Cancer Cases in Telugu States : తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ కోరలు చాస్తోంది. గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. ఏటా 1000కి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహమ్మారి బారినపడి మరణించే వారి సంఖ్యా క్రమేణా పెరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కలుపుకొని గతేడాది(2020)లో 1,18,044 కేసులు నమోదు కాగా.. 64,620 మంది మృత్యువాతపడ్డారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ మేరకు వెల్లడించింది.
Cancer Cases in Telangana : విడిగా ఉండేవారి కంటే ఉమ్మడి కుటుంబాల్లోని బాధితులు తొందరగా కోలుకుంటున్నారని ఇటీవల ఓ అధ్యయనం తెలిపింది. 30-40 ఏళ్ల వయసు వారిలోనూ 10% క్యాన్సర్ కేసుల పెరుగుదల ఉండటం ఆందోళన కలిగించే అంశం. క్యాన్సర్‌కు ప్రభుత్వ వైద్యంలోనూ అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని కేంద్రం నివేదికలో వివరించింది.
ముందస్తు పరీక్షలపై దృష్టి
Cancer Deaths Telangana : అసాంక్రమిక వ్యాధుల నివారణ పథకంలో భాగంగా కేంద్రం అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్ తదితర వ్యాధిగ్రస్తులను ముందస్తుగా గుర్తించడంపై దృష్టిపెట్టింది. ఈ పథకం కింద తెలుగు రాష్ట్రాల్లోనూ పరీక్షలు కొనసాగుతున్నాయి. క్యాన్సర్ పరీక్షల్లో ప్రధానంగా రొమ్ము, గర్భాశయ ముఖద్వార, నోటి క్యాన్సర్‌లను గుర్తించడానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లోనూ క్యాన్సర్ పరీక్ష కేంద్రాలను నెలకొల్పినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ నివేదికలో పేర్కొంది. ఆయుష్మాన్ భారత్ కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది.
దృష్టి పెట్టాల్సిన అంశాలు
Cancer Awareness : గ్రామీణంలో ఈ వ్యాధిపై విస్తృతంగా అవగాహన కల్పించాలి.
9-18 ఏళ్ల వయసు బాలికలకు హెచ్‌పీవీ టీకాను ఇప్పించాలి.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను గుర్తించడానికి నర్సులు, ఏఎన్‌ఎంలకు శిక్షణ నివ్వాలి.
గ్రామీణంలో ఇంటింటికీ వెళ్లి ఏఎన్‌ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు మహిళలను పరీక్షించాలి.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు కారణాలు
Reasons for Cancer : మర్మావయాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం
పదే పదే సుఖవ్యాధులు సోకడం
పౌష్టికాహారం లోపించడం
18 ఏళ్ల లోపే పెళ్లి కావడం, పిల్లలు పుట్టడం
రొమ్ము క్యాన్సర్‌కు..
ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం
35 ఏళ్లు దాటాక గర్భధారణ
తల్లిపాలు బిడ్డకు పట్టకపోవడం
![](https://assets.eenadu.net/article_img/gh-main10b_39.jpg)
జన్యుపరంగా.. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి
‘హెపటైటిస్ బి, సి’లు కాలేయ క్యాన్సర్లకు, హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ) గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రావడానికి కారణమవుతున్నాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు టీకా అందుబాటులో ఉంది. 8-18 ఏళ్ల వయసు వాళ్లకు ఈ టీకా ఇవ్వాలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది. కాలేయ క్యాన్సర్‌కు హెపటైటిస్ టీకా ఉంది. 40 ఏళ్లు దాటిన మహిళలు ఏడాదికోసారి మ్యామోగ్రఫీ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి.
- డాక్టర్ శ్రీకాంత్, క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులు
![](https://assets.eenadu.net/article_img/gh-main10c_8.jpg)