం పెంపొందించే సామర్థ్యం గనుల యాజమాన్యాలకు కరవు! అత్యధిక బొగ్గు నిల్వలున్న దేశాల జాబితాలో ఇండియాది అయిదోస్థానం. గిరాకీ, సరఫరాల మధ్య అగాధంవల్ల విదేశాలనుంచి బొగ్గు దిగుమతి చేసుకునే దేశాల్లో రెండోస్థానాన నిలవాల్సి వస్తోంది. ఇంధన రంగంలో స్వావలంబన దిశగా ఆమధ్య బొగ్గు రంగాన సంస్కరణలకు తెరతీసినా- సంక్షోభాల నివారణలో తగిన సన్నద్ధత కొరవడిందనడానికి ఇటీవలి పరిణామక్రమమే రుజువు. కొద్దిపాటి సర్దుబాట్లు, హెచ్చరికలతో సరిపుచ్చకుండా విద్యుత్ కేంద్రాల్ని సత్వరం ఒడ్డున పడేయడం ఎలాగన్నదానిపై ప్రభుత్వమిప్పుడు దృష్టి కేంద్రీకరించాలి. పోనుపోను బొగ్గు ఆధారిత కేంద్రాలను కనిష్ఠ స్థాయికి కుదించి సౌర, పవన, జీవ ఇంధనోత్పత్తిని విస్తరించేలా దీర్ఘకాలిక బహుముఖ కార్యాచరణనూ పట్టాలకు ఎక్కించాలి!
ఇదీ చూడండి : Coal Shortage: '22 రోజులకు సరిపడా 'బొగ్గు' నిల్వలున్నాయ్'