కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకోవడానికి గడచిన పది నెలలుగా మనమంతా ముసుగులు తొడుక్కుని మసలుతున్నాం. ఈ తరహా మనుగడ.. జీవితానికి అర్థమేమిటి, మన గమ్యాలేమిటనే ప్రశ్నలను లేవనెత్తింది. మనిషి సంఘజీవి. పరస్పర సంబంధాల్లోనే జీవితం వికసిస్తుంది కానీ, ఈ ఏడాదంతా మనం సాటివారికి దూరంగా, భయంభయంగా బతుకు వెళ్లబుచ్చాం. కొవిడ్‌వల్ల ఏర్పడిన ఒంటరితనంలో అంతర్ముఖులమయ్యాం. ఏదో ఒక పని చేస్తూ, ఎలాగోలా బతకడమే జీవిత పరమార్థమా అనే ప్రశ్న మనల్ని వెంటాడింది. మనం ఆపాదించుకున్న అజ్ఞాన ముసుగు తొలగి జీవితం నిండు సూర్యుడిలా ప్రకాశించింది. జీవిత సత్యాలను కనుక్కుని తదనుగుణంగా బతకాలని నూరిపోసింది.
ఆనందం ఎక్కడ ఉంది?
ఆనందంగా జీవించడమే జీవిత లక్ష్యమన్నారు దలైలామా. ముసుగుల మాటున ఇంటి నుంచి పనిచేయడంలోనే ఆనందం ఉందా, పని తప్ప జీవితానికి వేరే లక్ష్యం లేదా అనే ప్రశ్నలు మనల్ని నిలదీశాయి. ఒక్కో మనిషికి ఒక్కో అంశంలో ఆనందం లభిస్తుంది. అది మనిషి మనిషికీ వేరుగా ఉంటుంది. నేనేం చేస్తున్నాను, ఎక్కడికి వెళుతున్నాననే అంశాలపై మనిషికి స్పష్టత ఉండాలి. దాన్నుంచే జీవిత గమ్యమేమిటో బోధపడుతుంది. జీవితమంటే అనిశ్చితులు, సవాళ్లతో నిరంతరం పోరాటం. ఆర్థిక, సాంఘిక, శాస్త్ర సాంకేతికపరంగా ఎంతో పురోగతి సాధించిన తరవాత కూడా మనిషి ఈ ఏడాది అంతా కొవిడ్‌తో పోరాటంలోనే గడపక తప్పలేదు.
జీవితం ఎల్లప్పుడూ నల్లేరుపై నడకగా సాగదనే తత్వం ఈ కష్టకాలంలో మానవుడికి బోధపడింది. ప్రతిదాన్నీ తరచి తరచి ప్రశ్నించడమే తత్వసారమని, ఆ నిరంతర ప్రశ్నలు మానసిక సంభాషణ రూపం ధరిస్తాయని గ్రీకు మేధావి ప్లేటో ప్రాచీన కాలంలోనే బోధించారు. క్షణం తీరిక లేని ఆధునిక జీవితంలో ఈ తరహా ఆంతరిక సంభాషణకు తావు లేకుండా పోయింది. కానీ, కరోనా.. మనం ఎలా జీవిస్తున్నామో, ఎలా జీవించాలో ఆలోచించుకోవాలని స్పష్టం చేసింది. మన మనస్తత్వాన్ని మార్చుకోవాలని పాఠం నేర్పింది.
జీవితానికి అర్థమేమిటో గ్రహగతుల్లో కానీ, పవిత్ర గ్రంథాల్లో కానీ, జన్యుక్రమంలో కానీ కనుగొనలేం. జీవన్మరణాలు మన చేతుల్లో లేవు. కానీ, ఆ రెండింటి మధ్య పయనమే జీవితం. దాన్ని అర్థవంతంగా గడపడమెలా అన్నదే ప్రధానమైన సవాలు. చరాచర జగత్తులో తానే సర్వోన్నతుడినన్న మానవుడి అహంకారాన్ని కొవిడ్ పటాపంచలు చేసింది. విశ్వమంటే ఏకత్వం, ఇక్కడ ప్రతిదీ పరస్పర ఆశ్రితం. మహా వివేకవంతమైన సూత్రాల ఆధారంగా విశ్వం పనిచేస్తోంది. మనం విస్మరించిన ఈ పరమ సత్యాలను కొవిడ్ మహమ్మారి మళ్ళీ గుర్తుచేసింది.
