సరిగ్గా మూడున్నర దశాబ్దాల క్రితం- 1986 ఏప్రిల్ 26న చెర్నోబిల్‌లో సంభవించిన అణు ప్రమాదం మానవ చరిత్రలో ఒక విషమ ఘట్టం. అది మానవ తప్పిదం వల్ల జరిగిన ప్రమాదమే తప్ప అనుకోకుండా సంభవించినది కాదు. చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రంలోని నాలుగో రియాక్టర్‌లో సాంకేతిక నిపుణులు చేసిన ఒక ప్రయోగం వికటించి పెను విస్ఫోటానికి దారితీసింది. జపాన్‌లో హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా ప్రయోగించిన అణు బాంబులకన్నా ఎన్నో రెట్ల ఎక్కువ రేడియోధార్మికతను చెర్నోబిల్ అణు కేంద్రం విరజిమ్మింది. చెర్నోబిల్ ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఉన్నా, అది పూర్వ సోవియట్ యూనియన్‌లో అంతర్భాగం. చెర్నోబిల్‌కు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్రెయిన్ రాజధాని కీవ్ వాసులకు సైతం అణు దుర్ఘటన గురించి తెలియలేదంటే, అప్పటి సోవియట్ ప్రభుత్వం ఎంత గుంభనంగా వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చు.
నిషిద్ధ మండలంలో సందర్శకులు
చెర్నోబిల్ విపత్తు గురించి సోవియట్ అధికారులు బయటి ప్రపంచానికి చెప్పకపోయినా, ప్రమాదకరమైన రేడియో ధార్మికత ఆనవాళ్లు ఎక్కడో ఉత్తరాన ఉన్న స్వీడన్‌తోపాటు పొరుగు దేశాల్లోనూ కనిపించడంతో విషయం బయటపడింది. పేలిన రియాక్టర్‌లో రేడియేషన్ దుష్ప్రభావం వల్ల దాదాపు 50 మంది ప్లాంట్ కార్మికులు, అగ్నిమాపక దళ సభ్యులు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న 3,50,000 మంది ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. వారిలో దాదాపు 6,500 మంది తదుపరి సంవత్సరాల్లో థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడ్డారు. చెర్నోబిల్ వాసుల సంతానానికి రేడియో ధార్మికత విష ప్రభావం సంక్రమించలేదని పరిశోధకులు తేల్చారు. దుర్ఘటన జరిగిన ప్రాంతానికి అతి సమీపంలోని ప్రిప్యాత్ పట్టణంలోని 30,000 జనాభాను వెంటనే ఖాళీ చేయించడంతో, గడచిన మూడున్నర దశాబ్దాల నుంచి అది నిర్మానుష్యంగా మిగిలింది.
చెర్నోబిల్ చుట్టుపక్కల మొత్తం 2,600 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని నిషిద్ధ మండలంగా ప్రకటించడంతో ఇప్పుడక్కడ ఎలుగు బంట్లు, తోడేళ్లు, అడవి గుర్రాలు, పక్షులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. మానవ సంచారం మటుమాయమైనప్పుడు జంతుజాలం ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికి దీన్ని మహదవకాశంగా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. మానవులకన్నా జంతువులకు రేడియో ధార్మికతను తట్టుకునే శక్తి ఎక్కువ. ఈ అంశాన్నీ శాస్త్రజ్ఞులు శోధిస్తున్నారు. చెర్నోబిల్ అణు కేంద్రంపై కాంక్రీటు గోరీ కట్టే పని 2019లో పూర్తయింది. గోరీ లోపల అణు కర్మాగార శిథిలాలను తొలగించే పనిని రోబోలు చేస్తున్నాయి. చెర్నోబిల్ ప్లాంట్ నుంచి ఇప్పటికీ రేడియో ధార్మికత వెలువడుతున్నా, అది చాలా తక్కువ స్థాయిలో ఉంది. శాస్త్రజ్ఞులు పరిశోధనలు కొనసాగించడానికి, పర్యాటకులు వచ్చిపోవడానికి అదేమీ అడ్డుకాదు.
