కరోనా కల్లోలాన్ని తేలిగ్గా తీసుకున్న దేశాధినేతలందరూ అందుకు భారీ మూల్యాన్నే చెల్లిస్తున్నారు. ఫిబ్రవరి మాసాంతంలోనూ కరోనాను ప్రత్యర్థుల బూటకంగా అపహాస్యం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందులో ఒకరు. 2000 సంవత్సరం తరవాత వరసగా సార్స్ (2003), స్వైన్ ఫ్లూ (2009), మెర్స్ (2012), ఎబోలా (2014), జికా (2015) మహమ్మారులు ప్రపంచాన్ని వణికించాయి. ఆ వరసలో కరోనాతో వచ్చే జబ్బు కొవిడ్- చైనాలో 2019 డిసెంబరులో మొదలైనప్పటి నుంచి అంతకంతకు విస్తరిస్తూ యావత్ ప్రపంచాన్ని చుట్టేసి, విశ్వవిపత్తుగా మారింది. వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ 2009లోనే విశ్వమహమ్మారుల ముంగిట మానవాళి నిలిచి ఉందని ప్రమాదఘంటిక మోగించింది. శాస్త్రవేత్తలు సైతం హెచ్చరికలు చేస్తూనే వచ్చారు. ‘
కారణం ఇదే..
ప్రపంచీకరణ, నగరీకరణ, ఫ్యాక్టరీ వ్యవసాయం నేపథ్యంలో కరోనా లాంటి వైరస్‌లు పుట్టుకొస్తాయి, వాటి ఉద్భవానికి బాధ్యత మొత్తం ప్రపంచానిదే’ అంటారు బ్రిటిష్ విజ్ఞాన శాస్త్ర పాత్రికేయురాలు లారా స్పిన్నీ. చైనాలోని ఉహాన్‌లో కొత్త కరోనా వైరస్ 2019 డిసెంబరులో బయట పడగానే రకరకాల వదంతులు ప్రబలాయి. అక్కడి ఓ ప్రయోగశాలలో జీవాయుధాల కోసం తయారు చేసిన వైరస్ భద్రతాలోపాల వల్ల బయటపడి అక్కడి ప్రజలకు సోకిందనే ప్రచారం సాగింది. అందులో నిజం లేదని, ఈ వైరస్ ప్రయోగశాలలో తయారైంది కాదని, జంతువుల నుంచి వచ్చిందేనని అధ్యయనాలు నిర్ధారించాయి.
ఉద్గారాలకు కారణం వారే..
ప్రపంచంలో 1940-2004 మధ్యకాలంలో వచ్చిన 335 కొత్త అంటురోగాలు ఎక్కడ పుట్టాయన్నది ఆయా ప్రాంతాల సామాజిక, ఆర్థిక, పర్యావరణ, జీవావరణ అంశాలతో ముడివడిఉన్న అంశమని పలు పరిశోధనలు స్పష్టీకరించాయి. 2009నాటి స్వైన్ ఫ్లూ అమెరికాలోని క్యాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాల్లో మొదలైంది. మెర్స్ మధ్యప్రాచ్యంలో, ఎబోలా కాంగోలో, ఎయిడ్స్ అమెరికాలో పరిణామం చెంది మొదట అక్కడి ప్రజలకు సోకాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో అవి మహమ్మారులుగా రూపుదాల్చాయి. డేవిస్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో 2009 నుంచి పదేళ్ల కాలంలో చేసిన పరీక్షల్లో 949 కొత్త వైరస్‌లు, 247 తెలిసిన వైరస్‌లను గుర్తించారు. విపణి, పెట్టుబడి, ఉత్పత్తి, ఆర్థిక విధానాలు కొత్త వైరస్‌లు ఉద్భవించేందుకు, వ్యాపించేందుకు అనువుగా ఉన్నాయి. ఫ్లూపై గత పాతికేళ్లుగా అధ్యయనం చేస్తున్న అమెరికా ప్రొఫెసర్ రాబ్ వాల్లెస్, వైరస్ ఎక్కడ పుట్టిందన్న విషయంకన్నా ఆ పుట్టుకకు కారణమైన పెట్టుబడి ఎక్కడిదో గుర్తించాలంటారు. ఆర్థిక భూగోళ శాస్త్రం (ఎకనామిక్ జాగ్రఫీ) ముఖ్యమంటారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ విద్వేషాలకు తావులేకుండా, కొత్త