కళ్ల కింద ముడతలు, నల్లటి వలయాలు రావడానికి బోలెడు కారణాలు. అందులో నిద్రలేమి కూడా ఒకటి. మరో కొత్త సంగతి ఏమిటంటే అతినిద్ర వల్లా ఇవి వస్తాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. మరి వీటిని ఎలా తగ్గించుకోవాలో చూద్దామా...
ఎలా వస్తాయంటే...
- పోషకాహారం తీసుకోకపోవడం, అతినిద్ర, అలసట, టీవీ, కంప్యూటర్‌ల ముందు గంటల తరబడి కూర్చోవడం, రాత్రిళ్లు ఎక్కువసేపు మొబైల్ చూడటం.. వీటన్నింటి వల్ల చర్మ కణజాలం, రక్తనాళాలు దెబ్బతింటాయి. ఫలితంగా డార్క్ సర్కిల్స్ వస్తాయి.
- హైపర్ పిగ్మెంటేషన్ వల్ల కూడా అలర్జీ, కళ్లు పొడిబారడం లాంటి సమస్యలు రావొచ్చు. ఎక్కువసేపు ఎండలో ఉండటంతో మెలనిన్ వర్ణకం స్రావం ఎక్కువవడం వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. ఇది హైపర్ పిగ్మెంటేషన్‌కు దారి తీస్తుంది. కాబట్టి ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ముఖాన్ని ఎండ తగలకుండా టోపీ పెట్టుకోవడమో, చున్నీ కట్టుకోవడమో చేయాలి. అలాగే ఎస్‌పీఎఫ్30 సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం మరిచిపోవద్దు.
కళ్లను రక్షించుకోండిలా...
- నాణ్యమైన సౌందర్య ఉత్పత్తులనే వాడాలి.
- కంటినిండా నిద్రపోవాలి. తగినన్ని నీళ్లు తాగాలి. విటమిన్-కె ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
- కంటికింద నూనెగ్రంథులేవీ ఉండవు. పైగా ఆ ప్రాంతం చాలా సున్నితం కాబట్టి మేకప్ తీసేటప్పుడు అక్కడ గట్టిగా రుద్దకూడదు.
- రోజులో అయిదారు సార్లు కంటికి చిన్నపాటి మసాజ్ చేసుకోవాలి.
తగ్గించుకునేందుకు చిట్కాలు...
- రోజూ రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి/ ఆముదం/ బాదం నూనెతో కంటి కింద మృదువుగా మర్దనా చేసుకోవాలి.
- చర్మ తత్వానికి సరిపోయే నైట్ ఐ క్రీమ్‌ను రాసుకోవాలి.
- అరటిపండు తొక్కతో కంటికింద మృదువుగా రాయడం వల్ల అక్కడి నలుపుదనం తగ్గుతుంది.
- నిద్రపోయే ముందు కొద్దిగా నెయ్యిని కళ్లకింద మృదువుగా రాస్తే సరి.
కళ్లను కాపాడుకునే ఆహారం..
- చిక్కుళ్లు, బీన్స్, ధాన్యాలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల రెటీనా ఆరోగ్యంగా ఉంది. ఇందులో ఉండే బయోఫ్లావనాయిడ్స్, జింగ్ మీ రెటీనాను కాపాడతాయి. కంటిశుక్లం అభివృద్ధి చెందే ప్రమాదాన్ని, కంటి కింద వచ్చే నల్ల మచ్చలను తగ్గిస్తాయి.
- బాదం, పిస్తా వంటి వాటిల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-ఇ ఉంటాయి. పోషకాలతోపాటు విటమిన్-ఇ తీసుకోవడం వల్ల ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్ (AMD) సమస్య తగ్గుతుందని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి.
- పిల్లలకు బాల్యం నుంచే ఆకు కూరలు తినడం అలవాటు చేయాలి. అప్పుడే వారి కళ్లు ఆరోగ్యకరంగా ఉంటాయి. బచ్చలి, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్ వంటి ఆకు కూరల్లో విటమిన్-సి, ఇ అధికం. మొక్కల్లాంటి ఆకు కూరల్లో విటమిన్-ఎ శాతం ఎక్కువ. కాబట్టి.. మీరు తీసుకొనే ఆహారంలో ఆకు కూరలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి.
ఇదీ చూడండి: BEAUTY TIPS: చిటపట చినుకుల మధ్య మెరిసే చర్మం..