శారీరక శ్రమ, వ్యాయామాలకూ సృజనాత్మక ఆలోచనలకూ మధ్య విడదీయరాని సంబంధం ఉంటున్నట్లు తాజా అధ్యయనం నొక్కి చెబుతోంది మరి. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు మరింత సృజనాత్మకంగా ఆలోచించే అవకాశముందని వివరిస్తోంది.
ఏమాత్రం కదలకుండా బద్దకంగా గడిపేవారితో పోలిస్తే చురుకుగా ఉండేవారు వినూత్న ఆవిష్కరణల పరీక్షల్లో మరింత మెరుగైన ఎక్కువ ఆలోచనలను వెలిబుచ్చినట్టు పరిశోధకులు గుర్తించారు. అంటే కొత్త కొత్త ఆలోచనలతో వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలంటే శరీరాన్ని శ్రమకు గురిచేయటం మంచిదని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయన్నమాట. మన ఆలోచనల తీరును వ్యాయామం ప్రభావితం చేస్తున్నట్టు ఇప్పటికే ఎన్నో రుజువులు లభించాయి. శారీరక శ్రమతో మన మెదడు పనితీరు మారిపోతున్నట్లు జంతువులు, మనుషులపై నిర్వహించిన గత అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
వ్యాయామం, శారీరక శ్రమ చేస్తున్నప్పుడు మెదడుకు మరింత ఎక్కువ రక్తం, ఆక్సిజన్, పోషకాలు అందటం దీనికి ఒక కారణం కావొచ్చు. అంతగా కదలని ఎలుకల కన్నా చురుకుగా ఉండే ఎలుకల మెదడులో కొత్త కణాలు , అది పెద్ద సంఖ్యలో పుట్టుకొస్తున్నట్లు ఇప్పటికే తేలింది. ముసలితనంలోనూ ఇవి ఆలోచనలకు సంబంధించిన పరీక్షల్లో మంచి మార్కులు కొట్టేయటం విశేషం. మనుషుల్లోనూ వ్యాయామంతో కార్యకారణ వివేచన, జ్ఞాపకశక్తి సామర్థ్యాలు పెరుగుతున్నట్లు మూడ్ ఇనుమడిస్తున్నట్టు బయటపడింది. కానీ ఆలోచనా సామర్థ్యం విషయంలో సృజనాత్మకతను అంత స్పష్టంగా పోల్చుకోవటం సాధ్యం కాదు. సృజనాత్మక స్థాయీ భేదాలను బేరీజు వేయటమూ కష్టమే. దీనికి వ్యాయామానికి లంకె ఉంటున్నట్టూ కచ్చితంగా తెలియరాలేదు. కాకపోతే ఈ రెండింటికీ మధ్య విడదీయరాని సంబంధం ఉంటున్నట్టు అన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. తాజా అధ్యయన ఫలితాలతో కొంత స్పష్టత లభించినట్టయ్యింది.
- ఇదీ చూడండి: వ్యాయామం ఆపొద్దు.. అయితే అతి వద్దు