పిల్లల వారి తల్లిదండ్రులతో బయటికి వెళ్తే చాలు.. పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ వంటి ఆహార పదార్థాలు కొనివ్వమని మారాం చేస్తుంటారు. ఇక పేరెంట్సేమో.. పిల్లలు అడిగారు కదా అనో, నలుగురిలో ఇబ్బంది ఎందుకనో అడిగినప్పుడల్లా కొనిస్తుంటారు. ఇంకొంతమంది తల్లిదండ్రులైతే తమ పిల్లలకు ఇష్టమని ఇంటికొచ్చేటప్పుడు కొనుక్కురావడం, అప్పుడప్పుడు వీటిని పిల్లలకు చిరుతిళ్లుగా అందించడం.. వంటివి చేస్తుంటారు కూడా! కానీ పిల్లలు ఇలాంటి పదార్థాలు ఎక్కువగా తినడం వారి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పిల్లలకు చిన్నతనంలోనే స్థూలకాయంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు రావడానికి ఇలాంటి పదార్థాలే కారణమంటున్నారు నిపుణులు.
దంత సమస్యలు..
పిల్లల శరీరంలో ఏ అవయవమైనా సున్నితంగానే ఉంటుంది. నోట్లోని దంతాలు, ఇతర భాగాలు కూడా అంతే! కానీ పిల్లలు తినే ఇలాంటి కొన్ని చిరుతిళ్ల వల్ల వారి దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అదెలాగంటే.. జంక్‌ఫుడ్‌లో కార్బొహైడ్రేట్లు, చక్కెరలు అధికంగా ఉంటాయి. ఇవి నోట్లో ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. దానివల్ల దంతాలపై ఉండే ఎనామిల్ తొలగిపోవడంతో పాటు చిగుళ్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అలాగే పళ్ల సందుల్లో ఇరుక్కుపోయిన పదార్థాల వల్ల పలు దంత సమస్యలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి పిల్లల దంత ఆరోగ్యాన్ని కాపాడే క్రమంలో ఇలాంటి జంక్‌ఫుడ్‌ని వీలైనంత వరకు పిల్లలకు దూరంగా ఉంచడం మంచిది.
క్యాలరీలెక్కువ.. పోషకాలు తక్కువ..
పిల్లలు ఎదిగే క్రమంలో వారికి పోషకాహారం అందించడం చాలా ముఖ్యం. అలాకాకుండా ఏ పోషకాహారం లేని జంక్‌ఫుడ్‌ని పిల్లల ఆహారంలో భాగం చేయడం వల్ల వారి శరీరంలోని జీవక్రియలు అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా వారికి లేనిపోని ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో పాటు వారిలో రోగనిరోధక శక్తి కూడా క్షీణిస్తుంది. అలాగే వారు ఆరోగ్యంగా ఎదగలేరు కూడా! మరో విషయం ఏంటంటే.. ఈ పదార్థాల్లో క్యాలరీలు, కొవ్వులు, చక్కెరలు.. వంటివి అధిక మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ వారిలో శక్తిని క్షీణింపజేసి, వారు స్థూలకాయం బారిన పడేలా చేస్తాయి. కాబట్టి ఇలాంటి ఆరోగ్య సమస్యల నుంచి పిల్లల్ని రక్షించుకోవాలంటే వారిని జంక్‌ఫుడ్‌కి వీలైనంత దూరంగా ఉంచాలి.
జీర్ణ సంబంధిత సమస్యలు..
మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఫైబర్ శాతం ఎంత తక్కువగా ఉంటే జీర్ణ సంబంధిత సమస్యలు అంత ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. జంక్‌ఫుడ్‌లో ఫైబర్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. పిల్లలు వీటిని అధికంగా తినడం వల్ల తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక మలబద్ధకం, కడుపునొప్పి.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆహారాన్ని పిల్లలకు ఎంత దూరం చేస్తే వారి ఆరోగ్యానికి అంత మంచిది.
ఏకాగ్రత లోపిస్తుంది..
జంక్‌ఫుడ్ తినడాన్ని ఒక అలవాటుగా చేసుకున్న పిల్లల్లో ఐక్యూ తగ్గుతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ ఆహారం వారి మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపి వారిలో ఏకాగ్రత లోపించడానికి కారణమవుతుంది. అలాగే జంక్‌ఫుడ్‌కి అలవాటు పడిన పిల్లలు ఇంట్లో చేసే ఆరోగ్యవంతమైన ఆహారం, పండ్లు.. వంటివి తీసుకోవడానికి ఇష్టపడరు. దీంతో వారికి కావాల్సిన పోషకాలు అందకుండా పోతాయి. ఇది వారి ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు. కాబట్టి ఎప్పుడో ఒకసారైతే పర్లేదు.. కానీ రెగ్యులర్‌గా తినే అలవాటును మాత్రం మానుకోవాలి.
ఇవి కూడా..
* జంక్‌ఫుడ్ కొంతమంది పిల్లల ఆరోగ్యానికి సరిపోకపోవడం వల్ల వారు పలు అలర్జీల బారిన పడే అవకాశమూ లేకపోలేదు.
* అలాగే ఇలాంటి ఆహార పదార్థాలు పిల్లల్లో చిరాకు, అల్లరి, దూకుడుతనం.. వంటి నెగెటివ్ ప్రవర్తనలకూ దారితీస్తాయి.
జంక్‌ఫుడ్ వల్ల పిల్లల ఆరోగ్యానికి ఎన్ని తిప్పలో తెలుసుకున్నారు కదా! కాబట్టి పిల్లలు అడిగినప్పుడల్లా వాటిని కొనివ్వడం కాకుండా.. ఈ అలవాటును దగ్గరుండి మరీ పిల్లల చేత మాన్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
ఇదీ చదవండి: చిన్నారులకు పీడ కలలు వచ్చేది.. అందుకే!