భార్యభర్తలు సమానంగా జీవితాన్ని పంచుకోవాల్సిందే. ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ జీవితాన్ని మరపురాని మజిలీగా మలుచుకోవాల్సిందే. ఆలుమగల మధ్య సాధారణంగా వచ్చే చిన్నచిన్న గొడవలు, కలతలు సహజమే. అయినప్పటికీ అన్నింటినీ అధిగమించి ముందుకెళ్లినప్పుడే ఆ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఎలాంటి వారైనా సర్దుబాటు చేసుకోవాలన్నా.. సంతోషంగా జీవించాలన్న ఏ విషయమైనా సున్నితంగా చెప్పగలిగితే చాలు. వారిద్దరి అనుబంధానికి ఆ ఒక్క మాటే అత్యంత కీలకంగా మారుతుంది.
భాగస్వామితో ఇలా వ్యవహరిస్తే ఏ గొడవలు రావు
ఎంత సేపూ గొడవలేనా! భాగస్వామిలో నచ్చే విషయం కనిపించినప్పుడు వెంటనే చెప్పండి. అప్పటివరకూ పడ్డ శ్రమ అంతా మరిచిపోతారు. మరింత ఉత్సాహంగా తమ బాధ్యతల్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తారు.
* ప్రతి పనీ మీ సమక్షంలోనే జరగాలనీ, మీకు తెలిసే చేయాలనీ పట్టుపట్టొద్దు. ఎదుటివారిపై నమ్మకం ఉంచి అవకాశం ఇవ్వండి. నీ మీద నమ్మకం ఉంది...దాన్ని పోగొట్టుకోవద్దని నెమ్మదిగానే, స్పష్టంగా చెప్పండి. అది వారి కర్తవ్యాన్ని నిరంతరం గుర్తు చేస్తుంది. అనుకున్న పనులు సమర్థంగా నిర్వహించగలుగుతారు కూడా. అప్పుడు మీ మధ్య ఏ విషయాల్లోనూ తగాదాలు రావు.
* సమస్య ఏదైనా ఒక్కసారి మాట వదిలేస్తే...తర్వాత తప్పు సరిదిద్దుకున్నా ఫలితం ఉండదు. వాదన వచ్చినప్పుడు వీలైనంతవరకూ మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. లేదా కాసేపాగి మాట్లాడకుందాం అని చెప్పండి. అప్పుడు కోపం తాలూకు ప్రభావం కాస్తైనా తగ్గి పరుష పదాలు జారకుండా ఉంటాయి. సున్నితంగానే మీ ఇబ్బందిని పరిష్కరించుకోగలరు.