ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే వివిధ వర్గాల ప్రజలు ఎన్నికల్లో చురుగ్గా పాల్గొని తమ ప్రతినిధులను ఎన్నుకోవాలి. అప్పుడే ప్రజాసమస్యలకు మేలైన పరిష్కారాలు లభించి సమాజం పురోగతి సాధిస్తుంది. ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఓటింగ్ శాతమే పౌరుల భాగస్వామ్యానికి కొలమానం. ప్రజాస్వామ్య దేశాల్లో ఓటింగ్ శాతం తగ్గడం 1945నుంచి ప్రారంభమై 1980 మధ్యకాలానికి బాగా దిగజారింది. భారత్ విషయానికి వస్తే పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే గ్రామీణ, స్థానిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం అధికంగా ఉంటుందని; పట్టణ ప్రజలకంటే పల్లె ప్రజలు చురుగ్గా పాల్గొంటారని జాతీయ ఎన్నికల అధ్యయన సమాచారం తెలియజేస్తోంది. ప్రధానంగా మహానగరాల్లో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం అతి తక్కువగా నమోదు అవుతోంది. ఉదాహరణకు హైదరాబాద్ మహానగర కార్పొరేషన్‌కు గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో 42.04 (2009), 45.29 (2016)శాతం వరసగా నమోదు అయింది. చెన్నై, బెంగళూరు, ముంబయి, దిల్లీ మహానగర కార్పొరేషన్ ఎన్నికల్లోనూ గరిష్ఠంగా అరవై శాతానికి మించి ఓటింగ్ శాతం నమోదు కాలేదని వివిధ అధ్యయనాలు పేర్కొన్నాయి.
చిన్న, మధ్యతరహా పట్టణాలతో పోలిస్తే మహానగరాల్లో ఓటింగ్ శాతం అతి తక్కువ. సంస్థాగత, వ్యక్తిగత అంశాలు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి. ఓటర్ల జాబితా సవరణను సకాలంలో చేపట్టకపోవడం, జాబితాలో అవకతవకలు, రిజర్వేషన్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు మొదలైనవి సంస్థాగత కారణాలు. ఓటర్ల నిరాసక్తత, బాధ్యతారాహిత్యం, ఓటింగుపై అపోహలు, ‘నేను ఓటు వేయనంత మాత్రాన పెద్ద ప్రభావం ఉండదులే’ అనే ఉదాసీనత వంటివి వ్యక్తిగత కారణాలు. నగరాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉండటానికి సంస్థాగత కారణాల కంటే, వ్యక్తిగత కారణాలే ప్రధానం. ఈ పరిస్థితిని చక్కదిద్దినప్పుడే నగరాల్లో ప్రజస్వామ్యం వికసిస్తుంది.
నాగరికతకు చిహ్నం
ప్రజాస్వామ్యం ఒక సంక్లిష్ట భావన. పరిపక్వత కలిగిన పౌరులు, బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. వివిధ ప్రజాస్వామ్య దేశాల మధ్య ఓటింగ్ శాతంలో వ్యత్యాసాలున్నాయి. ఓటింగ్‌ను తప్పనిసరి చేసిన దేశాల్లో 93శాతం నమోదు అవుతుంటే, ఓటింగ్ ఐచ్ఛికంగా ఉన్న దేశాల్లో మందకొడిగా నమోదవుతోంది. అభివృద్ధి చెందిన స్విట్జర్లాండ్‌లో ఓటింగ్ కేవలం 56శాతం. శతాబ్దాల తరబడి ప్రజాస్వామ్య వ్యవస్థ విలసిల్లుతున్న అమెరికాలో కనిష్ఠ ఓటింగ్ అన్నది సాధారణమైన అంశం. ఇటీవల అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 120 సంవత్సరాల తరవాత 66.9శాతం పోలింగ్ నమోదైంది. ఒకే ఎన్నికలో ప్రాంతాలవారీగా ఓటింగ్ నమోదులో వ్యత్యాసాలు ఉంటాయి. స్థానిక పరిస్థితులు, సమస్యలు, వ్యక్తుల ప్రవర్తన ఓటింగ్ శాతంపై ప్రభావం చూపుతాయి. నగరాల్లో ఓటింగ్ శాతం తగ్గడానికి మరొక ముఖ్య కారణం ప్రపంచీకరణ ప్రభావం. సంక్షేమ భావనకు తిలోదకాలు ఇచ్చి ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల ద్వారా పౌర సేవలు అందించే కుహనా ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భవించడంతో ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య దూరం పెరిగింది. ప్రభుత్వాల ఏర్పాటు, ఎన్నికలు అనేవి కొన్ని వర్గాలకే పరిమితమైన క్రీడగా భావించి వాటిపట్ల వ్యతిరేకతను పెంచుకుంటున్నారు.
