వంటిల్లు.. ఓ వైద్యశాల, పోపులపెట్టె.. ఓ మెడికల్ కిట్.. ఒక్కో దినుసులో ఒక్కో పోషకం. తరచి చూస్తే వంటింట్లో రోగనిరోధక శక్తి పెంచే ఔషధాలెన్నో కనిపిస్తాయి. పోపులపెట్టెలోని.. జీలకర్ర నుంచి.. వంట చేయడానికే వాడే పాత్రల వరకు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలెన్నో. ఆరోగ్యం... మనం తీసుకునే ఆహారం, పాటించే నియమాలపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే వంటగదిని వైద్యాలయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పప్పు ధాన్యాలు... వంటింట్లో ఉండాల్సిన అత్యంత ముఖ్యమైనవి పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు. రాజ్మా, సెనగలు, సోయాబీన్స్, పెసలు వంటి పప్పుల్లో ఉండే అమినోయాసిడ్స్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. తరచూ వీటిని ఆహారంలో వినియోగిస్తే, బ్యాక్టీరియాలను నాశనం చేసి, వ్యాధులను దరిచేరకుండా కాపాడతాయి. అలాగే బార్లీ, జొన్నలు, ఓట్స్, క్వినోవా వంటి చిరుధాన్యాలు జీర్ణాశయ పనితీరును మెరుగుపరచడమే కాదు, శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.
- ఇదీ చదవండి : యువతను వేధిస్తున్న జీవనశైలి వ్యాధులు
వంటనూనెలు ...
ఆహారంలో వినియోగించే వంటనూనెలు తీవ్ర అనారోగ్యాలకు కారణమవుతాయనేది చాలామంది అపోహ. కానీ ఆవనూనె, తాజా నెయ్యి, కొబ్బరి నూనె, అన్‌రిఫైన్డ్ విత్తనాల నూనెను వంటల్లో వాడటం అలవరుచుకుంటే శరీరంలోని కొవ్వు స్థాయులను సమన్వయం చేస్తాయి.
- ఇదీ చదవండి : చిరుతిండి వల్ల బరువు తగ్గుతుందా?
మసాలా దినుసులు...
ఔషధగుణాలున్న మసాలాలకు వంటింట్లో ప్రత్యేక స్థానాన్నివ్వాలి. మెంతులు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, లవంగాలు, అల్లం, దాల్చినచెక్క, శొంఠి, లవంగాలు, యాలకులు వంటి వాటిని ఆహరంలో వాడాల్సిందే. ఇవి ఆహారానికి రంగు, రుచి, వాసనతో పాటు శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడతాయి. అలానే.. తులసి, పుదీనా, పసుపు వంటివన్నీ సీజనల్ వ్యాధులను దగ్గరకు రానీయవు.
వంటపాత్రలు...
వంటలో వేసే పదార్థాలు, కూరగాయలను ఎలా ఎంచుకుంటామో, అలాగే వాటిని వండే పాత్రల ఎంపికలోనూ శ్రద్ధవహించాలి. ఇనుము, స్టీలు, మట్టి, సెరామిక్ లేదా గాజు పాత్రలను ఉపయోగించాలి. వీటిలో పోషకాలు వృథాకాకుండా ఉంటాయి. అలాకాకుండా అల్యూమినియం, నాన్‌స్టిక్ కుక్‌వేర్స్‌ను వాడితే మాత్రం వాటిలోని రసాయనాలను వంటకాలు పీల్చుకుంటాయి. వీటిని తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరతాయి.
- ఇదీ చదవండి : జీవ వ్యర్థాలతో ముప్పు-కలగాలి కనువిప్పు!