ప్రకృతితో మానవుడి చెలగాటం ఇతర జీవులకు ప్రాణ సంకటంగా మారింది. అడవుల అదృశ్యంవల్ల పలు వ్యాధులు మానవులపై కోర సాచాయి. వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ మొదటిది కాదు. దీనికి ముందు పలు వైరస్‌లు విరుచుకుపడ్డాయి, మానవుల నిర్వాకాల వల్ల ఇకముందూ విరుచుకుపడుతూనే ఉంటాయి. మనం చేయవలసింది- ప్రకృతిని కాపాడటం కాదు, ప్రకృతితో సామరస్యంగా సహజీవనం చేయడం. ప్రకృతిలో మనమూ అంతర్భాగమనే సత్యాన్ని గుర్తించకపోవడమే అయోమయానికి కారణమవుతోంది. ఈ గందరగోళాన్ని తొలగించుకోవడమెలా అన్నది మానవుడి ముందున్న సవాలు.
కొవిడ్ తెచ్చిపెట్టిన ఏకాంతం
కొవిడ్ తెచ్చిపెట్టిన ఏకాంతం ఇంతవరకు సాగిన నా జీవిత యాత్రను సింహావలోకనం చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది. ఈ యాత్రలో ఎదురైన ఆటుపోట్లకు ఎలా స్పందించాను, వాటిని మరింత సమర్థంగా ఎదుర్కొని ఉండాల్సిందా అని అంతర్మథనం చేసుకున్నాను. నా జీవితం మరీ వేగంగా నడిచిపోయిందని, పనులు బాధ్యతల్లో అతిగా తలమునకలయ్యానని, అలా కాకుండా నా కుటుంబం కోసం మరికొంత సమయం కేటాయించి ఉంటే బాగుండేదని గ్రహించాను. పనికి, జీవితానికి మధ్య మరింత సమతూకం సాధించి ఉండాల్సిందని తెలుసుకున్నాను. జీవితానుభవాలు నాకెంతో నేర్పాయి. కాలంతోపాటు నేనూ ఎదిగాను, పరిణామం చెందాను.
అనేక సందర్భాల్లో సమస్యా పరిష్కారానికి, ఆనందం అందుకోవడానికి ఆధ్యాత్మికత తోడ్పడింది. సుదీర్ఘ రాజకీయ జీవితం అనంతరం సంఘసేవపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని, మార్పు సాధించడానికి సమర్థులను కలుపుకొని వెళ్లాలని నా మనసు ప్రబోధించింది. జీవితం ఒక్కసారే లభిస్తుంది. దాన్ని మనం సార్థకం చేసుకోవాలి. మన లోపల, వెలుపల ప్రశాంతతను కనుగొనడం ద్వారానే ఆనందమయ జీవితాన్ని గడపగలం. స్వార్థాన్ని వదలి ఆత్మానుభూతిని పొందడం సమాజ శ్రేయస్సుకు దారితీస్తుంది. కరోనా మహమ్మారి నేర్పిన పాఠం ఏమిటంటే- అన్నింటా మితం పాటించాలని. ప్రకృతితో, సమాజంతో, సాటి ప్రాణులతో సామరస్యంగా సహజీవనం చేయడం, సమత్వం పాటించడం ఆదర్శ జీవితమనిపించుకొంటుంది. గడచిన పది నెలల్లో మనం నేర్చిన పాఠాల ఆధారంగా జీవిత గమ్యాన్ని నిర్దేశించుకోవాలి. మానవాభ్యుదయానికి, ప్రకృతి సంరక్షణకు అంకితం కావడం ద్వారానే మన జీవితాలను సార్థకం చేసుకోగలుగుతాం. మనకున్నదాన్ని సాటివారితో పంచుకోవడం, ఇతరుల బాగోగులను పట్టించుకోవడం భారతీయ జీవన సారం. అది మన జాతి ప్రవృత్తిలోనే ఉంది. జరిగినదంతా మన మంచికే, జరుగుతున్నదీ మన మంచికే, జరగబోయేదీ మన మంచికేనని భగవద్గీత ప్రవచిస్తోంది. అంతులేని అనిశ్చితుల మధ్య స్థితప్రజ్ఞతను అందించే సూక్తి ఇది.
