పిల్లలు మంచి పనిచేస్తే, ఏదైనా విజయం సాధిస్తే ప్రశంసించాలి, పొగడాలి. కానీ మరీ అతిగా పొగడకూడదు. ఎందుకంటే రేపొద్దున్న ఓటమిని ఎదుర్కోలేని మానసిక బలహీనత పిల్లల్లో ఏర్పడుతుంది. పెద్దైన తరువాత ప్రతిచిన్న విషయానికీ ఎదుటివారు ఆకాశంలోకి ఎత్తేయాలని ఎదురుచూస్తారు. పొగడ్తకు, ప్రశంసలకు మధ్య చాలా తేడా ఉందని చెబుతున్నారు మానసిక నిపుణులు.
పరీక్షల్లో మార్కులు తక్కువ రావడం, లేదా ఏదైనా క్రీడలో ముందంజలో లేకపోవడం వంటి సందర్భాల్లో వారిని విమర్శించకుండా ప్రశంసించాలి. చివరి వరకు ప్రయత్నించావు. ఇది మెచ్చుకోదగ్గ అంశం అనాలి. ఈసారి మరికొంత కృషి చేస్తే, విజయం నీదే అవుతుందనే ఆత్మవిశ్వాసాన్ని వారిలో నింపాలి. ఇది వారికి భవిష్యత్లో ఓటమిని కూడా తట్టుకోగలిగే పరిణతిని తీసుకొస్తుంది. తిరిగి గెలవడానికి ప్రయత్నించాలనే పట్టుదల ప్రారంభమవుతుంది.
బైకు నేర్చుకుంటా, అన్నయ్యతో సమానంగా నేను కూడా అదే కోర్సులో చేరతా అన్నప్పుడు వాడు వేరే, నువ్వు వేరే అంటూ అమ్మాయిలను నిరుత్సాహపరచకూడదు. ఫలానాది చదవాలని, కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుంది. అటువంటి సమయంలో అమ్మాయిల ఆలోచనలను మొగ్గ దశలోనే తుంచేయకూడదు. వారి ఊహల రెక్కలను కత్తిరించకుండా, వారి మనసులోని భావాలకు విలువనివ్వాలి. వారనుకున్న లక్ష్యాలను గుర్తించి, సాధించడానికి చేయూతనందించాలి. అలా వారిలోని సృజనాత్మకతను గుర్తించగలిగితే భవిష్యత్లో వారనుకున్నది సాధించగలుగుతారు.
చిన్నప్పటి నుంచి పిల్లలకు పుస్తకాలు చదివే అలవాటు చేయాలి, బాల్యంలో చదివిన కథల్లోని అంశాలు వారిని ప్రభావితం చేస్తాయి. అలాగే పుస్తకాలు చదివే అలవాటు వారితో పాటు పెరిగి పెద్దదవుతుంది. ఉన్నత వ్యక్తుల జీవిత చరిత్రలు వారిలో స్ఫూర్తిని నింపుతాయి. ఇది వీరిపై సానుకూల దృక్పథాన్ని, దేన్నైనా సాధించాలనే లక్ష్యాన్ని ఏర్పరుస్తుంది. సాహిత్యం ద్వారా సామాజికపరమైన అంశాలపై అవగాహన పెరుగుతుంది. ఇవన్నీ వారిని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి.