భార్యాభర్తలన్నాక తగువులు, చిన్నపాటి గొడవలు సాధారణం. అయితే అంత మాత్రన భాగస్వామి గురించి మీ కుటుంబ సభ్యులు, బంధువుల దగ్గర తక్కువ చేసి మాట్లాడొద్దు. తనతో మీకేదైనా సమస్య ఉంటే నేరుగా చెప్పాలే తప్ప ఇతరుల దగ్గర వారి గురించి తప్పుగా మాట్లాడొద్దు.
* ఆఫీసు, ఇతర సమస్యల వల్ల ఎదుటివారు తీరిక లేకుండా ఉన్నప్పుడు, అలాగే పని ఒత్తిడికి గురైనప్పుడు మీరే తనకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. అలాంటి సమయంలోనే ‘నేనున్నానంటూ’ భరోసా ఇస్తే వారి నిస్తేజం దూరంగా పారిపోతుంది.
* మీ ప్రేమను మాటలతోపాటు చేతల్లోనూ వ్యక్తం చేయండి. అలసిపోయి వచ్చిన తనకు మీ ప్రేమ రంగరించి వేడి వేడి కాఫీ అందించండి. ఆఫీసు/వ్యాపార విషయాల్లో తనకు మీ సాయమేమైనా కావాలంటే అందించడానికి సిద్ధంగా ఉండండి.
* మీరు తననుంచి ఏం ఆశిస్తున్నారో నేరుగా చెప్పండి. దాన్ని ఆచరణలో పెట్టడానికి కాస్తంత సమయం ఇవ్వండి. అంతే తప్ప అదేపనిగా మాటల పోటీకి దిగొద్దు. అప్పుడే తనకు మీపై గౌరవం పెరుగుతుంది.
* ఇతరులతో మీ భాగస్వామిని పోల్చొద్దు. దానివల్ల మీరు తనతో సంతోషంగా ఉండటం లేదని పొరపాటు పడే అవకాశం ఉంది. అందులోనుండే తనకు మీరు గౌరవం ఇవ్వట్లేదనే అభద్రత కూడా మొదలయ్యే ప్రమాదం ఉంది.
ఇదీ చూడండి: నోరూరించే చికెన్ ఆమ్లెట్ తిన్నారా..!