వైరస్‌లకు పేర్లు పెట్టే పద్ధతిలో, అవి ఉద్భవించిన ప్రాంతానికి, దేశానికి సంబంధం లేకుండా చేసింది. కరోనా వైరస్, భూతాపం రెండూ మానవాళికి పెద్ద విపత్తులే... విధ్వంసకాలే. ఈ రెండింటికీ మూల కారణాలు నయా ఉదారవాద ఆర్థిక విధానాల్లోనే ఉన్నాయంటున్నారు నోబెల్ పురస్కార గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ వంటి ఆర్థికవేత్తలు. భూతాప నివారణ కోసం కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఓ అంగీకారానికి రాలేని ప్రభుత్వాలు- కరోనా భయంతో మొత్తం రవాణాను, వ్యాపారాలను ఒక్కసారిగా మూసేశాయి. అసాధ్యమనుకున్న పరిణామాలను కరోనా సుసాధ్యం చేసింది. ప్రజల్లో అత్యధికులు భూతాపానికి కారకులు కాదు గనుక వారు తమ వ్యక్తిగత ఉద్గారాలను తగ్గించుకుని ప్రమాదాన్ని నివారించలేరు. పారిస్ సదస్సు సందర్భంగా ఆక్స్ ఫాం విడుదల చేసిన నివేదిక ఏ వర్గం ప్రజలు ఎంతమేర భూతాపానికి కారణమైన కర్బన ఉద్గారాలకు బాధ్యులో అంచనా వేసి చెప్పింది. అత్యంత సంపన్నుల్లో పది శాతం దాదాపు సగం ప్రపంచ ఉద్గారాలకు కారకులు. 50శాతం సాధారణ ప్రజలు 10శాతం ఉద్గారాలకు కారణమవుతున్నారు.
క్రమంగా తగ్గిస్తూ వెళ్లాలి..
పారిస్ ఒప్పందం సందర్భంగా ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 సెంటిగ్రేడ్‌కు పరిమితం చేయడానికి మిగిలిన కర్బన బడ్జెట్ ఎంత, ఆ స్థాయి పెరుగుదలవల్ల ఎదురయ్యే దుష్పరిణామాలు ఎలాంటివో అధ్యయనం చేయడానికి ఐక్యరాజ్య సమితి శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటు చేసింది. వారిచ్చిన నివేదిక ప్రకారం 1.5 సెంటీగ్రేడ్‌ను చావుకు బతుక్కి మధ్య ఎర్రగీతగా అభివర్ణించింది. 2050 కంటే ముందుగానే కర్బన ఉద్గారాలు సున్నాకు చేరాలి. 2020 డిసెంబరు నాటికి కర్బన విడుదలను తగ్గుముఖం పట్టించాలి. అప్పటి నుంచి ఏటా కనీసం 7.6 శాతం చొప్పున పదేళ్లపాటు 2030 వరకు కర్బన ఇంధన వాడకాన్ని తగ్గిస్తూ రావాలని, లేకుంటే లక్ష్యాన్ని చేరుకోలేమని యూఎన్‌ఈపీ తాజా నివేదిక వివరిస్తోంది.
మానసికంగా సన్నద్ధమవ్వాలి..
ప్రకృతిని ప్రాణదాతగా కాక ఒక వనరుగా మాత్రమే చూసే యాంత్రిక దృష్టి నుంచి విముక్తులం కానంతవరకు- విపత్తుల వరస దాడి తప్పదు. కరోనా విపత్తు మనకో ప్రకృతి హెచ్చరిక. విస్మరిస్తే అధోగతే. భూతాపం తెస్తున్న మార్పులు మున్ముందు కరోనా కంటే ప్రమాదకర మహమ్మారులను సృష్టించవచ్చు. భూతాప వేగం పెరిగింది. కరోనా విపత్తు నివృత్తికి తీసుకుంటున్న చొరవతోనే భూతాప నిరోధక చర్యలూ చేపట్టాలి. భూతాప విపత్తు తప్పించుకోవాలంటే పర్యావరణహితకరమైన నూతన వ్యవస్థను ఆహ్వానించగల మానసిక విప్లవం అవసరమంటారు కెనడాకు చెందిన రచయిత్రి నవోమి క్లెయిన్.
రచయిత: డాక్టర్ కలపాల బాబూరావు, పర్యావరణ రంగ నిపుణులు
ఇదీ చూడండి: ఫుడ్ డెలివరీ బాయ్‌కి 'కరోనా'.. వాళ్లందరికీ షాక్!