అతి శుభ్రత పాటించే వాళ్లది చాదస్తం అనుకుంటాం కానీ అదో వ్యాధిలా పరిగణించం. ఇలాంటివాళ్లు ఆరోగ్యకరమైన ఆహారం తింటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలనీ ధూమపానానికి దూరంగా ఉండాలనీ చెబుతున్నారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన నిపుణులు. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్‌లో అది పక్షవాతానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
రక్తనాళంలో పూడిక రావడం లేదా దానికి రంధ్రం ఏర్పడటంతో మెదడుకి రక్తం- తద్వారా ఆక్సిజన్ అందకపోవడంతో పక్షవాతం వస్తుంది. ఇది కొందరిలో మరణానికీ కారణమవుతుంది. ఈ విషయాన్ని నిర్ధారించడంకోసం ఓసీడీ ఉన్నవాళ్లనీ, అది లేనివాళ్లనీ ఎంపికచేసి వాళ్లను కొన్నేళ్లపాటు పరిశీలించారట. ఓసీడీ లేనివాళ్లతో పోలిస్తే, ఉన్నవాళ్లు- అదీ అరవై ఏళ్లు పైబడ్డాక మూడు రెట్లు ఎక్కువగా స్ట్రోక్ బారినపడటాన్ని గమనించారట. అందుకే ఓసీడీ ఉందని గుర్తించిన వెంటనే దాన్ని తగ్గించుకునేందుకు మందులు వాడటంతోపాటు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకుంటే స్ట్రోక్ వచ్చే శాతం తక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు సదరు పరిశోధకులు.
- ఇదీ చదవండి : గంటల కొద్దీ కదలకుండా కూర్చుంటే ఆరోగ్యానికి చేటే!