ఈరోజుల్లో పెళ్లి, నిశ్చితార్థం.. ఇలా వేడుక ఏదైనా సరే.. వీలైనంత వైభవంగా జరిపించడానికే చాలామంది మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే ఖరీదైన ఉంగరాలను సైతం భాగస్వామికి బహుమతిగా ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే నిశ్చితార్థ వేడుకలో తొడిగే ఉంగరం ద్వారా కూడా వారు భాగస్వామికి తమ మనసులోని మాటను తెలియజేయవచ్చట! అందుకు తగిన రంగు లేదా ఆకృతిలో పొదిగిన రాళ్లు ఉన్న ఉంగరాన్ని ఎంచుకుంటే చాలంటున్నారు నిపుణులు. అర్థం కాలేదా?? అదేనండీ.. నిశ్చితార్థపు ఉంగరంలో ఉపయోగించే రాళ్ల ఆకృతి లేదా రంగుని బట్టి కూడా భాగస్వామికి మన మనసులో మాట తెలియజేయచ్చు. ఇంతకీ వాటిలో ఎన్ని రకాల ఆకృతులు ఉన్నాయి? ఏ రంగు రాయికి ఏ అర్థం ఉంటుంది?? చూద్దామా..
రాయి ఆకృతి ప్రకారం..
వజ్రాలంటే ఇష్టపడని అమ్మాయి ఉంటుందా చెప్పండి? ఆడపిల్లలకు, వజ్రాలకు ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది మరి! అందుకే వజ్రంలాంటి అమ్మాయిల మనసు గెలుచుకునేందుకు చాలామంది నిశ్చితార్థపు ఉంగరంలో చిన్న వజ్రం అయినా ఉండేలా చూసుకుంటున్నారు. ఒకవేళ వజ్రం కాకపోయినా చక్కని రంగు రాళ్లు పొదిగిన ఉంగరాన్ని ఎంచుకుంటున్నారు. అయితే ఈ వజ్రం లేదా ఇతర రాళ్ల ఆకృతి బట్టి వాటికి కూడా రకరకాల అర్థాలు ఉంటాయి.
గుండ్రని ఆకృతి
సింపుల్‌గా ఉంటూనే క్లాసీగా కనిపించే ఉంగరాల్లో ఇదీ ఒకటి. రౌండ్ కట్ ఉన్న స్టోన్ లేదా వజ్రం ఉన్న ఉంగరం పెట్టడం ద్వారా 'నీ స్త్టెల్ ఎప్పుడూ ఎవర్‌గ్రీన్‌గా ఉంటుంది.. కాలం మారినా నీపై నాకున్న ప్రేమ మారదు.. ఎప్పటికీ అది శాశ్వతం..' అని చెప్పకనే చెబుతున్నట్లట!
అండాకృతి
సంప్రదాయబద్ధంగా కనిపించాలనుకునే మహిళలకు ఇది చక్కని ఎంపిక. ముఖ్యంగా చేతులు చిన్నవిగా ఉండి, చేతివేళ్లు కాస్త కురచగా ఉన్నవారికి ఈ తరహా ఉంగరం బాగా నప్పుతుంది. మీ భాగస్వామి ఈ ఉంగరం తొడిగారంటే దాని అర్థం.. 'కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ గురించి అందరికంటే ముందుగా తెలుసుకొని అనుసరించడంలో మీరు పర్ఫెక్ట్ అని..'
పియర్ ఆకృతి
ఈ ఆకృతిలో ఉన్న రాళ్లు లేదా వజ్రాన్ని పొదిగిన ఉంగరాన్ని చాలా తక్కువమంది ఉపయోగిస్తారు. నిశ్చితార్థ వేడుకలో మీ భాగస్వామి ఈ ఉంగరం మీకు తొడిగారంటే దానర్థం.. 'మీరు కేవలం మీ మనసు చెప్పింది మాత్రమే వింటారు.. చేస్తారు.. ఇతరుల మాటలు మిమ్మల్ని లేదా మీ మనసును ఏమాత్రం ప్రభావితం చేయలేవు..'
హృదయాకృతి
ప్రేమకు చిహ్నం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది హృదయాకృతి. ఈ ఆకృతిలో ఉన్న స్టోన్ లేదా వజ్రాన్ని పొదిగిన ఉంగరం అంటే మహిళలందరికీ ఇష్టమే! ప్రతి చిన్న విషయాన్నీ ఎమోషనల్‌గా ఫీలయ్యే స్వభావం ఉన్న వారికి ఈ ఉంగరం ఎక్కువగా నప్పుతుందట! అంతేకాదు.. నిశ్చితార్థ వేడుకలో ఈ ఉంగరం మీ వేలికి తొడిగారంటే దానర్థం.. మీకు చక్కని ఆలోచనా సామర్థ్యం, నిశిత పరిశీలన ఉన్నట్లే!
