శరీరానికి పోషకాలు, ఖనిజ లవణాలు, కార్బొహైడ్రేట్స్‌తో పాటు విటమిన్‌లు కూడా చాలా అవసరం. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో విటమిన్లది కీలకపాత్ర. విటమిన్ ‘డి’ మీలో లోపిస్తే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా తరచుగా జుట్టు రాలిపోవడం, శరీరం బలహీనమవ్వడం, అలసట, ఒంటి నొప్పులు, కీళ్ల నొప్పులు, చురుకుగా లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే విటమిన్ ‘డి’ లోపంతో మీరు బాధపడుతున్నట్టే.
వీటిపై ప్రభావం..
మనిషి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే విటమిన్ ‘డి’ లోపిస్తే అది శరీరంలోని కొన్ని భాగాలపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఎముకలు, కండరాల పటుత్వం క్షీణిస్తుంది. మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. గుండె సంబంధిత వ్యాధులకు విటమిన్ ‘డి’ లోపం కూడా ఒక కారణం. ఎముకలు దృఢంగా తయారవ్వాలంటే శరీరానికి సరిపడా కాల్షియం ఉండాలి. కాల్షియం సరైన మోతాదులో లేకపోతే ఎముకల బలహీనమవుతాయి. మరి ఇంతటి ప్రాధాన్యం ఉన్న కాల్షియం ఉత్పత్తికి విటమిన్ ‘డి’ సహకరిస్తుంది. సూర్యకాంతి శరీరంపై పడ్డప్పుడు విటమిన్ ‘డి’ శరీరంలో కాల్షియం తయారవ్వడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఒకవేళ ఈ విటమిన్ ‘డి’ లోపిస్తే ఎముకలు క్రమంగా వంకరగా తయారై చివరికి వ్యక్తి ‘రికెట్స్’ వ్యాధి బారిన పడతాడు.
ఉషాకిరణాలు.. వ్యాధి నిరోధక బాణాలు
విటమిన్ ‘డి’ శరీరంలోని కొవ్వు నుంచి తయారవుతుంది. సుప్రభాత వేళ సూర్యుడు నుంచి వచ్చే కిరణాలు విటమిన్ ‘డి’ ఉత్పత్తికి ప్రధాన కారణం. అందుకే ఉషాకిరణాలు.. వ్యాధి నిరోధక బాణాలుగా పనిచేసే ఆయుధాలని చెప్పుకోవచ్చు. బిజీబిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది ఉదయపు సూర్యకాంతికి అంతగా ప్రాధాన్యం ఇవ్వట్లేదు. కరోనాను ఎదుర్కొనేందుకు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా అవసరం. కాబట్టి ఇకనైనా రోజు ఉదయం సూర్యకాంతి మీ శరీరంపై పడేలా చూసుకోండి. దీంతో పాటు విటమిన్ ‘డి’ పుష్కలంగా ఉండే పాలు, చేపలు, కాడ్ లివర్ ఆయిల్, గుడ్లు, పుట్టగొడుగులు, ఓట్స్, రొయ్యలు, వెన్న, జున్ను, కమలాలు వంటి ఆహార పదార్థాలను మీ డైట్‌లో తీసుకోండి. కరోనా మహమ్మారిని విటమిన్ ‘డి’ అనే ఆయుధంతో పోరాడి విజేతలు కండి.