ఎన్ని లేపనాలు రాసినా నవ్య మొహం మచ్చలతోనే కనిపిస్తుంది. ఎందుకలా జరుగుతోందో తెలియక, నలుగురిలోకి వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్న తన లాంటివాళ్లకి సౌందర్య నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. చర్మ సౌందర్యాన్ని రక్షించుకోవాలంటే పైపై పూతలు రాస్తూ, ఆహారం విషయంలో అశ్రద్ధ వహిస్తే ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు. కొన్ని అలవాట్లను మానుకోవాలంటున్నారు.
- అతిగా... కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని మితంగా తీసుకుంటే మంచిది. పాల ఉత్పత్తులను అతిగా తినకూడదు. ఆకుపచ్చని కూరగాయలను తీసుకోవాలి. వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే చక్కెర, జంక్ ఫుడ్స్, చిప్స్, ఐస్‌క్రీం వంటి వాటికి దూరంగా ఉండాలి.
- సంప్రదించి... కొన్ని రకాల మందులు, క్రీంలను వినియోగించే ముందు వైద్యులను సంప్రదించడం ముఖ్యం. ఎందుకంటే వాటిలోని రసాయనాలు చర్మానికి పడకపోతే తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. మొటిమలను గిల్లకూడదు. అలాగే వర్కవుట్లు చేసిన తర్వాత స్నానం చేయడానికి బద్ధకించకూడదు. చెమటపట్టిన చర్మాన్ని శుభ్రం చేయకపోతే రకరకాల బ్యాక్టీరియాలు చర్మ రంధ్రాల్లో చేరి ముఖంపై మొటిమలు రావడానికి కారణమవుతాయి.
- నిద్ర... కంటినిండా నిద్ర చర్మ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. రోజుకి కనీసం ఆరేడు గంటల నిద్ర ఉండాలి. పడుకొనే ముందు మేకప్‌ను తొలగించి, ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేయాలి. లేదంటే చర్మం కళావిహీనంగా మారడమేకాకుండా, మొటిమలు, మచ్చలు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఆరు లేదా ఏడు గ్లాసుల నీటిని తాగాలి. అతిగా ఎండలో ఉండకూడదు. అలా వెళ్లాల్సివస్తే తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇవన్నీ పాటిస్తే మీ చర్మం నవనవలాడుతూ ఉంటుంది.
ఇదీ చదవండి: Good Relationship tips: అతి చనువు వద్దు.. అలాగని మాట్లాడకుండా ఉండొద్దు.!