మానసిక ప్రశాంతత
జీవితం సంతోషంగా.. ఆనందంగా సాగిపోవాలంటే ఉండాల్సిన లక్షణాల్లో మొదటిది మానసిక ప్రశాంతత. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మెదడు ఒత్తిడి లేకుండా పనిచేయగలుగుతుంది. అప్పుడే అనుకున్నది సాధించగలం. అంతేకాదు.. ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించాలన్నా.. అదే ధోరణిలో వ్యవహరించాలన్నా.. మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. కానీ మన మెదడు ఎప్పుడూ రకరకాల ఆలోచనల్లో మునిగిపోయి ఉంటుంది. ఎన్నో జ్ఞాపకాలను తనలో దాచుకొంటుంది. వీటిలో కొన్ని సంతోషం కలిగించేవి ఉంటే.. మరికొన్ని బాధపెట్టేవి కూడా ఉంటాయి.
కొన్ని సందర్భాల్లో ఇవి మనపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా మనం చేసే పనిపై శ్రద్ధ పెట్టలేం. కాబట్టి.. ఎప్పుడూ ఆశావహ దృక్పథంతో ఉండటం మంచిది. ఎప్పుడైనా చేదు అనుభవాలు మీ మదిలో మెదిలితే వాటి ప్రభావం మనపై పడకుండా చూసుకోవాలి. ఏదైనా మన మంచికే అన్న భావన పెంపొందించుకొన్నట్లయితే.. ఈ ఇబ్బంది ఎదురవదు. అయితే అంతకంటే ముందుగా మన మెదడుని ఆ విధంగా ఆలోచించేలా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మానసికంగా దృఢంగానూ తయారవ్వాలి. దీనికి యోగా, ధ్యానం కొంత వరకు సాయం చేస్తాయి. వాటిని రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు.
ఆరోగ్యం..
ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఫిట్‌నెస్ వీడియోలను చూసి మనమూ అలాగే చేయాలనుకొంటాం. గూగుల్‌లో ఫిట్‌నెస్ టిప్స్ గురించి, ఆరోగ్యాన్నందించే ఆహారం గురించి తెగ వెతుకుతాం. వాస్తవ పరిస్థితుల మాటకొస్తే సమాచారాన్ని వెతికే క్రమంలో ఉన్న ఉత్సాహం వాటిని పాటించాల్సి వచ్చే సరికి కనిపించదు. పని ఎక్కువగా ఉన్న సందర్భాల్లో కొన్నిసార్లు ఆహారాన్ని తీసుకోవాలనే విషయాన్ని కూడా మరచిపోతూ ఉంటాం. మరికొన్నిసార్లు జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్‌తో సరిపెట్టుకొంటూ ఉంటాం. ఇలాంటి అలవాట్ల కారణంగా మన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాయామం చేసే అలవాటు కూడా చాలామందిలో కనిపించదు. ఇది కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రోజూ కొంత సమయం ఎక్సర్‌సైజ్‌లు చేసేవారు ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా మన సొంతం కావాలంటే.. రోజూ సరైన ఆహారం తీసుకోవడం, కొంత సమయం వ్యాయామం చేయడం తప్పనిసరి.
చక్కని అనుబంధం..
మన సుఖదుఃఖాల్లో పాలు పంచుకొనేవారు ఉంటే అంతకు మించిన ఆనందం ఏముంటుంది? అది కుటుంబ సభ్యులైనా.. స్నేహితులైనా సరే..! మన గురించి ఆలోచించి.. కష్టాల్లో మనకు అండగా నిలబడేవారున్నట్త్లెతే అంతకు మించి మనం సంపాదించుకోగలిగిన ఆస్తి ఏముంటుంది? మనకు కలిగిన సంతోషాన్ని.. ఇతరులతో పంచుకొన్నప్పుడే అది రెట్టింపవుతుంది. అందుకే మన జీవితంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు ఓ భాగంగా ఉంటారు. అలాంటి వారందరితోనూ చక్కటి అనుబంధాన్ని కొనసాగించాలంటే కాస్త శ్రమ పడాల్సిందే.
విధి నిర్వహణలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మనల్ని ప్రేమించే వ్యక్తులతో ఎంతో కొంత సమయం గడపడానికి ప్రయత్నించాలి. అలాగే ఇద్యరి మధ్య ఏర్పడిన బంధం స్నేహమైనా.. ప్రేమైనా.. కొన్ని కొన్ని సందర్భాల్లో గొడవలు రావడం సహజం. కాబట్టి వాటిని తెగేవరకు లాగకుండా.. మనలోని అహాన్ని పక్కనపెట్టి ఇద్దరి మధ్య ఏర్పడిన సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ జీవితంలో భాగంగా ఉన్న ప్రతి ఒక్కరితోనూ ఎంతో కొంత సమయం గడుపుతూ ఉండండి. వారు మీకు దూరంగా ఉన్నప్పటికీ వారానికోసారి ఫోన్‌లోనైనా మాట్లాడటానికి ప్రయత్నించండి.
ఇదీ చదవండి : నా బ్రెయిన్‌లో 9 టైటానియం తీగలున్నాయి!