చెర్నోబిల్ పేరిట 2019లో ప్రసారమైన అమెరికన్ టీవీ సీరియల్ అశేష జనాదరణ పొందినప్పటి నుంచి పర్యాటకుల తాకిడి రెండింతలు పెరిగింది. ముఖ్యంగా నిర్మానుష్య ప్రిప్యాత్ నగరం సందర్శకులకు ప్రధాన ఆకర్షణగా మారింది. చెర్నోబిల్ ప్రాంతంలో రేడియో ధార్మికత తగ్గినా, అక్కడెవరూ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోకూడదని అధికారులు ఆదేశించారు. అయినప్పటికీ దాదాపు 100 మంది వయోధికులు చెర్నోబిల్ అణు కేంద్రానికి 30 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తూనే ఉన్నారు. ప్రిప్యాత్ పట్టణ వీధుల్లో పిచ్చి మొక్కలు, పొదలు, చెట్లను తొలగించి, 2020లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఒకప్పడు ఆ పట్టణంలో నివసించినవారు కొందరు తిరిగి పట్టణాన్ని సందర్శించి పాత స్మృతులను గుర్తుకుతెచ్చుకున్నారు. క్రమంగా విదేశీ పర్యాటకుల రాకపోకలు పెరగడంతో ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రిప్యాత్ పట్టణాన్ని పునరుద్ధరించాలనుకొంటోంది. అణు ప్రమాద సమయంలో వాడిన సహాయక పరికరాలు, ఇతర చిహ్నాలతో ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయదలచింది. కొవిడ్ మహమ్మారి సద్దుమణిగాక మరిందరు సందర్శకులు వస్తారని ఆశిస్తోంది. ప్రిప్యాత్‌లోని అమ్యూజ్‌మెంట్ పార్క్, ఈత కొలను తదితర కట్టడాలను సందర్శించడానికి అనువుగా కాలి బాటలు నిర్మిస్తోంది.
వేగంగా పునరుద్ధరణ పనులు
చెర్నోబిల్, దాని పరిసరాల్లోని నిషిద్ధ మండలంలో జన సంచారం లేకపోవడంతో, అక్కడ ఒక అణు ఇంధన నిల్వ కేంద్రాన్ని నిర్మించాలని ఉక్రెయిన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దేశంలో ఇప్పటికీ నాలుగు అణు విద్యుత్కేంద్రాలు పనిచేస్తున్నాయి. వాటిలో వాడిన అణు ఇంధనాన్ని ఇంతవరకు రష్యాలో నిల్వ చేస్తున్నారు. అందుకు ఏటా 20 కోట్ల డాలర్లు చెల్లించుకోవలసి వస్తోంది. వాడేసిన అణు ఇంధనాన్ని ఇకనుంచి చెర్నోబిల్ నిషిద్ధ మండలంలో నిల్వచేసి, విదేశ మారకద్రవ్యాన్ని ఆదా చేసుకోవాలని ఉక్రెయిన్ భావిస్తోంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించాలనీ కోరుతోంది. ఈ గుర్తింపు లభించాలంటే, మొదట తమ దేశంలో చారిత్రక ప్రాముఖ్యం గల స్థలాల జాబితాలో అధికారికంగా చేర్చాల్సి ఉంటుంది. చెర్నోబిల్ అణు కేంద్రానికి మరమ్మతులు చేసి, సమీపంలోని ప్రిప్యాత్ పట్టణాన్ని పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ ఇప్పటికే ఆ పనులు చేపట్టింది. ప్రిప్యాత్‌తోపాటు 2,600 చదరపు కిలోమీటర్ల నిషిద్ధ మండలం మానవుడి నిర్లక్ష్యానికి, పొరపాట్లకు ప్రతీక అనే మాట నిజమే కానీ- అవి మానవుడి సంకల్ప బలానికి, పునరుజ్జీవన శక్తికి సైతం నిలువెత్తు నిదర్శనం. మానవ తప్పిదంతోపాటు మానవుడి ధీరోదాత్తతా చెర్నోబిల్‌లో మూర్తీభవించింది.
రచయిత - కేశవ