ప్రసవ సమయంలో ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు లేదా కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం ఉంటే చిన్నారికి ఫిట్స్ వచ్చే ఆస్కారం ఉంది. ఒకసారి ఆగిపోయి మళ్లీ వచ్చాయంటే.. మెదడులో కొన్ని అసాధారణ కణాలు ఉండొచ్చు. మందులు ఆపేసాక మళ్లీ మొదలైంది అంటే మెదడులో ఇంకా ఏదో సమస్య ఉందనిపిస్తోంది. దీన్ని పార్షియల్ సీజర్స్/ఫిట్స్ అంటారు. దీన్ని బట్టి బాబు మెదడులో నాడులు బలహీనంగా ఉన్నాయని అర్థమవుతుంది. కాబట్టి మందులు వాడాల్సి రావొచ్చు. ఒక్కోసారి ఈఈజీ పరీక్షలో ఫలితాలు సాధారణంగా కనిపించినా.. మెదడులోని అంతర్గత భాగాల నుంచి విడుదలయ్యే అసాధారణ ఎలక్ట్రికల్ డిస్చార్జ్‌లవల్ల చిన్నగా ఫిట్స్ రావొచ్చు.
అయితే, గాబరా పడాల్సిన పనిలేదు. న్యూరాలజిస్ట్‌ని సంప్రదించండి. ఫిట్స్ మళ్లీ వస్తే వైద్యుల సలహాతో తప్పనిసరిగా మందులు వాడాలి. ఈ ఫిట్స్ వచ్చినవారి మానసికస్థితి గందరగోళంగా ఉంటుంది. ఏకాగ్రత లోపిస్తుంది. తొందరపాటు ఎక్కువ. మందులవల్లా ఈ పరిస్థితి తలెత్తవచ్చు. బాబును అదే పనిగా చదవమంటూ ఒత్తిడి చేయొద్దు. తనకు ఇష్టమైన పనుల్ని చేసుకోనీయండి. ఒకవేళ బాబు చదువుపై దృష్టి పెట్టలేకపోతే సైకియాట్రిస్ట్‌ను సంప్రదించాలి.
- డా.మండాది గౌరీదేవి, పిల్లల మానసిక నిపుణురాలు