తను మొదట్నుంచి అతనితో ఖచ్చితంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదేమో. అతని అసభ్య ప్రవర్తనకు ఆమె మొదటే అడ్డుకట్ట వేయకపోవడంతో ఎలాంటి భయం లేకుండా ఇబ్బంది పెడుతున్నాడనిపిస్తోంది. అయితే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. తన మనసులో ఉన్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పాలి. ఇప్పటి నుంచైనా అతనితో కఠినంగా వ్యవహరించాలి. తన పరిధి దాటి అతనితో ప్రవర్తించలేదు కాబట్టి, కేవలం అతనితో చాట్ చేసినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఆఫీసులోనైనా సహోద్యోగులతో చాట్ చేయడం సాధారణంగా జరిగే ప్రక్రియ అనేది అర్థం చేసుకోవాలి. అతని అసభ్య ప్రవర్తన గురించి తోటి ఉద్యోగులకు తెలిసే విధంగా సూచనలివ్వాలి. అతను ఒంటరిగా రమ్మన్నప్పుడు అతనికి దూరంగా ఉంటూ స్నేహితులతో గడిపేలా చూసుకోవాలి. తన మనసులో ఎలాంటి దురుద్దేశం లేనప్పుడు అతను ఏదైనా అంటే దానికి ఆమె బాధ్యురాలు కాదన్న విషయాన్ని తెలుసుకోవాలి.
మిగతా వారితోనూ అలానే చేస్తున్నాడా..?
వర్తమాన పరిస్థితుల్లో ఇలాంటి సమస్యలకు ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి. కాబట్టి తన సమస్యను ఉన్నత అధికారులు, మానవ వనరుల విభాగం వారికి మొదట సూచనప్రాయంగా తెలిపే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత తగిన సాక్ష్యాధారాలతో ఏవిధంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడో వివరించాలి. ఒకరితో అసభ్యంగా ప్రవర్తిస్తోన్న వ్యక్తి మిగతావారితోనూ అసభ్యంగా ప్రవర్తించరన్న గ్యారంటీ లేదు. కాబట్టి, బయటకు చెప్పకుండా ఇబ్బంది పడుతోన్నవారు ఎవరైనా ఉన్నారేమో చూడాలి. ఒక సమస్యను కలిసికట్టుగా చెప్పినప్పుడు ఫలితం తొందరగా వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి, అలా ఎవరైనా కనిపించినప్పుడు వారితో కలిసి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అలాగే భర్తకి ఉద్యోగ జీవితంలో ఇతర ఉద్యోగులతో మాట్లాడడం సాధారణమేనన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేయాలి. అలాగే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కొన్ని పరిధులు గీసుకోవాలి.