సేవల రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించగల ఒక నూతన ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో అభివృద్ధి చెందుతోంది. కొవిడ్ నేపథ్యంలో 'గిగ్' ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరించింది. కొత్త వృత్తుల సంఖ్య పెరిగేకొద్దీ పని సంస్కృతి మారుతోంది. పని స్వభావమూ పరిణతి చెందుతోంది. సంప్రదాయ ఉపాధి పరిస్థితులు మారి, తాత్కాలిక ప్రాతిపదికన సౌకర్యవంతమైన ఉద్యోగాల సృష్టి పెరిగింది. పూర్తి సమయం పని చేసే ఉద్యోగాలకన్నా, తాత్కాలిక అవసరాలకు అక్కరకొచ్చే ఉద్యోగాలకు ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. సంప్రదాయ విధానాలకు భిన్నమైన ఈ పద్ధతిని 'గిగ్' ఆర్థిక వ్యవస్థ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్ స్వరూప స్వభావాలను 'గిగ్' వ్యవస్థ శాశ్వతంగా మార్చేసింది. కార్యాలయాలకు దూరంగా ఉండి పని చేసే పద్ధతి (రిమోట్ వర్కింగ్) రూపొందడంతో అనేక కంపెనీలు, పరిశ్రమలు, నిపుణులు దీన్ని సానుకూల అంశంగా పరిగణిస్తున్నారు. వినియోగదారులకు ఆహార పదార్థాలు చేరవేసే జొమాటో, స్విగ్గీ బాయ్స్ వంటివారు నగరాలు, పట్టణాల్లో ఇప్పుడు దాదాపు అందరికీ తెలుసు. ఇలాంటివారిని స్వల్పకాలిక ప్రాతిపదికపై నియమిస్తారు. సేవల ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నవారు, ఫ్రీలాన్సర్లు, తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేవారు, కంపెనీలలో కంట్రాక్టుకు కుదిరినవారు, గృహ సేవలందించే ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, క్లీనర్లు, బ్యూటీషియన్లు; ఉబెర్, ఓలా డ్రైవర్లు; ఐటీ డిజైన్ వంటి రంగాల కన్సల్టెంట్లు, బ్లాగర్లు అందరూ ఈ కోవలోకే వస్తారు.
తాత్కాలిక ఉద్యోగాలు
రెండేళ్ల క్రితం (2018) ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులనుంచి 204 బిలియన్ డాలర్ల స్థూల విలువను 'గిగ్' ఆర్థిక వ్యవస్థ సృష్టించింది. ఇందులో 50శాతం రవాణా ఆధారిత రంగానిదే. 2023నాటికి 17శాతం పెరుగుదలతో ఈ వ్యవస్థ 455 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని అంచనా. 'గిగ్' శ్రామికుల సంఖ్యలో ప్రపంచంలో భారత్ అయిదో స్థానంలో ఉంది. దేశంలో ఐటీ, మానవ వనరులు, డిజైనింగ్ వంటి రంగాల్లో కోటిన్నర మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు. ఈ వ్యవస్థలో డిజిటల్ వేదికలకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. దళారీల ప్రమేయం లేకుండా ఉద్యోగాలు కల్పించే సంస్థలుగా ఇవి ఆవిర్భవించాయి. కొవిడ్ రాకతో కంపెనీల వ్యాపార సమూనాలు పూర్తిగా మారిపోవడం 'గిగ్' విస్తరణకు కారణం. సాధారణంగా భారతీయ కంపెనీలు పూర్తి స్థాయి ఉద్యోగాలకు ప్రాధాన్యమిస్తాయి. మహమ్మారి విరుచుకుపడటంతో కార్యాలయానికి రాకుండానే పనులు సవ్యంగా నిర్వహించే వ్యవస్థల అవసరం పెరిగింది. ఫలితంగానే అనేక కంపెనీలు మానవ వనరుల నిర్వహణ, వినియోగదారుల సేవలు, లావాదేవీల ప్రాసెసింగ్, మార్కెటింగ్, అమ్మకాలు, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, ఐటీ సేవలు, గ్రాఫిక్ డిజైన్, బిజినెస్ అనలిటిక్స్, డాటా సైన్స్ ప్రాసెసింగ్, డాటా విశ్లేషణ, పంపిణీ సేవలు వంటి రంగాలలో తాత్కాలిక ఉద్యోగులను నియమించుకొంటున్నాయి.