మానవ స్థైర్యానికి పరీక్ష
పాత కరోనా వైరస్‌ను నిభాయించడానికి మనమింకా ప్రయత్నిస్తుండగానే కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చి మన స్థైర్యాన్ని పరీక్షిస్తోంది. మనమంతా స్థిరచిత్తంతో నిలబడాల్సిన తరుణమిది. 2020 సంవత్సరం తీసుకొచ్చిన కరోనా బీభత్సాన్ని ఎదుర్కోవడంలో మనలోని సానుకూల పార్శ్వాలు కొన్ని బహిర్గతమయ్యాయి. సాధారణంగా ఒక వ్యాక్సిన్‌ను కనుగొనడానికి చాలా ఏళ్లు పడుతుంది. అలాంటిది కొవిడ్‌ను ఎదుర్కోవడానికి శాస్త్రవేత్తలు ఒక సంవత్సర కాలంలోనే టీకాలు తయారుచేయగలగడం నిజంగా అద్భుతం. కొన్ని దేశాల్లో ఇప్పటికే వ్యాక్సిన్లు వేయడం మొదలుపెట్టారు కూడా. ప్రపంచమంతటా టీకాలు వేయడమే ఇక తరువాయి. భారతదేశం కలిసికట్టుగా కరోనాపై పోరాడింది. ఈ సందర్భంగా మన జాతి ప్రదర్శించిన దృఢ సంకల్పాన్ని, దీక్షాదక్షతలను పార్లమెంటరీ సంఘం కొనియాడింది. భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని, మరణాల రేటును తగ్గించగలగడం మామూలు విజయం కాదు. వ్యక్తులుగా, సమష్టిగా గత పదినెలల అనుభవాల నుంచి సరైన పాఠాలు నేర్చుకోవడం ఎంతో అవసరం. వైరస్‌ను తుడిచిపెట్టడం ద్వారా బీభత్స నామ సంవత్సరాన్ని అద్భుత అవకాశాల సంవత్సరంగా మార్చుకోవాలి. తుది విజయం సాధించేవరకు నిరంతరం అప్రమత్తత పాటించాలి!
నడతను తీర్చిదిద్దే ఉన్నత లక్ష్యాలు
జీవితం పట్ల మన వైఖరి, దృక్పథం ఎలా ఉండాలనే అంశాల్లో మార్గదర్శకత్వం వహించేది తాత్విక చింతనే. కష్టనష్టాలను అధిగమిస్తూ ఆనందంగా జీవించాలంటే మనకంటూ ఒక తత్వధార ఉండాలి. దాన్ని చిత్తశుద్ధితో అనుసరించాలి. సక్రమ మార్గంలో జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి తత్వచింతన తగు సలహాలు ఇస్తుంది. ఎంతటి అల్లకల్లోలంలోనూ స్థిమితంగా ఆలోచించి ముందుకెళ్లే స్థైర్యాన్ని వివేకాన్ని అందించేదే తత్వచింతన అని రోమన్ తాత్వికుడు సెనెకా ఉల్లేఖించారు. ఆయన రచించిన ‘మోరల్ లెటర్స్’లో ఇలాంటి అమూల్య రత్నాలు ఎన్నో ఉన్నాయి. జీవితానికి ఉన్నత లక్ష్యం ఉంటే అది మన ఎంపికలను ప్రభావితం చేస్తుంది. మన నడతను తీర్చిదిద్దుతుంది. ఈ ఎంపికలు, ప్రవర్తనలు సరైనవైనప్పుడు జీవితానందం సిద్ధిస్తుంది.
- ముప్పవరపు వెంకయ్యనాయుడు, భారత ఉపరాష్ట్రపతి