వాయు కాలుష్యమంటే సాధారణంగా వాహనాల పొగ, పరిశ్రమల కాలుష్యం వంటి వాటినే ప్రస్తావిస్తుంటాం. గృహ వాయు కాలుష్యమూ భారత్‌లో పెద్ద సంఖ్యలో మరణాలకు కారణమవుతోంది! వాయు కాలుష్యం వల్ల దేశంలో 2017, 2019 సంవత్సరాల్లో సంభవించిన పావు శాతం మరణాలకు గృహాల నుంచి వెలువడిన ఉద్గారాలే కారణమని తాజా అధ్యయనం పేర్కొంది. దేశీయంగా 2019లో 25.7 శాతం సూక్ష్మధూళి కణాల (పీఎం 2.5)కు గృహాల్లో ఘన జీవఇంధన దహనమే కారణమని నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమైన ఆ అధ్యయనం వెల్లడించింది.
సూక్ష్మధూళి కణాల పరంగా గృహాల తరవాతి స్థానాల్లో పరిశ్రమలు (14.8శాతం), శక్తి (12.5శాతం), మానవ చర్యలు, దహనం, పారిశ్రామికధూళి-ఏఎఫ్‌సీఐడీ (11.5శాతం), వ్యవసాయం (9.4శాతం), రవాణా (6.7శాతం) ఉన్నట్లు తెలిపింది. పీఎం 2.5 వల్ల భారత్‌లో 2017లో 8,66,566 మరణాలు, 2019లో 9,53,857 మరణాలు చోటు చేసుకున్నాయని, ఘన జీవఇంధన దహనాన్ని నిరోధించి ఉంటే వీరిలో నాలుగింట ఒక వంతు ప్రాణాలు నిలబడేవని విశ్లేషించింది.
లాక్‌డౌన్‌లో అధికం..
వంట కోసం, ఇళ్లను వేడిగా ఉంచడానికి కట్టెలు, బొగ్గు, వ్యవసాయ వ్యర్థాలు, పిడకలు వంటి ఘన జీవ ఇంధనాన్ని శతాబ్దాలుగా భారత్‌లో ఉపయోగిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 65.9శాతం ఇళ్లలో ఘన జీవ ఇంధనాన్ని వాడుతున్నారు. దీని దహనం వల్ల నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ఓజోన్ (ఓ3), కార్బన్ మోనాక్సైడ్, అస్థిర సేంద్రియ సమ్మేళనాలు, సూక్ష్మ ధూళికణాలు వంటి వాయు కాలుష్యకారకాలు విడుదలవుతాయి. వీటివల్ల ఊపిరితిత్తులు, గుండె సంబంధ, శ్వాసకోశ వ్యాధులు, కళ్లు, గొంతు, ముక్కు సమస్యలు, అలర్జీలు, చర్మవ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. గృహ వాయు కాలుష్యం వల్ల 2019లో భారత్‌లో దాదాపు ఆరు లక్షల మంది మరణించినట్లు అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక గతంలో చెప్పింది. ఈ కాలుష్యం పెద్ద సంఖ్యలో మహిళల ఊపిరితిత్తులకు పొగబెడుతున్నట్లు వ్యాఖ్యానించింది. భారత్‌లో వాయు కాలుష్యం కారణంగా 2019లో పదిహేడు లక్షల అసువులు ఆవిరైపోయినట్లు లాన్సెట్ ప్లానిటరీ హెల్త్ జర్నల్ ప్రకటిస్తూ, గత రెండు దశాబ్దాల్లో (1990-2019) గృహ వాయు కాలుష్యం 64శాతానికన్నా తక్కువ మరణాలకు కారణమవుతుండటం కాస్తంత ఊరటనిచ్చే అంశంగా పేర్కొంది.
పథకంతోనూ మారని పరిస్థితి..
కట్టెల పొయ్యిలతో పేద మహిళల ఇబ్బందుల్ని నివారించేందుకు, గృహ వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం 2016లో ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దీని కింద ఈ ఏడాది జనవరి నాటికి ఎనిమిది కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో కోటి మందికి అందించాలని నిర్ణయించారు. అయితే, దేశంలో 77శాతం ప్రైమరీ లేదా సెకండరీ ఇంధనంగా ఘన జీవ ఇంధనాన్నే వాడుతున్నట్లు నేషనల్ శాంపిల్ సర్వే పేర్కొంటోంది. గ్యాస్ సిలిండర్లు ఉన్నా, నీళ్లు కాచుకోవడానికి నేటికీ గ్రామాల్లో చాలా మంది ఘన జీవ ఇందనాన్నే వాడుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం గ్రామాల్లో వంటకోసం 51శాతం ఘన జీవ ఇంధనాన్నే ప్రాథమికంగా వాడుతుండగా, పట్టణాల్లో అది తొమ్మిది శాతం. వీటివల్ల ఇంట్లోనే కాక బయటా వాయు కాలుష్యం పెరిగిపోతోంది. లాక్‌డౌన్‌లో సాధారణ రోజులతో పోలిస్తే రోజుకు రెండు శాతం లేదా 150 టన్నుల పీఎం2.5 ఉద్గారాలు గృహాల నుంచి అధికంగా విడుదలయినట్లు వరల్డ్ రిసోర్స్ ఇన్‌స్టిట్యూట్ (డబ్ల్యూఆర్‌ఐ) ప్రాథమిక పరిశీలనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కోట్ల గృహాల్లో ఘన జీవ ఇంధనాన్ని వాడుతుండగా, ఈ కాలుష్య కారకాలవల్ల ఏటా సుమారు 40 లక్షల ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది.
కేంద్రం దాటవేత
సాధారణంగా మనుషులు ఎక్కువ సమయాన్ని ఇంట్లోనే గడుపుతారు. చాలా ఇళ్లలో బయటి గాలి సరిగా లోనికి వెళ్ళే వీలూ ఉండదు. దీని వల్ల జీవ ఘన ఇంధన దహన అవశేషాలు గృహంలోనే పేరుకుపోయి, ఆ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పీఎం10, పీఎం2.5లను 2024 నాటికి 20 నుంచి 30శాతం మేర తగ్గించేందుకు కేంద్రం 2019 జనవరిలో జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమాన్ని (ఎన్‌సీఏపీ) ప్రారంభించింది. సరైన విధి విధానాలు లేకపోవడం వల్ల ఈ కార్యక్రమం నీరుగారిపోతోందని లీగల్ ఇనీషియేటివ్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (లైఫ్) అధ్యయనంలో తేలింది.
మరోవైపు దేశంలో వాయు కాలుష్యం కారణంగా మరణాలు సంభవించినట్లు నిశ్చిత సమాచారం లేదని కేంద్రం పార్లమెంట్‌లో తరచూ వల్లెవేస్తూ వస్తోంది. గ్యాస్ సిలిండర్ ధరలు ఇటీవల కాలంలో తరచూ పెరుగుతుండటం వల్లా గ్రామీణులు అధికంగా ఘన జీవ ఇంధనం వైపు మళ్ళే అవకాశం ఉందన్నది విజ్ఞుల మాట. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరల్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. గృహ వాయు కాలుష్యం గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి. అప్పుడే ప్రాణాలు పొగబారకుండా ఉంటాయి.
- దివ్యాన్షశ్రీ
ఇవీ చదవండి: