కొర్రల్లో పీచు పదార్థం, మాంసకృత్తులు, క్యాల్షియం, ఇనుము, మాంగనీస్, మెగ్నీషియంతోపాటు ఇతర విటమిన్లూ ఉంటాయి.
ఇవి ఉదర సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. మూత్రంలో మంటగా అనిపించినప్పుడు వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మధుమేహ బాధితులకు ఇవి మంచి ఆహారం. ఎన్నో ప్రయోజనాలున్న వీటితో జావను ఎలా తయారుచేయాలో చూద్దామా...
పావుకప్పు కొర్రలను శుభ్రం చేసుకుని అరగంటపాటు నానబెట్టుకోవాలి. వీటిని గిన్నెలో వేసి కప్పు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి. పొంగు వచ్చిన తర్వాత మంటను తగ్గించి ఉడికించాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. జావను ఇలా తాగితే ఆరోగ్యానికెంతో మంచిది. లేదంటే తాలింపు కూడా పెట్టుకోవచ్ఛు.
చిన్న కడాయిలో కొద్దిగా నూనె పోసి వేడిచేసి చెంచా చొప్పున జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. ఈ తాలింపును వండిన కొర్ర జావలో వేసి కలపాలి. చివరగా కొత్తమీర తురుము వేస్తే కొర్రజావ లేదా కొర్రబియ్యం గంజి సిద్ధమైనట్టే.