చిన్నారుల ఇష్టాయిష్టాల మీద వారి కస్టడీ ఆధారపడి ఉంటుంది. వాళ్లకి ఇష్టం లేకుండా బలవంతంగా తీసుకెళ్లడానికి వీలు లేదని చట్టం చెబుతోంది. పిల్లల్ని తనకు అప్పగించమని కోరుతూ మీ భర్త విడాకుల కేసుతో పాటే దరఖాస్తు చేసుకోవాల్సింది. లేదా హిందూ మైనార్టీ అండ్ గార్డియన్‌షిప్ యాక్ట్ సెక్షన్ 8(1)కింద కూడా పిటిషన్ వేసి ప్రయత్నించాల్సింది. అవేవీ లేకుండా బలవంతంగా వారిని తన వెంట తీసుకువెళ్లడానికి వీల్లేదు. వాస్తవానికి చట్టప్రకారం తల్లిదండ్రులిద్దరూ సహజ సంరక్షకులే. కాబట్టి హిందూ వివాహచట్టంలోని సెక్షన్-26 ప్రకారం ఇరువురికీ విడాకుల కేసుతో పాటు బిడ్డల కస్టడీ అడిగే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం మీరు... మీ భర్త మీ అమ్మాయిల్ని తీసుకువెళ్లిన విషయం చెబుతూ...వారిని మీకు అప్పగించమని గార్డియన్ అండ్ వార్డ్స్ యాక్ట్-25(1) ప్రకారం కోర్టుని కోరవచ్చు. అయితే ఎవరు వాళ్ల బాధ్యతను చూడాలన్నది మాత్రం న్యాయస్థానమే నిర్ణయిస్తుంది. అయితే వీటన్నింటికంటే ముందు మీరు పిల్లల్ని బలవంతంగా అతడు తీసుకెళ్లాడని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కానీ విమెన్ ప్రొటెక్షన్ సెల్‌లో గానీ ఫిర్యాదు చేయండి. వాళ్లు పిలిపించి మాట్లాడతారు. చిన్నారుల క్షేమం, వారి ఇష్టాయిష్టాల ఆధారంగా ఎవరి దగ్గర ఉంటే మంచిదో సూచిస్తారు. అయితే అది తాత్కాలికమే. శాశ్వత పరిష్కారాన్ని కోర్టు ద్వారానే తేల్చుకోవాల్సి ఉంటుంది. వెంటనే ఓ లాయర్‌ని కలవండి. ప్రయత్నిస్తే... మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇదీ చూడండి: లైఫ్ పార్ట్నర్కి ఇలా సున్నితంగా చెప్పండి...