ఇవే కాదు.. ప్రిన్సెస్ కట్, కుషన్ కట్, ఎమరాల్డ్ కట్, రేడియంట్ కట్.. ఇలా విభిన్న ఆకృతుల్లో పొదిగిన స్టోన్ లేదా వజ్రాలను సైతం ఎంగేజ్‌మెంట్ ఉంగరాల్లో ఉపయోగిస్తారు. నలుగురిలోనూ ప్రత్యేకంగా కనిపించేవారు, తమదైన వ్యక్తిత్వంతో ముందడుగు వేసేవారు.. ఇలా వధువు స్వభావం బట్టి ఆయా ఆకృతుల్లోని రాళ్లు లేదా వజ్రాలు పొదిగిన ఉంగరాలను తొడుగుతారు.
రంగు బట్టి..
నిశ్చితార్థపు ఉంగరంలో ఉపయోగించిన రాళ్లు లేదా వజ్రం ఆకృతి మాత్రమే కాదు.. వాటి రంగు ప్రకారం కూడా భాగస్వామి చేసే ప్రమాణం గురించి ఒక ప్రాథమిక అంచనా వేయచ్చు. ఎలా అంటారా??
డీప్ వైన్ రెడ్
ఈ రంగు ప్రశాంతతకు చిహ్నం. అంతేకాదు.. ఈ ఉంగరం పెట్టుకోవడం ద్వారా 'నిన్నెప్పుడు ప్రేమిస్తూనే ఉంటా.. సదా నిన్ను కాపాడుకుంటా..' అంటూ భాగస్వాములిద్దరూ ఒకరికొకరు ప్రమాణం చేసుకున్నట్లేనట!
ఆక్వా మెరైన్
చక్కని కమ్యూనికేషన్, ధైర్యానికి ఈ రంగు ప్రతీక. ఈ కలర్ స్టోన్ ఉన్న ఉంగరం పెట్టడం ద్వారా 'నీపై నాకున్న ప్రేమను రోజూ వ్యక్తపరుస్తూనే ఉంటా.. అది మాటల రూపంలో కావచ్చు.. చేతల రూపంలో కావచ్చు.. నీ పట్ల నాకున్న ప్రేమ వర్ణనాతీతం..' అని చెప్పినట్లే!
నీలిరంగు
ఈ రంగు రాచరికానికి ప్రతీక. ఈ కలర్ స్టోన్ పొదిగిన ఉంగరం పెట్టడం ద్వారా భాగస్వాములిరువురూ వైవాహిక జీవితంలో ఒకరి పట్ల మరొకరు నీతి, నిజాయతీలతో వ్యవహరిస్తామని ప్రమాణం చేసినట్లే!
ఎమరాల్డ్
ఆనందకరమైన వైవాహిక జీవితానికి సంకేతం.
గోల్డెన్ బ్రౌన్
భార్యాభర్తలిద్దరూ కలసి సంతోషంగా జీవిస్తామనే ప్రమాణానికి కట్టుబడి ఉంటామని ఒకరికొకరు బాస చేసుకున్నట్లు. అంతేకాదు.. ఇద్దరూ కలిసి సంతోషంగా సమయం గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తారు. అందుకు వీలు కల్పించే ఏ ఒక్క అవకాశాన్నీ వారు వదులుకోరు.
మూన్‌స్టోన్ (తెలుపు రంగు)
ఈ స్టోన్ మొదట చూడడానికి తెల్లగా కనిపించినా కాస్త అటు ఇటూ తరచి చూస్తే అక్కడక్కడా నీలి రంగు చారల్లా కనిపిస్తూ ఉంటాయి. అంటే జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినా నిన్ను కడదాకా ప్రేమిస్తూనే ఉంటా.. అని అర్థమట!
ఇలా ఉంగరంలో ఉన్న స్టోన్ కలర్ బట్టి కూడా భాగస్వామి మనలో గుర్తించిన లక్షణాలు, వైవాహిక జీవితం గురించి చేసే ప్రమాణాల గురించి ఒక అంచనా వేయచ్చంటున్నారు నిపుణులు.