ఉద్యోగాలు, పిల్లల చదువులు, ఇతరత్రా కారణాల వల్ల భార్యాభర్తలు వేరే ఊళ్లలో ఉండాల్సి వస్తోంది. ఇలాంటప్పుడు వారు ఒంటరిగా ఉన్నామనే భావనతో మానసికంగా ఇబ్బంది పడతారు. మరి భారంగా.. మారిన ఈ దూరాన్ని దగ్గరగా భావించేందుకు ఈ ఉపాయాలు ప్రయత్నించండి..
ఆఫీసుకు వెళ్లే ముందూ... వచ్చిన తర్వాతా వీడియోకాల్ చేసి మాట్లాడుకుంటే... భాగస్వామి పక్కనే ఉన్న భావన కలుగుతుంది. ఈ మాటల్లో... ఆరోజు జరిగిన విశేషాలను గురించి చెప్పొచ్చు. లేదా మీరు చేస్తున్న, చేయబోయే పనుల గురించి మాట్లాడొచ్చు. అవసరమైన సలహాలనూ తీసుకోవచ్చు. ఇవన్నీ దూరంగా ఉన్నామనే ఆలోచనని రానివ్వవు.
ఎంత మాట్లాడినా ఇంకా ఏదో మిగిలిపోయినట్టుగా వెలితిగానే ఉంటే మీ మనసులోని భావాలను అక్షరాల్లో పొందుపరచి మెయిల్ పంపండి. అలానే నెలకో, రెండు నెలలకో.. ఎప్పుడు కలసినా చికాకులకు చోటివ్వవద్దు. ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుచుకోండి. ఆ మధురమైన అనుభూతులు మళ్లీ కలిసేంతవరకు మిమ్మల్ని ఆనందంగా ఉంచుతాయి.