మనకి నచ్చిన డ్రస్ వేసుకోవడం ఎంత ముఖ్యమో మనకి నప్పే డ్రస్ వేసుకోవడమూ అంతే ముఖ్యం. ఫ్యాషన్ విషయంలో అమ్మ అవుట్ డేటెడ్ అని చాలామంది అమ్మాయిలు అనుకుంటారు. కానీ మన శరీరాకృతికి, చర్మం రంగుకి ఎటువంటి బట్టలు నప్పుతాయో అమ్మకి బాగా తెలుసు. తన బంగారు తల్లిని అందంగా అలంకరించడం అమ్మకు కొత్తగా నేర్పాలా...? కాబట్టి ఈసారి ఏదైనా పార్టీకో, ఫంక్షన్‌కో వెళ్ళాల్సొస్తే మరో ఆలోచన లేకుండా ‘అమ్మా ఏం వేసుకోమంటావ్?’ అని అడిగేయండి.
అది అమ్మకే బాగా తెలుసు..!
వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. కొన్ని ఆశ్చర్యపరిస్తే, కొన్ని ఆందోళనకు గురిచేస్తాయి. ఈ క్రమంలో వాటికి గూగుల్‌లో పరిష్కారం వెతకకుండా, అమ్మతో చెప్పి తన సలహా పాటించడం మంచిది. ఎందుకంటే మన శరీరతత్వం, వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు, ఎదుగుతున్న కొద్దీ శరీరంలో వచ్చే మార్పులు.. వీటన్నింటి గురించి గూగుల్ కన్నా అమ్మకే బాగా తెలుసు. కాబట్టి ఆ మార్పులు, వాటి వెనకున్న కారణాల గురించి కూడా అమ్మనే అడిగి తెలుసుకోవాలి.
నాకు సరిపోతాడా ..!
అర్థం చేసుకోడంలో అమ్మ తర్వాతే ఎవరైనా. మీరు జీవిత భాగస్వామిగా ఎన్నుకునే వ్యక్తి గురించి ముందు మీ అమ్మకే చెప్పండి. ఏ వయసులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మనకన్నా అమ్మకే బాగా తెలుసు. అంతేకాదు మీ వ్యక్తిత్వానికి అతను సరిపోతాడో లేదో అన్న విషయం తెలుసుకోవడానికి అమ్మ సలహా ఎంతో ఉపయోగపడుతుంది. అతనిని మీ అమ్మకు పరిచయం చేయడం వల్ల మీ పట్ల మరింత బాధ్యతగా వ్యవహరిస్తాడు. ఒకవేళ ఏదైనా దురుద్దేశంతో మిమ్మల్ని ప్రేమలోకి దించిన వాళ్ళైతే మీనుంచి దూరంగా వెళ్తారు. కాబట్టి మీ జీవిత భాగస్వామి గురించి నిర్ణయం తీసుకునే సమయంలో అమ్మ సలహా తీసుకోడానికి ఏమాత్రం సంకోచించకండి.
మనసులోని మర్మమేంటో..?!
కార్పొరేట్ ప్రపంచంలో ఏ మాటల వెనుక ఏ మర్మం ఉందో, ఎవరు ఏ ఉద్దేశంతో ప్రశంసిస్తున్నారో, ఎవరెందుకు విమర్శిస్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టం. ఎవరితో ఎలాంటి విషయాలు పంచుకోవాలో అర్థం కాక ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం. మీరు పని చేసే చోట మీకు ఎదురయ్యే వ్యక్తుల గురించి మీ అమ్మతో మాట్లాడి చూడండి. ఎవరితో ఎలా మెలగాలో చెప్పడంలో అమ్మ కార్పొరేట్ గురువులకే పాఠాలు చెప్పగలదని మీరే అంటారు.
ఆపదల్ని దాచద్దు!
చదువుకునే చోట, ఆఫీసులో, ఆన్‌లైన్‌లో ఎక్కడైనా ఎవరైనా మిమ్మల్ని లైంగికంగా వేధిస్తే ఆ విషయాన్ని అమ్మ దగ్గర దాచకండి. చాలామంది అమ్మాయిలు ఈ లైంగిక వేధింపుల గురించి ఇంట్లో చెబితే చదువు మాన్పిస్తారనో, బయటికి వెళ్ళనివ్వరనో భయపడి తమలో తామే కుమిలిపోతారు. మారిన పరిస్థితుల దృష్ట్యా ఆ అపోహలను వదిలి ధైర్యంగా అటువంటి విషయాలను బయట పెట్టండి. అప్పుడు ఏం చేయాలో అమ్మే చెబుతుంది. ఒకవేళ అలాంటి పరిస్థితులలో ఏం చేయాలో చెప్పేంత లోకజ్ఞానం లేకపోయినా, అలాంటి సందర్భాలలో అమ్మ ఇచ్చే మద్దతుతో మనమే ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ప్రశాంతంగా ఆలోచించే అవకాశం ఉంటుంది.
రక్షణ కవచంలా..
వద్దన్న రూట్‌లో బండి నడిపి దెబ్బలు తగిలించుకున్నా, పార్టీ నుంచి ఆలస్యంగా వచ్చినా, అతిగా నమ్మిన స్నేహితులు మోసం చేసినా.... ఇలా శరీరానికో, మనసుకో ఎలాంటి గాయమైనా సరే అమ్మ మనల్ని దగ్గరకు తీసుకుని, ఓదార్చి తన మ్యాజిక్ టచ్‌తో ఇట్టే నయం చేస్తుంది. ముందే చెబితే మన ప్రాణానికి తన ప్రాణం అడ్డేసి మరీ రక్షిస్తుంది.
కరుణించే కోపం అమ్మ..
మనకన్నా ముందే ప్రపంచాన్ని, జీవితాన్ని చూసిన అనుభవం అమ్మ సొంతం. ప్రస్తుతం మనం ఎదుర్కొనే సమస్యలన్నీ తాను ఇదివరకే ఎదుర్కొని.. వాటి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకొని ఉండచ్చు. అందుకే అమ్మకు అన్ని విషయాలూ తెలుసు. మనకేదైనా ఆపద కలుగుతుందేమోనన్న భయంతో కోప్పడ్డా, మన ప్రతి కష్టంలోనూ తోడుండే అసలైన నేస్తం అమ్మే..! అందుకే ఇకనుంచి మన సంతోషాన్ని మాత్రమే కాదు తెలిసో-తెలియకో చేసిన పొరపాట్లను, సమస్యలను కూడా అమ్మతో పంచుకుందాం..!
ఆ సమస్యల గురించి..
అలాగే పెళ్లయ్యాక దాంపత్య బంధంలో, ప్రత్యేకించి లైంగిక విషయాలలో ఎలాంటి సమస్యలు, సందేహాలున్నా వాటి గురించి ముందు అమ్మతోనే పంచుకోవాలి. తన అనుభవాలను జోడించి మానసిక పరిణతితో తనిచ్చే సూచనలు, సలహాలు మన సమస్యలను ఇట్టే పరిష్కరించేస్తాయ్..! అప్పటికీ మన సమస్యలు సద్దుమణగకపోతే నిపుణులను సంప్రదించాలన్న విషయం ఎలాగూ మనకు తెలిసిందే.
ఇదీ చూడండి: నీ అనురాగానికి వెలలేదు .... నీ ప్రేమకు హద్దులేదు..!