కరోనా వైరస్ మనల్ని ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు. ఓవైపు మూడో దశ ఉద్ధృతి అనుమానాలను నిజం చేసేలా కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రోజుకు వేలాదికి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుంటే... మరోవైపు కొవిడ్ బారిన పడి కోలుకున్న వారిని పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ప్రత్యేకించి మధుమేహం లాంటి దీర్ఘకాలిక రోగులకు కొవిడ్ నరకప్రాయంగా మారింది. వైరస్ ప్రభావంతో కోల్పోయిన రోగ నిరోధక శక్తిని తిరిగి పొందాలంటే పోషకాహారం(Post Covid Diet) తీసుకోవడం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ప్రొటీన్లు, విటమిన్లతో మిళితమైన సమతులాహారాన్ని తీసుకోవడం వల్ల కొవిడ్ అనంతర సమస్యలను త్వరగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు.
వీటిని అల్పాహారంలో చేర్చుకోండి!
డయాబెటిక్ రోగులు కొవిడ్ సిండ్రోమ్ సమస్యలను అధిగమించాలంటే బ్రేక్‌ఫాస్ట్ విషయంలో కొన్ని మార్పులు(Post Covid Diet) చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా ఉదయం నిద్ర లేచిన రెండు గంటల్లోపే అల్పాహారాన్ని తీసుకోవాలని... అది 8-9 గంటల మధ్య అయితే మరీ మంచిదంటున్నారు.
ఇక బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్ విషయానికొస్తే... శరీరంలో గ్లూకోజ్ స్థాయులను పెంచే ఆహారానికే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. ఇందుకోసం ఓట్స్ విత్ స్కిమ్డ్ మిల్క్(బెర్రీలు, నట్స్‌ను కలుపుకోవచ్చు) / వెజిటబుల్ బేసన్ చీలా / వెజిటబుల్ మూంగ్‌దాల్ చీలా / రెండు మల్టీ గ్రెయిన్ దోసెలు / ఒక బౌల్ క్వినోవా/ ఉడకబెట్టిన శెనగలు / వెజిటబుల్ మిక్స్ విత్ మూంగ్‌దాల్ ఛాట్ / రెండు ఎగ్ వైట్ ఆమ్లెట్స్‌ను ఎంచుకోవడం ఉత్తమం. వీటిలో ఒకదానితో పాటు కాస్త మజ్జిగ కూడా తీసుకుంటే బ్రేక్‌ఫాస్ట్‌ను పూర్తి చేసినట్టే.
మిడ్ మార్నింగ్ స్నాక్స్‌గా..
ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం లంచ్ మధ్యలో ఎక్కువ సేపు ఖాళీ కడుపుతో ఉండకూడదు. సమయం, అనుకూలతను బట్టి (11.30 అయితే మంచిది) 100 గ్రాముల యాపిల్ ముక్కలు / జామ / స్ట్రాబెర్రీలు /బొప్పాయి / పుచ్చకాయ / నట్స్ అండ్ సీడ్స్.. వీటిలో ఏదో ఒక దానిని ఎంచుకోవాలి.
లంచ్‌లో ఏముండాలంటే..
మరీ ఆలస్యం కాకుండా 1.30-2.30 గంటల మధ్యలో మధ్యాహ్న భోజనం చేయడం మంచిది. ప్లేట్ వెజిటబుల్ సలాడ్, ఏదైనా వెజిటబుల్ కర్రీ / పప్పు / చికెన్, పెరుగు, దోసకాయ రైతా, రెండు మల్టీ గ్రెయిన్ చపాతీలు / ఒక బౌల్ బ్రౌన్ రైస్ మధ్యాహ్న భోజనంలో భాగమయ్యేలా చూసుకోవాలి.
టీ, కాఫీలకు బదులుగా..
సాయంత్రం కాగానే చాలామంది శారీరక శక్తిని కోల్పోయి నీరసించి పోతారు. ఇది ఆరోగ్యం పైనా ప్రభావం చూపుతుంది. ఇలాంటప్పుడు ఉత్తేజం కోసం కాఫీ, టీలకు బదులు అత్యవసర కొవ్వులు, ఖనిజాలు అధికంగా లభించే పదార్థాలను స్నాక్స్‌గా తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఈ క్రమంలో సాయంత్రం 4.30-5.30 సమయంలో వేయించిన మఖానా (తామర గింజలు) / కాల్చిన శెనగలు / పన్నీర్ టోస్ట్ / 100 గ్రాముల పండ్ల ముక్కలు / చికెన్ సూప్ / మల్టీగ్రెయిన్ బిస్కట్లు / బెర్రీలు-పెరుగు కాంబినేషన్ను ట్రై చేయచ్చు.
డిన్నర్ సులభంగా జీర్ణమయ్యేలా..
రాత్రి భోజనం ఎంత సులభంగా జీర్ణమయ్యేదైతే అంత మంచిది. అది కూడా ఏ అర్ధరాత్రో కాకుండా 7.30-8.30 గంటల మధ్యనే డిన్నర్‌ను పూర్తి చేయాలి. ప్లేట్ వెజిటబుల్ సలాడ్, గ్రీన్ వెజిటబుల్ కర్రీ / పన్నీర్ గ్రేవీ / చికెన్ లేదా ఫిష్ గ్రేవీ, 50-100 గ్రాముల పెరుగు, ఒక బౌల్ పెసర పప్పు కిచిడీ / వెజిటబుల్ ఓట్స్ కిచిడీ / మల్టీ గ్రెయిన్ చపాతీలు / జొన్నలు / సజ్జలతో చేసిన రొట్టెలను తీసుకోవాలి.
పడుకునే ముందు..
రాత్రి పూట పడుకోవడానికి ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని స్కిమ్డ్ / టోన్డ్ పాలను తాగాలి. ఇది నిద్రకు ప్రేరేపిస్తుంది.
ఈ డైట్‌ను పాటిస్తూనే క్రమం తప్పకుండా యోగా చేయాలి. అదే విధంగా డాక్టర్లు సూచించిన తేలికపాటి శారీరక వ్యాయామాలు కూడా భాగం చేసుకోవాలి.