మీ పాపలో తెలివితేటలు, సర్దుబాటు చేసుకునే స్వభావం.. వయసుకు తగినట్లే ఉన్నాయని తెలుస్తోంది. అయితే మాటిమాటికీ ఏడవడం, మాటకుమాట సమాధానం చెప్పడం లాంటివి చేస్తుందని రాశారు. మీ ఇంట్లోకి రెండో చిన్నారి రావడంతో ఈ అమ్మాయిలో అభద్రత చోటు చేసుకున్నట్లు అనిపిస్తోంది. ఇన్నాళ్లూ తననే ప్రేమించిన అమ్మానాన్నా, మిగతా కుటుంబ సభ్యులు ఇకనుంచి తన పట్ల శ్రద్ధ చూపరేమోనని ఆ పసి హృదయం అనుకుంటూ ఉండొచ్ఛు ఈ విషయాలను బయటకు చెప్పడం తెలియక విసుగు, అసహనం, కోపం ద్వారా తన అసక్తతతను తెలియజేస్తోంది. సహజంగానే ఇంట్లో చిన్నారులంటే కుటుంబ సభ్యుల దృష్టి వారి మీదే ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ గమనిస్తున్న మీ అమ్మాయి మీరు తనపట్ల ముందులా ఉండట్లేదని అనుకుంటూ ఉండొచ్ఛు.
సమయం ఇవ్వండి...
కొత్తగా కుటుంబంలోకి చిన్నారి వచ్చినా తన ప్రాధాన్యం తగ్గదని మీ మాటలు, చేతల ద్వారా పాపకు నమ్మకం కలిగించాలి. రోజూ కొంచెం సమయాన్ని మీరు, మిగతా కుటుంబ సభ్యులూ ఆమెతో సంతోషంగా గడపాలి. చదివించడం, కథలు చెప్పడం, తనతో కలిసి బయటకు వెళ్లడం, ఆటలు ఆడటం లాంటివి చేయాలి. మీరు తనతో ఉంటే తనలో సానుకూల మార్పు అతి త్వరగా రావొచ్ఛు అలాగే మారిన పరిస్థితులను ఆమెకు అర్థమయ్యేలా వివరిస్తూ అందుకే తనతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నారని చెప్పండి. రెండో పాప సంరక్షణ విషయంలో చిన్న చిన్న పనులను తనకు అప్పజెప్పండి. చిన్నారిని ఆడించడం, కబుర్లు చెప్పడం, నవ్వించడంలాంటి చిన్న పనులు ఆమెతో చేయించండి. దాంతో ఆమెకు మీతో, చిన్నారితో మరింత అనుబంధం ఏర్పడుతుంది. దాంతో సెల్ఫ్‌పిటీ, విసుగు, అనవసర దుఃఖం లాంటివి క్రమంగా తగ్గిపోతాయి.
ఇదీ చదవండి: పదవుల కోసం వెంపర్లాడటం లేదు: పైలట్