డిప్రెషన్.. ఇతరులతో చెప్పుకోవడానికి ఇష్టపడని ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. ఇలా దీని బారిన పడిన వారు దాన్నుంచి బయటపడడం అంత సులభం కాదు. ఆత్మహత్యకు దారి తీసే ముఖ్య కారణాల్లో డిప్రెషన్ కూడా ఒకటి. ఇలా ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని మానసిక వైకల్యం, ఇతర ఆరోగ్య సమస్యలకు గురి చేస్తోంది.
జయించడానికి మార్గాలు..
* భావోద్వేగాల్ని మీలోనే దాచుకుంటూ కుమిలిపోవద్దు. భయపెట్టే సంఘటనలు కావచ్చు.. ఇబ్బందులకు గురి చేసే పరిణామాలు కావచ్చు.. సమస్యలేవైనా.. ఎలాంటివైనా.. సరే ఎప్పటికప్పుడు డైరీలో నోట్ చేసుకోవడం ఉత్తమం. దీనివల్ల చాలా వరకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొంత భారం తీరినట్లు అనిపిస్తుంది కూడా. వీలైతే మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మీ సమస్యల గురించి వివరించండి. దీనివల్ల మనసు తేలికపడే అవకాశమూ లేకపోలేదు.
![meditationmistakeshg650.jpg](https://www.vasundhara.net/articleimages/meditationmistakeshg650.jpg)
* ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి మేలైన ప్రత్యామ్నాయాల్లో ధ్యానం (మెడిటేషన్) కూడా ఒకటి. ప్రతి రోజూ కనీసం 15 నిమిషాలు ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం చేసుకోండి. ఫలితంగా ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది.
* మనసుకు మరింత బాధ కలిగినప్పుడు మీరు సాధించిన చిన్న చిన్న విజయాలను నెమరువేసుకోండి. మిమ్మల్ని మీరు ఉన్నతంగా ఊహించుకోండి. అలాగే మీ చిన్ననాటి విశేషాలు గుర్తుకు తెచ్చుకోవడం.. మంచి మ్యూజిక్ వినడం.. ఇలా మీకు నచ్చిన పనిలో నిమగ్నమైపోయి బాధ నుంచి విముక్తి పొందండి. అప్పటికీ ఫలితం లేకపోతే ఓ వారం పాటు నచ్చిన ప్రదేశాలకు వెళ్లిరండి.
![Tipstoeradicatesoundpollution650-3.jpg](https://www.vasundhara.net/articleimages/Tipstoeradicatesoundpollution650-3.jpg)
* మీరు అమితంగా ఆరాధించే, బాగా ఇష్టపడే వ్యక్తులతో వీలైనప్పుడల్లా మాట్లాడుతూనే ఉండండి.
* ఒత్తిడి పెరిగిపోవడం, మానసిక ప్రశాంతత కరువవడం.. ఇలాంటి సమస్యలన్నింటికీ నిద్ర లేకపోవడమే ప్రధాన కారణమని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అందుకే ప్రతి రోజూ కనీసం ఏడెనిమిది గంటలైనా నిద్రపోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఒకవేళ నిద్ర పట్టకపోతే?? అంటారా.. అయితే రాత్రుళ్లు బాగా నిద్ర పట్టాలంటే సాయంత్రం ఆరు తర్వాత కాఫీ, టీ.. వంటి కెఫీన్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోకపోవడమే మంచిది.
* మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి, శారీరక ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవడానికి సరైన వ్యాయామం కూడా కీలకమే. ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలి. దీనివల్ల ఫీల్ గుడ్ ఎండార్ఫిన్లు విడుదలై మనసు ఆనందంగా, ఆహ్లాదంగా ఉండేలా చేస్తాయి. అందుకే వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, యోగా, ఏరోబిక్స్, టెన్నిస్.. ఇలా నచ్చిన అంశానికి ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు కేటాయించండి. రోజంతా ఆనందంగా గడిపేయండి.
![arognyasdjhfkd6501.jpg](https://www.vasundhara.net/articleimages/arognyasdjhfkd6501.jpg)
* సరైన మోతాదులో నీరు తాగడమూ ముఖ్యమేనని మర్చిపోకండి. అలాగని శీతల పానీయాలు, సోడాలు తీసుకోకపోవడం మంచిది. వీటికి బదులుగా పండ్ల రసాలు, కొబ్బరి నీరు, మజ్జిగ.. లాంటివి అటు ఆరోగ్యానికి.. ఇటు మనసుకు హాయినిచ్చే పానీయాలు. అలాగే కాఫీ, టీ లను కూడా సాధ్యమైనంత మితంగా తాగడం మంచిది.
* తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. జంక్ ఫుడ్‌కు సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది. అలాగే కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు మరింత బద్ధకానికి కారణమవుతాయి. కాబట్టి వీటినీ వీలైనంత దూరం పెట్టడానికి ప్రయత్నించండి.
మీ అలవాట్లలోనూ, జీవన శైలిలోనూ తగినన్ని మార్పులు చేసుకున్నప్పటికీ డిప్రెషన్ లక్షణాలు ఇంకా వేధిస్తుంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
ఇదీ చూడండి: కార్డు లేకుండా క్యాష్ విత్‌డ్రా ఎలా?