వ్యక్తుల అభిరుచి, ప్రాథమ్యాల ప్రకారం పని చేసే వెసులుబాటు, స్వేచ్ఛ ఈ వ్యవస్థలో ఉంటాయి. ఒక వ్యక్తి ఒకే సమయంలో వివిధ సంస్థలకు సేవలు అందించవచ్చు. అదనపు ఆదాయాన్నీ సముపార్జించవచ్చు. నైపుణ్యాన్ని బట్టి వేతనం డిమాండ్ చేయవచ్చు. నైపుణ్యం శ్రామిక శక్తి అందుబాటులో ఉండటం, వ్యయం తక్కువ కావడంతో వినియోగదారులు ఈ వ్యవస్థ వైపు మొగ్గు చూపుతున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన సేవలు అందించేవారిని నియమించుకోవడంవల్ల కంపెనీలకు పాలన నిర్వహణ వ్యయం తగ్గుతుంది. అయితే ఈ వ్యవస్థలో ఉద్యోగ భద్రత ఉండదు. ఆదాయమూ అనిశ్చితంగా ఉంటుంది. కానీ, ఇందులో లభ్యమయ్యే స్వల్ప వ్యయంతో కూడిన సేవలు వినియోగ అదనపు విలువను సృష్టిస్తాయి. ఆ అదనపు విలువను ఇతర రంగాలకు మళ్ళించడం ద్వారా మరిన్ని ఉద్యోగాలు సృష్టించవచ్చు.
నైపుణ్యాలే పెట్టుబడి
ఉపాధి అవకాశాలు అధికంగా కల్పించగల 'గిగ్' ఆర్థిక వ్యవస్థను మరింత అభివృద్ధి పరచడానికి ప్రభుత్వ పూనిక అవసరం. శ్రామికుల్లో నైపుణ్య పెంపుదలకూ చర్యలు తీసుకోవాలి. సమాచార ప్రసార సాంకేతికత, సైబర్ భద్రత, అంతర్జాల ఆధారిత పెట్టుబడులనూ ప్రోత్సహించాల్సి ఉంది. అద్దె అపార్ట్‌మెంట్ సేవలు, పేటియం వంటి డిజిటల్ వేదికలపై పన్నుల భారం తగ్గించాలి. సరళతర వాణిజ్య నిర్వహణకు మెరుగైన ప్రణాళికలు అమలు చేయాలి. 'గిగ్' శ్రామికుల హక్కుల రక్షణకు, వ్యవస్థ నియంత్రణకు చట్టాలు చేయాలి. భారత జనాభాలో 66.8 శాతం పని చేయగల వయసులోని వారున్నారు. నగరాల్లో డిజిటల్ వేదికలను విస్తృతంగా వినియోగిస్తుంటారు. కాబట్టి 'గిగ్' మార్కెట్ నగరాల్లోనే ఎక్కువ. దేశంలో 31శాతం జనాభా పట్టణ, నగర ప్రాంతాలలో నివసిస్తున్నారు. మూడున్నర కోట్ల పట్టణ జనాభా సేవా రంగంలో పని చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిటల్ సాంకేతిక వినియోగం పెరిగితే అది గ్రామీణ ఉపాధి వృద్ధికి దోహదం చేస్తుంది. స్థూల దేశీయోత్పత్తిలో సేవారంగ వాటా అత్యధికం. సేవా రంగ అభివృద్ధికి, 'గిగ్' ఆర్థిక వ్యవస్థ విస్తరణకూ అవినాభావ సంబంధం ఉంది. భారత్‌లో ఈ వ్యవస్థ విస్తరణ సేవా రంగంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించగలదు. నిరుద్యోగితనూ గణనీయంగా తగ్గించగలదు. కాబట్టి దీని విస్తృతికి, పటిష్ఠీకరణకు ప్రభుత్వం తగిన కార్యాచరణ ప్రణాళికలు, చట్టాలు రూపొందించవలసిన అవసరం ఉంది.
- పుల్లూరు సుధాకర్ (పట్టణాభివృద్ధి వ్యవహారాల నిపుణులు)
ఇదీ చూడండి: 'కేంద్రం, రాష్ట్రాల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా నివేదిక'