నాగరిక లక్షణంగా తక్కువ ఓటింగ్.!
నగరాలు నాగరికతకు, ప్రగతికి చిహ్నాలు. తక్కువ ఓటింగ్ శాతం నాగరిక లక్షణంగా మారుతున్నది. ఇది చాలా ప్రమాదకారం. పటిష్ఠమైన ప్రభుత్వం ఉన్నప్పుడే పౌరులు శాంతియుత నగర జీవనం పొందగలరు. అధిక శాతం పౌరుల భాగస్వామ్యంతో మాత్రమే నగరాల్లో పటిష్ఠ ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఎన్నికల సమయంలో ఎన్నిక సంఘం, కార్పొరేషన్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం, ఓటర్ల చైతన్య కార్యక్రమాలు చేపట్టడంలో మీడియాది ముఖ్య భూమిక. ఈ కార్యక్రమాల ప్రభావం ఓటింగ్ శాతం పెంచడంలో ఆశించిన ఫలితం ఇవ్వడంలేదు. చైతన్య కార్యక్రమాలతో పాటు ఎనభై శాతానికి మించి ఓటింగ్ చేసిన నివాస ప్రాంతాలకు, కాలనీలకు కార్పొరేషన్ కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించాలి.
స్ఫూర్తి చాటాలి..
బహుళ అంతస్తుల భవనాలు, వివిధ కాలనీల గేటెడ్ కమ్యూనిటీల నిర్వహణ కమిటీల సభ్యులతో నేరుగా లేక సామాజిక మాధ్యమాల ద్వారా సంప్రదింపులు జరిపి ఓటింగ్ అధికంగా జరిగేందుకు గట్టి చర్యలు చేపట్టేలా స్ఫూర్తి నింపాలి. హైదరాబాద్ నగరంలో 74లక్షల ఓటర్లే. వీరిలో 15లక్షలకు మించి యువ ఓటర్లే. అంతేకాకుండా దాదాపు ఆరు లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. ఈ వర్గాలు పెద్దయెత్తున ఓటింగ్‌లో పాల్గొనేలా చర్యలు చేపట్టాలి. ఐటీ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో సమావేశాలు నిర్వహించి వారి సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు విస్తృతంగా ఓటింగులో పాల్గొనే విధంగా ప్రేరేపించాలి. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు స్వయం సహాయ బృందాల సభ్యులను వినియోగించుకోవాలి. సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్‌బుక్ ద్వారా ఓటర్లను ప్రభావపరచాలి. పౌరుల బాధ్యతను వేరొకరు గుర్తుచేయాల్సి రావడం బాధాకరం. స్థానిక ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో బాధ్యతాయుత పౌరుడిగా పాలుపంచుకోవడం గర్వించదగిన అంశంగా భావించాలి. పార్లమెంటు, శాసనసభలకు జరిగే ఎన్నికల కంటే స్థానిక ఎన్నికలకు పౌరులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. నిత్య జీవితంతో దగ్గర సంబంధం కలిగినది స్థానిక ప్రభుత్వం. ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు, ఉద్యోగులు కుటుంబసమేతంగా పెద్దయెత్తున పాల్గొని ఓటింగ్ శాతం పెంచి ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటాలి!
- డాక్టర్ సిహెచ్.సి.ప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ
ఇదీ చదవండి: నేడు కశ్మీర్లో తొలి దఫా స్థానిక సమరం